Off The Record: గడిచిన వారం రోజులుగా జరుగుతున్న రాజకీయాలపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, సీఎం రేవంత్ రెడ్డి భేటీలపై.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రజలు భిన్నరకాలుగా చర్చించుకుంటున్నారు. ఏపీలో వేసిన ఎత్తుగడలాగే తెలంగాణలో కూడా.. బిజెపి చంద్రబాబును ముందు పెట్టి రాజకీయం నడపాలని ఆలోచనలో ఉన్నారనే చర్చ జరుగుతోంది. తెలంగాణలో సెటిలర్ల ఓటు బ్యాంకు కూడా బాగానే ఉంటుంది. గ్రేటర్ హైదరాబాద్‌లో ఈ ఓటు బ్యాంకు కాస్త ప్రభావితమైన శక్తిగానే ఉంటుంది. ఏపీలో కూటమిలో ఉన్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బిజెపి కలిసి.. తెలంగాణలోనూ రాజకీయ కూటమిని కొనసాగించాలని ఎత్తుగడలు వేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. జిహెచ్ఎంసి ఎన్నికలు నాటికి దీన్ని బలోపేతం చేసేందుకే.. చంద్రబాబు పావులు కదుపుతున్నారని టాక్ నడుస్తోంది. ఇప్పుడు తెలంగాణలో చంద్రబాబుని బిజెపి నడిపిస్తోందని.. కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి. ఇదే అంశంపై పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి.. పార్టీ నాయకత్వాన్ని అలర్ట్ చేశారు. అయితే బిజెపి దక్షిణాదిలో పాగా వేసేందుకు ఆంధ్రప్రదేశ్‌ను తురుపుముక్కగా మలుచుకొని.. తెలంగాణ వైపు అడుగులు వేసిందని అభిప్రాయాన్ని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. దీనికి చంద్రబాబు నాయుడు రాష్ట్ర విభజన సమస్యలు ఎజెండాగా తెలంగాణలోకి ఎంటర్ అవుతున్నారనే మరో వాదన కూడా ఉంది.
Read Also: Top Headlines @ 9 PM: టాప్ న్యూస్
విభజన హామీల సమావేశానికి హాజరైన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.. పార్టీ నాయకులతో ట్రస్ట్ భవన్‌లో సమావేశం నిర్వహించారు. తెలంగాణలో పార్టీని బలోపేతం చేస్తామంటూ కామెంట్లు చేశారు. కాంగ్రెస్ వర్గం చేసిన వాదనకి.. చంద్రబాబు ఎత్తుగడలు బలం చేకూరుస్తున్నాయి. అయితే సీఎం రేవంత్ రెడ్డి కూడా.. అదే తరహాలో కౌంటర్ ఎటాక్‌ని మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. తెలంగాణకు వచ్చి చంద్రబాబు చేసిన రాజకీయ ప్రసంగానికి.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఏపీకి వెళ్లి కౌంటర్ స్టేట్‌మెంట్ ఇచ్చి వచ్చారు. మాజీ సీఎం రాజశేఖర్‌రెడ్డి 75వ జయంతి కార్యక్రమంలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ఏపీలో బిజెపి కూటమి ఉందని.. బిజెపి కూటమిని ఎదుర్కోవడానికి షర్మిల ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. తెలంగాణలో చంద్రబాబు నాయుడు పాలిటిక్స్ అమలు చేయాలనుకుంటే.. ఏపీలో ప్రతిపక్షాన్ని సిద్ధం చేయడానికి రేవంత్ రెడ్డి రెడీ అనే ఇండికేషన్ ఇచ్చారన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. చంద్రబాబు తెలంగాణలో పాలిటిక్స్ మొదలుపెడితే.. ఏపీలో కౌంటర్ పాలిటిక్స్ మొదలు పెడతామనేలా విజయవాడ సభ ద్వారా రేవంత్‌రెడ్డి సంకేతాలు ఇచ్చినట్లు తెలస్తోంది. ఏ మాటకామాట చంద్రబాబు కౌంటర్‌కు.. రేవంత్ చేస్తున్న పొలిటికల్ ఎన్కౌంటర్ చూస్తుంటే తమ్ముడు తమ్ముడే అనే సామెత గుర్తొస్తుంది. ఇద్దరు ముఖ్యమంత్రుల పొలిటికల్ కామెంట్లతో తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. చంద్రబాబు, రేవంత్‌రెడ్డి ఎలాంటి వ్యూహాలు అనుసరిస్తారనేది ఉత్కంఠ రేపుతోంది.