దేశవ్యాప్తంగా BRS కార్యకలాపాలు ప్రారంభించే దిశగా గులాబీ శిబిరంలో వేగంగా అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే ఢిల్లీలో పార్టీ కార్యాలయం సిద్ధమైంది. ఇక జరగాల్సిన మరో ముచ్చట.. పార్టీకి కొత్త కమిటీల ప్రకటన. ఆ పనిలోనే ఉన్నారు గులాబీ దళపతి. జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలనే ఆలోచనలో ఉన్న సీఎం కేసీఆర్.. అందుకు తగ్గట్టుగానే పార్టీ కమిటీని వేసే పనిలో ఉన్నారు. ఆ ఫ్రేమ్‌లో పట్టేవారికే బీఆర్‌ఎస్ పదవులు కట్టబెడతారని సమాచారం. ఇతర రాష్ట్రాల్లో BRS విస్తరించేందుకు ప్రత్యేకంగా కమిటీలు వేస్తారని తెలుస్తోంది. ఆ విషయం తెలుసుకున్న కొందరు గులాబీ నేతలు.. ఆ పదవులు చేజిక్కించుకునేలా ఎత్తుగడలు వేస్తున్నారట.
ఇతర రాష్ట్రాల్లో పాగా వేయాలంటే.. స్థానిక భాషలపై పట్టు ఉంటే పని మరింత ఈజీ అవుతుంది. ఉత్తరాదిలో హిందీ బెల్ట్ ఎక్కువ కావడంతో.. ఆ భాష అనర్గళంగా మాట్లాడే పార్టీ నేతలపై గులాబీ పెద్దలు ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. జాతీయ రాజకీయాలపై మక్కువతో ఆ పదవులు చేపట్టాలని ఆశిస్తున్నవాళ్లు తమకున్న పరిచయాలతో లాబీయింగ్ మొదలుపెట్టారట. కొందరు టీఆర్ఎస్ నేతలైతే.. హిందీ భాషపై పట్టు పెంచుకునే ప్రయత్నాల్లో ఉన్నారట. ప్రత్యేకంగా ట్యూటర్లను పెట్టుకుని హిందీ నేర్చుకుంటున్నట్టు సమాచారం. ఇప్పటికే కాస్తోకూస్తో హిందీ వచ్చిన నేతలు.. మరింత ప్రావీణ్యం సాధించే పనిలో నిమగ్నం అయ్యారట. వివిధ రాష్ట్రాలకు బీఆర్‌ఎస్ కోఆర్డినేటర్ల నియామకంతోపాటు అనుబంధంగా రైతు విభాగం కూడా ఉండబోతోందట. అంటే మరికొన్ని పార్టీ పదవులు అదనంగా లభిస్తాయి. అలాగే ఢిల్లీలో ఉంటూ పార్టీ కార్యకలాపాల నిర్వహణతోపాటు వివిధ రాష్ట్రాల్లో BRS విస్తరణ బాధ్యతలు కొందరికి అప్పగించాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారట. వాటిపై త్వరలోనే స్పష్టత వస్తుందని పార్టీ వర్గాలు ఆశిస్తున్నాయి. ఢిల్లీలో బీఆర్ఎస్ ఆఫీసు ప్రారంభం తర్వాత సీఎం కేసీఆర్ పార్టీ కార్యకలాపాల స్పీడ్ పెంచుతారని చెబుతున్నారు. మహారాష్ట్ర నుంచి పర్యటన మొదలుపెట్టి.. ఢిల్లీలో బహిరంగ సభ నిర్వహణకు కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ లోగానే కమిటీలు కొలిక్కి వస్తాయని.. ఆ పదవులను ఒడిసి పడితే.. రాజకీయాల్లో కొత్తగా రెక్కలు విచ్చుకుంటాయనే ఆశల్లో ఉన్నారు గులాబీ నేతలు.
