NTV Telugu Site icon

Off The Record: బీఆర్‌ఎస్‌ గందరగోళంలో ఉందా? ఆ సర్వే రిపోర్ట్ పై కన్ఫ్యూజ్‌ అవుతోందా?

Kavitha

Kavitha

Off The Record: తెలంగాణ సామాజిక, ఆర్ధిక, ఉపాధి, విద్య, రాజకీయ, కుల సర్వే-2024 నివేదికను చట్ట సభల్లో ప్రవేశపెట్టిన సమయంలో ప్రతిపక్షం బీఆర్ఎస్ వైఖరి చర్చనీయాంశమైంది. ఆ పార్టీ వైఖకి అసెంబ్లీలో ఒకలా, శాసన మండలిలో మరోలా ఉండటం ఏంటో అర్ధంకావడం లేదంటున్నారు పొలిటికల్‌ పండిట్స్‌. కులగణన సర్వే నివేదిక సమగ్రంగా లేదని నిరసన వ్యక్తం చేస్తూ.. శాసనమండలి నుంచి వాకౌట్ చేశారు పార్టీ ఎమ్మెల్సీలు. కుల గణన పేరుతో బీసీల హక్కుల్ని కాలరాస్తున్నారని ఆరోపించారు శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి. అందుకే… నిరసనగా సభ నుంచి వాకౌట్ చేశామన్నారాయన. సర్వే నివేదికలో శాస్త్రీయత లోపించిందని, బీసీల జనాభా లెక్కలు తప్పుల తడకగా ఉన్నాయన్న శాసనమండలిలో బీఆర్‌ఎస్‌ పక్షం అభిప్రాయం.

ఇక జాతీయ స్థాయిలో కులగణన నిర్వహించాలని కోరుతూ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మండలిలో తీర్మానం ప్రవేశపెడుతుండగా.. నిరసన తెలుపుతూ.. వాకౌట్‌ చేశారు బీఆర్‌ఎస్‌ సభ్యులు. అంతకు ముందు చైర్మన్‌ పోడియం వైపు దూసుకెళ్లి.. కొంతసేపు నిరసన వ్యక్తం చేశారు. అయితే వాకౌట్‌ సమయంలోనే అసలు ట్విస్ట్‌ చోటు చేసుకుంది. బీఆర్‌కు ఒక స్టాండ్‌ అంటూ లేదా అన్న అనుమానాలు కూడా అక్కడే వచ్చాయట. పోడియం దగ్గర నిరసన తెలిపాక పార్టీ సభ్యులంతా వాకౌట్‌ చేసి బయటికి వెళ్ళిపోయినా.. ఎమ్మెల్సీ కవిత మాత్రం సభలోనే ఉండిపోవడం చర్చనీయాంశం అయింది. అంటే… వాకౌట్‌ చేస్తున్నట్టు మధుసూదనచారి చేసిన ప్రకటన కవితకు వినిపించలేదా? ఒకవేళ వినిపించినా… కావాలని అలాగే కూర్చున్నారా? అన్న ప్రశ్నలకు సమాధానాలు వెదికే పనిలో ఉన్నారు పొలిటికల్‌ పండిట్స్‌. ఈ క్రమంలోనే రకరకాల విశ్లేషణలు వినిపిస్తున్నాయి. కొంతకాలంగా బీసీ రిజర్వేషన్ల ఉద్యమం చేస్తున్నారు కవిత. బీసీ సంఘాల ప్రతినిధులతో సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే… బీసీ జనగణనపై చర్చ జరుగుతున్నప్పుడు ఆమె వాకౌట్‌ చేసి ఉండకపోవచ్చని అంటున్నారు.

అదే సమయంలో ఈ పాయింట్‌ మీదే మరో అనుబంధ అనుమానం వస్తోందట. కవిత బీసీ ఉద్యమం చేస్తున్నారు, ఆమెకు కొన్ని ఆబ్లిగేషన్స్‌ ఉన్నాయి సరే… మరి ఆ విషయాన్ని పార్టీ నేతలతో ఎందుకు చర్చించలేదు? సభలో అంతా ఒకే మాట మీద ఎందుకు నిలబడలేకపోయారు? కవితకు సంబంధం లేకుండానే మధుసూదనాచారి వాకౌట్‌ నిర్ణయాన్ని ప్రకటించేశారా? అంటే… ఒక విధాన నిర్ణయం అంటూ లేకుండానే బీఆర్‌ఎస్‌ శాసనమండలిలో అడుగుపెట్టిందా అన్న ప్రశ్నలు వస్తున్నాయట. అయితే… జరిగిన పరిణామంపై బీఆర్ఎస్ సర్దిచెప్పుకునే ప్రయత్నంలో ఉందట. వాకౌట్ చేసిన సమయంలో అందరు సభ్యులతోపాటు కవిత కూడా బయటకు వచ్చి… తిరిగి వెంటనే సభలోకి వెళ్ళిపోయినట్టు చెప్పుకొస్తున్నారు. అటు అసెంబ్లీలో కూడా కవిత ప్రస్తావన వచ్చింది. ప్రభుత్వం నిర్వహించిన కుటుంబ సర్వేలో కేసీఆర్ కుటుంబం నుంచి ఎమ్మెల్సీ కవిత ఒక్కరే తన వివరాలు తెలియజేశారని, కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావుతో పాటు ఇతర బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా సర్వేలో పాల్గొనలేదని అసెంబ్లీలో అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సర్వే జరిగిన విధానాన్ని బీఆర్ఎస్ వ్యతిరేకిస్తే… ఎమ్మెల్సీ కవిత ఒక్కరే కుటుంబ వివరాలు ఇవ్వడం అప్పట్లో పార్టీ పరంగా చర్చనీయాంశం అయ్యిందట.

మరోవైపు ఇటీవల బీసీ నేతల సమావేశాన్ని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిర్వహించాలని అనుకుంటుండగానే… ఆయన కంటే ముందే కవిత బీసీ రిజర్వేషన్లపై పార్టీ బీసీ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారంటూ గుర్తు చేసుకుంటున్నారు బీఆర్‌ఎస్‌ నాయకులు. ఇక అసెంబ్లీలో బీఆర్‌ఎస్‌ వ్యూహం కూడా గందరగోళంగా ఉందని అంటున్నారు. కుటుంబ సర్వేపై చర్చ జరిగినంతసేపు సభలోనే ఉన్నారు ఆ పార్టీ సభ్యులు. చర్చలో పాల్గొన్నారు. ఆ తర్వాత ఎస్సీ వర్గీకరణ అంశంపై చర్చ మొదలైంది. కానీ… పార్టీ తరపున ఎస్సీ వర్గీకరణ మీద మాట్లాడాల్సిన టైంలో… దానికి బదులు పాత కుటుంబ సర్వేపై చర్చకు నిసరనగా వాకౌట్‌ చేస్తున్నట్టు ప్రకటించి వెళ్ళిపోయారు. కుటుంబ సర్వేకు నిరసనగా వాకౌట్‌ చేస్తే… దానిపై చర్చ జరిగేటప్పుడే వెళ్లాలిగానీ… సబ్జెక్ట్‌ మారాక పాత అంశం మీద వాకౌట్‌ చేయడం ఏం వ్యూహమో అర్ధం కావడం లేదంటున్నారు పరిశీలకులు. ఇలా ఒక్కో సభలో ఒక్కోలా? ఒక్కో సభ్యుడు ఒక్కోలా వ్యవహరించడంతో…ప్రస్తుతానికి బీఆర్‌ఎస్‌కు ఒక స్టాండ్ లేకుండా పోయిందా అంటూ అసెంబ్లీ, మండలి లాబీల్లో గుసగుసలాడుకున్నారట.