NTV Telugu Site icon

Off The Record: తెలుగు రాష్ట్రాల్లో బీజేపీని రంజాన్‌ ఇరుకున పడేసిందా..?

Ramzan Politics

Ramzan Politics

Off The Record: తెలంగాణలో కొత్త రాజకీయ రగడ మొదలైంది. కాకుంటే… ఇది మత పరంగా సున్నితమైన అంశం కావడంతో… జాగ్రత్తగా గమనిస్తున్నాయి రాజకీయ వర్గాలు. ఇదే సమయంలో బీజేపీ డబుల్‌ స్టాండర్డ్స్‌ అనుసరిస్తోందన్న చర్చ సైతం మొదలైంది. త్వరలో రంజాన్‌ మాసం మొదలవబోతోంది. ఈ సందర్భంగా ముస్లిం ఉద్యోగులకు ప్రత్యేక వెసులుబాట్లు కల్పించాయి ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు. ఆఫీస్‌ సాధారణ సమయం కంటే ఒక గంట ముందే… అంటే సాయంత్రం నాలుగు గంటలకే ముస్లిం ఉద్యోగులంతా విధులు ముగించుకుని వెళ్ళిపోవచ్చు. మార్చి రెండు నుంచి ఆ నెలాఖరు వరకు ఈ వెసులు బాటు ఉంటుంది. ఈ ప్రకారం రెండు రాష్ట్రాల్లోనూ ముస్లిం ప్రభుత్వ ఉద్యోగులకు సాయంత్రం 4 గంటలకే విధులను ముగించుకుని వెళ్ళిపోవచ్చు. అయితే… తెలంగాణలోఈ వెసులుబాటునే తప్పు పడుతున్నాయి బీజేపీ వర్గాలు. టీజీ బీజేపీ సీనియర్‌ లీడర్స్‌ అయితే.. ఓ అడుగు ముందుకేసి ఈ వెసులుబాటుకు, అయ్యప్ప, భవానీ, హనుమాన్‌ మాలధారులకు ముడిపెట్టి మాట్లాడుతున్నారు.

తెలంగాణ ప్రభుత్వం ఇచ్చే వెసులుబాట్లు కేవలం రంజాన్‌కేనా? ఇతర మాలధారులకు ఎందుకు ఇవ్వరంటూ ప్రశ్నించారు కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్‌. అలాగే, బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ మాట్లాడుతూ, రంజాన్‌ పండుగ కోసం ప్రభుత్వం ఇచ్చిన జీవో సరైంది కాదని అన్నారు. దేవీ నవరాత్రుల సమయంలో హిందూ ఉద్యోగులకు ఇలాంటి వెసులుబాటు ఎందుకు ఇవ్వరన్నది ఆయన క్వశ్చన్‌. తెలంగాణ ప్రభుత్వానికి ఒక మతం పండగే కనిపిస్తుందా అని కూడా ప్రశ్నించారు రాజాసింగ్‌. వాళ్ళ ప్రశ్నలు, ఉద్దేశ్యాలు ఎలా ఉన్నా… అసలు రాజకీయం ఇక్కడే మొదలైంది. బీజేపీ వైఖరిని కాంగ్రెస్‌ నేతలు తీవ్రంగా తప్పు పడుతున్నారు. తెలంగాణలో పొలిటికల్‌గా ఏదో చేసేయాలన్న ఉద్దేశ్యంతోనే ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారన్నది కాంగ్రెస్‌ అభిప్రాయం. అదే సమయంలో వేళ్ళు ఏపీ వైపు చూపిస్తున్నారు హస్తం పార్టీ లీడర్స్‌. ఆంధ్రప్రదేశ్‌లో మీరు భాగస్వామిగా ఉన్న కూటమి ప్రభుత్వం కూడా వెసులుబాటు సర్క్యులర్‌ ఇచ్చింది కదా… మరి అక్కడెందుకు ప్రశ్నించరన్నది కాంగ్రెస్‌ క్వశ్చన్‌. ఏపీలో తమ ప్రభుత్వాన్ని వదిలేసి… తెలంగాణలో అదే తరహా వెసులుబాట్లు ఇచ్చిన కాంగ్రెస్‌ సర్కార్‌ని విమర్శించడం ద్వంద్వ నీతి కాక ఇంకేంటని అడుగుతున్నారట టీజీ కాంగ్రెస్‌ నాయకులు.

మీకు నిజంగానే అభ్యంతరాలుంటే…. ఏపీలో ఉన్న మీ ప్రభుత్వానికి చెప్పండి… ఇక్కడ అనవసర రాజకీయాలు చేసి మతపరమైన ఉద్రిక్తతల్ని రెచ్చగొట్టవద్దని బీజేపీ నాయకులకు స్ట్రాంగ్‌గా చెబుతున్నారట కాంగ్రెస్‌ లీడర్స్‌. అంతలా అభ్యంతరాలుంటే… ఏపీ బీజేపీ లీడర్స్‌ కూడా మాట్లాడాలికదా…. ప్రభుత్వంలో ఉండి కూడా అక్కడ కామైపోయి తెలంగాణలో మాత్రం మాట్లాడ్డం ఏంటన్నది కాంగ్రెస్‌ క్వశ్చన్‌గా తెలుస్తోంది. ఈ వివాదం ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి మరి.