NTV Telugu Site icon

Off The Record: ఈటల టార్గెట్‌గా సోషల్ మీడియాలో ప్రచారం..! పావులు కదుపుతున్నారా..?

Etela Rajender

Etela Rajender

Off The Record: మాజీ మంత్రి, బీజేపీ నాయకుడు ఈటల రాజేందర్‌ టార్గెట్‌గా ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ఏ రేంజ్‌ ప్రచారం జరుగుతోంది. అందులో నిజానిజాల సంగతి ఎలా ఉన్నా… ప్రచారం మాత్రం కచ్చితంగా ఆయనకు బీజేపీ పరంగా వచ్చే అవకాశాల్ని దెబ్బ తీస్తుందన్న అంచనాలున్నాయి. దీంతో.. సోషల్‌ మీడియా వేదికగా ఈటలను కేంద్ర బిందువుగా చేసుకుని జరుగుతున్న ప్రచారంలో నిజం ఉందా? లేక ఎవరైనా కావాలని టార్గెట్‌ చేస్తున్నారా అన్న ఆరాలు పెరిగిపోతున్నాయి పొలిటికల్‌ సర్కిల్స్‌లో. రాజేందర్‌కు, కేసీఆర్‌కు మధ్య బంధం మళ్ళీ పెరుగుతోందన్నట్టుగా ఉన్న ఆ ప్రచారం రాజకీయ సంచలనం అవుతోంది. ఈటల మాజీ బాస్‌ కేసీఆర్‌.. ఆయనకు ఫోన్‌ చేశారని, ఎలా ఉన్నావ్ రాజేంద్ర… అంటూ ప్రేమగా మాట్లాడారని,ఉద్యమ రోజులు యాదికి వచ్చినయి. అందుకే ఫోన్‌ చేశాను రాజేందర్‌ అంటూ కేసీఆర్‌ ఈటలతో మాట్లాడారన్నది ఆ సోషల్‌ మీడియా పోస్ట్‌ సారాంశం.

Read Also: Off The Record: ఆ వైసీపీ ఎమ్మెల్యే సొంత పార్టీకి దూరం అవుతున్నారా?

ప్రస్తుత రాజకీయాల్లో నీ శైలి, పంథా మరిన తీరు బాగుందంటూ కేసీఆర్‌ కితాబు ఇచ్చారని, త్వరలోనే కలుద్దాం అంటూ ఫోన్‌లో మాటా మంతి కలిపారంటూ ఆ పోస్టింగ్‌లో రాసుకొచ్చారు. ఇదే ఇప్పుడు పొలిటికల్‌గా పెను సంచలనానికి కారణం అవుతోంది. అసలు ఆ ప్రచారాన్ని ఎవరు మొదలుపెట్టారు? ఎందుకు మొదలుపెట్టారు? వాళ్ళ టార్గెట్‌ ఏంటి అన్న చర్చ జరుగుతోంది. అదే పోస్ట్‌ను ఇటు కాంగ్రెస్‌, అటు బీఆర్‌ఎస్‌ వర్గాలు విస్తృతంగా ప్రచారంలో పెట్టడంతో.. అనుమానాలు ఇంకా పెరుగుతున్నాయట. ఇంత కాలం లేనిది ఇప్పుడు ఈటలను వివాదంలోకి ఎందుకు లాగుతున్నారన్న ప్రశ్నకు సమాధానం వెదుకుతున్నారు పొలిటికల్‌ పండిట్స్‌. 2021 ఏప్రిల్‌లో రాజేందర్‌ను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేశాక తన రాజకీయ భవిష్యత్‌ వెదుక్కుంటూ బీజేపీలో చేరారాయన. ఆ తర్వాత హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో గెలిచి ఒక రకంగా కేసీఆర్‌కు సవాల్‌ విసిరారు. ఇక 2023 అసెంబ్లీ ఎన్నికల్లో గజ్వేల్‌లో కేసీఆర్‌ మీద పోటీ చేసి ఓడిపోయారు ఈటల. ఆ తర్వాత జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో మల్కాజిగిరి ఎంపీగా విజయం సాధించారాయన. ఇక క్రమంగా బీజేపీలో కుదురుకుంటున్న ఎంపీకి… తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి వచ్చే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. ఈ పరిస్థితుల్లోనే… కేసీఆర్‌ ఫోన్‌కాల్‌ పేరుతో జరుగుతున్న ప్రచారం రాజకీయ దుమారం రేపుతోంది.

Read Also: Uttar Pradesh : కొత్త పెళ్లైన జంట మధ్య బొట్టు బిళ్ల పెట్టిన చిచ్చు.. చివరికి ఏమైందంటే ?

ఇదే ఇప్పుడు తెలంగాణ పొలిటికల్‌ సర్కిల్స్‌లో హాట్‌ టాపిక్‌. ఆయనకు అధ్యక్ష పదవిపై బీజేపీలో భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. ఆర్‌ఎస్‌ఎస్‌ భావజాలం నిలువెల్లా… ఉన్న నేతలు కొందరు ఈటలను వద్దంటున్నట్టు సమాచారం. మరొక వర్గం మాత్రం బీసీ సామాజిక వర్గానికి చెందిన నాయకుడికి అధ్యక్ష పదవి ఇస్తే బీఆర్‌ఎస్‌ను దెబ్బకొట్టొచ్చన్న అభిప్రాయం వ్యక్తం చేస్తోందట. మూడున్నరేళ్ల తరువాత జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తమదే విజయం అంటున్న తెలంగాణ కమలనాథులు ఈటలకు అధ్యక్ష పదవి ఇస్తే బీఆర్‌ఎస్‌ తుడిచిపెట్టుకుపోతుందని, ఆయనకు ఆ పార్టీలో కింది స్థాయి నుంచి సంబంధాలు ఉన్న దృష్ట్యా అధ్యక్ష పదవి సమంజసమని అంటున్నారట. కానీ… మరో ఎంపీ ధర్మపురి అర్వింద్‌ తనకు అధ్యక్ష పదవి కావాలని పట్టపడుతున్నారట. బీసీల నుంచి ఇద్దరు నేతలు బరిలో ఉండగా అర్వింద్‌ నియోజకవర్గానికి పసుపు బోర్డ్‌ ఇచ్చి అధ్యక్ష రేసు నుంచి తప్పించారంటూ బీజేపీ అంతర్గత వ్యవహారాలతో ఏ మాత్రం సంబంధంలేని బిఆర్‌ఎస్‌ నేత కవిత బాహాటంగానే అన్నారు. దాంతో ఇప్పుడు ఈటలకు కేసీఆర్‌ ఫోన్‌ చేశారన్న ప్రచారం వెనక బీఆర్‌ఎస్‌ ఉందా అన్న అనుమానాలు సైతం వ్యక్తం అవుతున్నాయట. ఆ సంభాషణ ప్రచారం కేవలం మైండ్‌ గేమ్‌ పాలిటిక్స్‌ అని అంటోంది ఈటల వర్గం. ఇదంతా కుట్ర పూరిత వ్యవహారమని కూడా తేల్చిపారేశారు ఎంపీ. కేసీఆర్‌ నాతో మాట్లాడింది లేదు, నేను కేసీఆర్‌తో మాట్లాడింది లేదు, ఆయనకు నాకు మధ్య ఉన్న బంధం ఎప్పుడో తెగిపోయిందన్నది రాజేందర్‌ వెర్షన్‌.దీంతో ఇప్పుడు ఈ ప్రచారం ఎపిసోడ్‌ చుట్టూ రకరకాల అనుమానాలు పెరుగుతున్నారు.