Off The Record: విశాఖ ఉత్తరం నియోజకవర్గంలో టీడీపీ, వైసీపీ బలమైన రాజకీయ పక్షాలు. పునర్విభజన తర్వాత ఏర్పడిన ఈ స్థానంపై పట్టుసాధించేందుకు ప్రధాన పార్టీలు గట్టిగానే పోరాడుతుంటాయి. 2009లో తొలిసారి ఈ నియోజకవర్గానికి ఎన్నికలు జరగ్గా కాంగ్రెస్ పార్టీ గెలిచింది. 2014లో కూటమి అభ్యర్థిగా విష్ణుకుమార్ రాజు విజయం సాధించారు. ఇక 2019లో ఒంటరిగా పోటీ చేసిన టీడీపీ స్వల్ప మెజారిటీతో బయటపడింది. ఆ ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేగా బరిలోకి దిగిన విష్ణు నాలుగో స్థానంతో సరిపెట్టుకోక తప్పలేదు. ఇక్కడ బలమైన ఓట్ బ్యాంక్ వున్న వైసీపీ రెండు సార్లు పోటీ చేసినా… బోణీ కొట్టలేకపోయింది. వైజాగ్ నార్త్‌లో వరుసగా గెలిచిన పార్టీలు కానీ, ఎమ్మెల్యేలు కానీ లేకపోవడం ప్రత్యేకత. ఐతే, ఈ సెంటిమెంట్ ను గత ఎన్నికల్లో బ్రేక్ చేశారు బీజేపీ అభ్యర్థి విష్ణుకుమార్ రాజు. జనసేన బలం, టీడీపీ కేడర్ నెట్వర్క్ కలిసి రావడంతో సుమారు 47వేల ఓట్ల ఆధిక్యంతో కాషాయ ఎమ్మెల్యేగా విజయపతాక ఎగుర వేశారాయన. వరుసగా రెండోసారి బీజేపీ శాసన సభాపక్ష నేతగా ఛాన్స్ దక్కించుకున్నారాయన. సరిగ్గా ఇక్కడ నుంచే రాజుగారి మదిలో సరికొత్త ప్లాన్ తట్టిందట. ఆయన తన ఆలోచనలకు కార్యరూపం ఇచ్చే ప్రయత్నంలో ఉన్నట్టు ఇటీవల పరిణామాలను బట్టి అర్ధమవుతోందంటున్నారు పరిశీలకులు.
Read Also: OG: ఏపీలో ఓజీ బెనిఫిట్ షోకి ప్రభుత్వం ఓకే
రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని నియోజకవర్గాల్లో కూటమి పార్టీల మధ్య సయోధ్య ప్రశ్నార్థకమవుతోంది. కలిసి నడవాలని అధినాయకత్వాలు ఆదేశిస్తున్నా…. క్షేత్రస్థాయిలో మాత్రం పొసగడం లేదన్న ఫిర్యాదులు పెరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఎమ్మెల్యేలకు తలపోట్లు మొదలయ్యాయి. ఆ పరిణామాల్ని గమనిస్తున్న విష్ణుకుమార్ రాజు ముందే జాగ్రత్త పడుతున్నారట. కూటమి నేతల నుంచి రాజకీయ పోటీ ఎదురవకుండా వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది. విశాఖ ఉత్తరంలో ఓ ఊపు ఊపిన జనసేన… ప్రస్తుతం స్తబ్దుగా ఉంది. ఇక్కడ ఫ్యాన్స్ అసోసియేషన్స్, కాపు ఓటర్లు కామ్‌గా ఉన్నారు. ఈ నియోజకవర్గంలో దశాబ్ద కాలంగా పొత్తుల వల్ల ఎక్కువ నష్టపోయింది టీడీపీనే అన్న అభిప్రాయం ఉంది. ఆ పార్టీకి ఇక్కడ ద్వితీయ శ్రేణి నాయకత్వం తప్ప సరైన ఇన్ఛార్జ్ లేరు. అందుకోసం ఎన్నిసార్లు ఒత్తిడి చేసినా అధినాయకత్వం మాత్రం పట్టించుకోకపోవడం నార్త్ టీడీపీని నైరాశ్యంలోకి నెట్టేస్తోంది. కూటమి భాగస్వామ్య పార్టీయే అయినప్పటికీ… ప్రతి చిన్న అవసరానికి బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు గడప తొక్కడం ఇబ్బందిగా మారిందన్నది ఇక్కడే టీడీపీ లీడర్స్ బాధ. కాపు, గవర, వెలమ, కళింగ, మైనారిటీ సామాజిక వర్గాలు ఎక్కువగా ఉండే ఈ సీట్లో… తెలుగుదేశానికి కూడా బలమైన నాయకుడు కావాలన్న డిమాండ్ పెరుగుతోంది.
కానీ…. టీడీపీ హైకమాండ్ తెగించి నిర్ణయం తీసుకోకపోగా… విశాఖ ఎంపీ శ్రీభరత్ భుజాలపై బాధ్యతలు పెట్టింది. దీంతో వ్యవహారం పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్టు అయ్యిందనే నిట్టూర్పులు వినిపిస్తున్నాయట. వాస్తవానికి టీడీపీలో నార్త్ నాయకత్వం కోసం చాలా పోటీ ఉంది. VMRDA చైర్మన్ ప్రణవ్ గోపాల్, మైనార్టీ నేత నజీర్, మరో నాయకుడు భరత్‌తో పాటు రాజకీయ భవిషత్తు కోరుకుంటున్న చాలా మందే ఇంచార్జ్ బాధ్యతల కోసం ఎదురు చూస్తున్నారు. కొందరైతే ఇప్పటికే లోకల్‌గా మంచి – చెడులకు అటెండ్ అవుతూ… చేతి చమురు వదిలించుకుంటున్నారు. ఈ స్థాయిలో ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ ఇంచార్జ్ నియామకంలో జాప్యం వెనుక విష్ణు వ్యూహం ఉందన్నది టీడీపీ నేతల అనుమానం. రెండు రోజుల క్రితం బీజేపీ సారథ్యం పేరుతో బహిరంగ సభ నిర్వహించింది. జాతీయ అధ్యక్షుడు నడ్డా హాజరైన ఈ పబ్లిక్ మీటింగ్‌లో కీలక వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యే. విశాఖ ఉత్తరంలో బీజేపీని ప్రజలు ఆదరిస్తున్నారని, తన గెలుపు చరిత్రాత్మకమని అభివర్ణించారు. ఈ వ్యాఖ్యలపై టీడీపీ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ మొదలైంది. కూటమి ఉన్నంత కాలం తానే పోటీ చేస్తానని విష్ణు చెప్పకనే చెప్పేశారా అని విశ్లేషిస్తున్నాయి రాజకీయ వర్గాలు. మరోవైపు, విష్ణు వారసురాలిగా కుమార్తె శ్యామల నియోజకవర్గ రాజకీయాల్లో చురుగ్గా వ్యవహరిస్తున్నారు. అధికారిక, అనధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటూ రాజకీయ అనుభవాన్ని గడించే ప్రయత్నంలో ఉన్నారు. దీంతో నార్త్ టీడీపీకి ఇప్పట్లో నాయకత్వం కష్టమేనన్న అభిప్రాయం బలపడుతోంది కేడర్‌లో. మన గతి ఇంతేనని సరిపెట్టుకుంటారా? లేక సమర్ధ నాయకత్వం కోసం వత్తిడి పెంచుతారా అన్నది చూడాలి.
