Off The Record: మంచు మనోజ్ , మౌనిక ఆళ్లగడ్డ ఎంట్రీ ఎపిసోడ్ ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. పెళ్ళి తర్వాత వారిద్దరూ ఇక్కడికి రావడం కొత్తేమీ కాకున్నా.. ఇప్పుడున్న పరిస్థితుల్లో చర్చనీయాంశం అవుతోంది. భూమా శోభానాగిరెడ్డి జయంతి సందర్భంగా తల్లి దండ్రులకు నివాళులు అర్పించేందుకు వచ్చారు మౌనిక దంపతులు. అయితే అదొక్కటే రీజన్ కాదని, అంతకు మించిన కారణాలు వేరే ఉన్నాయని అంటున్నారు. అక్క అఖిల ప్రియ, మౌనిక మధ్య ఆస్తి వివాదాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. అక్కచెల్లెళ్ళ కుటుంబాలు అత్యంత అరుదుగా మాత్రమే కలుస్తుండటం అందుకు బలం చేకూరుస్తోందని అంటున్నారు పరిశీలకులు. గతంలో మనోజ్, మౌనిక ఆళ్లగడ్డకు వచ్చి భూమా ఘాట్ లో నివాళులు అర్పించి భూమా అఖిలప్రియను కలవకుండానే వెళ్లిపోయారు. దీంతో అక్క చెల్లెళ్ళ మధ్య సంబంధాలు సరిగా లేవన్న ప్రచారం ఊపందుకుంది. ఇక మనోజ్‌తో మౌనిక పెళ్ళి తర్వాత ఆళ్ళగడ్డకు రావడమే తక్కువైందట. అసెంబ్లీ ఎన్నికల్లో భూమా అఖిలప్రియ ఆళ్లగడ్డ ఎమ్మెల్యేగా పోటీ చేసినా… చెల్లిగా మౌనిక ప్రచారం కూడా చేయలేదు. తల్లిదండ్రుల వర్ధంతి, జయంతి కార్యక్రమాలకు మినహా సొంతూరికి వెళ్ళడం మానేశారట ఆమె. ఈ పరిణామాలన్నిటినీ కలగలిపి చూస్తున్న వారు మాత్రం… అఖిల, మౌనిక మధ్య సఖ్యత లేదన్న ప్రచారాన్ని మొదలుపెట్టేశారు.
Read Also: Children’s Health: చలికాలంలో పిల్లల ఆరోగ్యం పదిలం.. ఈ జాగ్రత్తలు పాటించండి
ఇక తాజాగా నటుడు మోహన్ బాబు కుటుంబంలో విభేదాలు వీధికెక్కడం, గొడవలకు కారణం మౌనిక అంటూ మోహన్‌బాబు ఆడియో విడుదల చేయడం వంటి పరిణామ క్రమంలో… శోభ జయంతికి మౌనిక, మనోజ్ దంపతులు రావడంతో సర్వత్రా ఆసక్తి పెరిగింది. పిల్లలు, తమ సన్నిహితులతో కలిసి హైద్రాబాద్ నుంచి 16 వాహనాల్లో ఆళ్ళగడ్డ వచ్చారు మంచు మనోజ్, మౌనిక. భూమా ఘాట్‌లో నివాళులు అర్పించాక నేరుగా ఇంటికి వెళ్లారు. ఎమ్మెల్యే అఖిల అధికారిక కార్యక్రమాల్లో ఉండడంతో మౌనిక ఇంటికి వచ్చిన కొద్దిసేపటి తర్వాత ఇంటికి వచ్చారామె. రెండు కుటుంబాలు కలిసే భోజనం చేశాయి. ఇటీవలి కాలంలో ఎన్నడూ లేని విధంగా అక్క చెల్లెళ్ళ కుటుంబాలు గంటల తరబడి కలిసి ఉండటం ఇటు రాజకీయంగా హాట్ సబ్జెక్ట్ అయింది. వారిమధ్య ఏ అంశాలు చర్చకు వచ్చాయనే విషయంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. అక్క చెల్లెళ్ళ ఆస్తి వివాదాల గురించి ఇప్పటికే సోషల్ మీడియాలో రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. మౌనిక సంతకాలను ఫోర్జరీ చేశారన్నది ఆ ప్రచారంలోనే ఒక వెర్షన్.
Read Also: TTD: శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఎల్లుండి నుంచి మార్చి నెల కోటా టికెట్ల విడుదల.. ఏ రోజు ఏవంటే..?
ఈ ప్రచారం, ప్రస్తుతం తామున్న పరిస్థితుల్లో మనోజ్, మౌనిక దంపతులు వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించుకునేందుకే ఇంటికి వెళ్ళి ఉండవచ్చంటున్నారు కొందరు. వాళ్ళు వెళ్ళకుండా ఉంటే రచ్చ ఓ రేంజ్‌లో జరిగేదని, అందుకు భిన్నంగా రెండు కుటుంబాలు కలవడంతో… ఆస్తి వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించుకోబోతున్నారన్న అంచనాలు పెరుగుతున్నాయి. అంతా కలిసి అంతసేపు ఆ మేటర్ మీదే మాట్లాడుకుని ఉంటారా అని కూడా ఎవరి స్థాయిలో వాళ్ళు విశ్లేషించేస్తున్నారు. మరోవైపు మనోజ్, మౌనిక దంపతులు జనసేనలో చేరతారన్న ప్రచారం కూడా ఉంది. ఇవాళ మంచు మనోజ్ మీడియాతో మాట్లాడతారని , మోహన్ బాబు కుటుంబంలోని గొడవల మీద, తాము జనసేనలో చేరే అంశం మీద క్లారిటీ ఇస్తారని భావించారు. కానీ… ఇప్పుడున్న పరిస్థితుల్లో… మీడియాతో మాట్లాడకపోవడమే మంచిదన్న అఖిలప్రియ సలహాతోనే ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నట్టు తెలుస్తోంది. మొత్తం మీద కారణాలు ఏవైనా… అక్క చెల్లెళ్ళ మధ్య సఖ్యత కుదిరితే… అదే పదివేలంటున్నారు భూమా కుటుంబ అభిమానులు.