Off The Record: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల ముంగిట్లో….బీసీ రిజర్వేషన్ల అంశం మీద జోరుగా చర్చ జరుగుతోంది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్స్ ఇవ్వాలన్న విషయంలో అన్ని పార్టీలది ఒకటే మాట. కానీ… సాధనలో మాత్రం ఎవరి రాజకీయాలు వారివి అన్నట్టుగా నడుస్తోంది వ్యవహారం. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే కీలక నిర్ణయం తీసుకుంది. రిజర్వేషన్స్ ఆర్డినెన్స్ తెలంగాణ ప్రభుత్వం నుంచి రాజ్‌భవన్‌కు చేరింది. అలా… రిజర్వేషన్స్ అమలు విషయంలో మేం చిత్తశుద్ధితో ఉన్నామని చెప్పాలనుకుంటోంది కాంగ్రెస్. ఇంతకుముందే అసెంబ్లీలో చేసిన తీర్మానం కేంద్రానికి చేరింది. ఇక చివరగా ఢిల్లీలో స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పాల్గొని పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించి కేంద్ర ప్రభుత్వం మీద వత్తిడి పెంచే ప్రయత్నం చేశారు. అధికార పార్టీ అలా… బీసీ అజెండాతో ముందుకు వెళ్తున్న క్రమంలో… ఇత తాము కూడా రేస్‌లో వెనుకబడకుండా దృష్టి సారిస్తోందట బీఆర్‌ఎస్. అయితే.. ఎక్కడి నుంచి మొదలుపెట్టాలో అర్ధంగాక సతమతం అవుతోందట గులాబీ అధిష్టానం. కామారెడ్డి డిక్లరేషన్‌కు అనుగుణంగా తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీని నిలబెట్టుకోవాలని గత ఆరు నెలలుగా డిమాండ్ చేస్తోంది కారు పార్టీ. అందుకు సంబంధించి అడపా దడపా కార్యక్రమాలు నిర్వహిస్తున్నా… పెద్ద ఎత్తున ప్రోగ్రాం మాత్రం చేయలేదు.
Read Also: Radhika Apte : ప్రెగ్నెంట్ టైమ్ లో ఆ నిర్మాత ఇబ్బంది పెట్టాడు.. హీరోయిన్ ఎమోషనల్
ఆర్డినెన్స్ తీసుకొస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన వెంటనే… దాన్ని తప్పుపడుతూ సమావేశం నిర్వహించుకున్న బీఆర్ఎస్ బీసీ నేతలు ఓ ప్రకటన విడుదల చేశారు. కేవలం ఆర్డినెన్స్ ప్రకటనతో మభ్యపెట్టకూడదని, దానికి చట్ట బద్ధత కల్పించినప్పుడే నిజాయితీ ఉన్నట్టని అన్నారు. కానీ.. ఆ చట్టబద్దత కల్పించే క్రమంలోనే… ఆర్డినెన్స్‌ను గవర్నర్‌కు పంపింది రేవంత్ సర్కార్. ఇక ప్రభుత్వం మీద వత్తిడి పెంచుతామంటూ…కరీంనగర్ లో పెద్ద ఎత్తున సభ పెట్టాలని నిర్ణయించుకుంది గులాబీ అధిష్టానం. సభను ఈనెల 8న పెట్టాలని ముందు అనుకున్నారు. కానీ… ఇంత తక్కువ వ్యవధిలో సక్సెస్ చేయలేమన్న అనుమానంతో పాటు భారీ వర్షాల పేరుతో సభ వాయిదా పడింది. చివరకు ఈనెల 14న బీసీ గర్జన సభ నిర్వహిస్తామని ప్రకటించారు బీఆర్ఎస్ బీసీ నేతలు. అయితే ఒకవైపు కాంగ్రెస్ పార్టీ డైరెక్ట్‌గా ఢిల్లీ వెళ్లి మహా ధర్నా చేయడం, బీజేపీ ఇందిరాపార్క్ దగ్గర ఇదే రిజర్వేషన్ల అంశంపై నిరసన కార్యక్రమం చేయడం లాంటివి చూసిన బీఆర్‌ఎస్ నేతలు మళ్లీ ఆలోచనలో పడ్డారట. ఇంతకు మించి మనం ఇంకేం చేయగలమని ఆలోచిస్తున్నట్టు సమాచారం. ఇక్కడే సరికొత్త చర్చలు మొదలయ్యాయి. ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ కు పోరాటం చేసేందుకు ఎంతో అవకాశం ఉన్నా సరే…ఎందుకు వెనక్కు తగ్గుతోందన్న ప్రశ్నలు వస్తున్నాయి. ఇప్పుడు అడ్వాన్స్ అయితే… రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో గట్టిగా ప్రచారం చేసుకునే అవకాశం ఉన్నా… ఎందుకు మీన మేషాలు లెక్కిస్తున్నారన్నది ఎక్కువ మంది ప్రశ్న. బీసీ రిజర్వేషన్ల ఆర్డినెన్స్ పేరుతో ఇప్పటికే కాంగ్రెస్ దూసుకుపోతోందని, ఇంకా ఆలోచిస్తూ కూర్చుంటే… తాము వెనుకబడిపోతామన్న అభిప్రాయం పెరుగుతోందట గులాబీ దళంలో.
Read Also: CM Revanth Reddy: కేసీఆర్ అరెస్ట్‌పై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్.. ఎంత పెద్ద మాట అన్నారు సార్…!
బీసీ రిజర్వేషన్స్ విషయంలో తమ అధిష్టానం కావాల్సినంత దూకుడు ప్రదర్శించడం లేదని పార్టీ వర్గాల్లోనే చర్చ జరుగుతోందట. అయితే… ఆ విషయంలో పార్టీ పెద్దలకు కూడా కొన్ని సమస్యలు ఉన్నట్టు చెప్పుకుంటున్నారు. ఈ విషయం మీద ఇప్పుడు గట్టిగా మాట్లాడితే…. అధికారంలో ఉన్న పదేళ్లు ఏం చేశారన్న విమర్శల్ని ఎదుర్కోవాల్సి రావచ్చంటున్నారు. మరోవైపు పార్టీ ఎమ్మెల్సీ కవిత… ప్రభుత్వ ఆర్డినెన్స్‌ను సమర్థిస్తుండటంతో… ఏం చేయాలో పాలుపోవడం లేదట బీఆర్‌ఎస్ బీసీ నేతలకు.కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర మహా ధర్నా చేసి ఓవర్ టు ఢిల్లీ అనేయడంతో… తాము కూడా కరీంనగర్ బహిరంగ సభ తర్వాత ఈ అంశాన్ని రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లాలని భావిస్తున్నట్టు సమాచారం. పార్టీలోని బీసీ నేతలు మాత్రమే కాకుండా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ని తీసుకొని రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నారట. మొత్తంగా బీసీ రిజర్వేషన్స్ విషయంలో బీఆర్‌ఎస్ పరిస్థితి మిగతా రెండు పార్టీలంత తేలిగ్గా ఉన్నట్టు కనిపించడం లేదంటున్నారు పరిశీలకులు.
