Off The Record: కేబినెట్ సహచరుల్ని ఈ మధ్య కాలంలో తరచూ హెచ్చరిస్తున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. పని చేయండి, పరుగులు పెట్టండి అంటూ తరుముతున్నారు. ప్రతిపక్షం విమర్శలకు గట్టి కౌంటర్స్ వేయమని కూడా సూచిస్తున్నారు. కానీ…ఎక్కువ మంది మంత్రులు వీటిలో ఏ ఒక్క పనీ సమర్ధంగా చేయడం లేదన్న అభిప్రాయం బలపడుతోందట టీడీపీ వర్గాల్లో. నేను 95 సీఎం అవుతా… నా స్పీడ్ మీరు అందుకోవాలని కూడా పదే పదే చెబుతున్నారు చంద్రబాబు. 95లో ఉన్నట్టుగా ఆ స్పీడ్‌ని ఆయనైతే అందుకుని ఉండవచ్చుగానీ… మంత్రులు మాత్రం అలా లేరు, ప్రతి సారి…ఆయనతో తిట్లు తింటున్నారని టీడీపీ వర్గాలే గుసగుసలాడుకుంటున్నాయి. మరీ మంత్రులు కాబట్టి వాళ్ల గౌరవం కొద్దీ… తిట్లు అన్న పదం వాడకూడదుగానీ… దాదాపుగా అదే జరుగుతోందన్నది ఇన్నర్ వాయిస్.
Read Also: Pakistan: పాక్ యూనివర్సిటీలో సంస్కృతం, మహాభారతం.. మీరు వింటున్నది నిజమే..
సీఎం, మంత్రులు కలిసే ఏ మీటింగ్ అయినా… మినిస్టర్స్‌కు మాత్రం క్లాస్‌లు తప్పడం లేదట. ఫైళ్ళ క్లియరెన్స్, టైం సెన్స్, సెక్రెటరీలతో సమన్వయం, కేంద్ర మంత్రులతో మాటామంతీ.. ఇలా ప్రతి విషయంలోనూ కొంతమంది మంత్రులపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు చంద్రబాబు. దీంతో… ఆయన స్పీడ్‌ను మంత్రులు అందుకోలేకపోతున్నారన్న చర్చ జరుగుతోంది. అదే సమయంలో వాళ్ళలో సామర్ధ్యం లేక వెనకబడుతున్నారా? కావాలనే కాస్త తగ్గుతున్నారా అన్న డౌట్స్ కూడా పెరుగుతున్నాయి పొలిటికల్ సర్కిల్స్‌లో. మూడు పార్టీలు కలిసి…ప్రత్యేక పరిస్థితిలో కూటమి కట్టాయి. ప్రభుత్వంలో కూడా ఆ సమన్వయం కనిపించాలి. కానీ…వాస్తవంలో అలా లేదన్న అభిప్రాయం బలంగా ఉంది. మినిస్టర్స్ కొంతమంది ఎవరి సొంత పనుల్లో వారున్నారని, వ్యక్తిగత అజెండాలు తప్ప అసలు ప్రభుత్వంలో ఏం జరుగుతోందన్న స్పృహే లేకుండా పోతోందని చెప్పుకుంటున్నారు. కొద్ది మంది మంత్రులు విపరీతమైన ఆర్ధిక లావాదేవీల్లో మునిగి తేలుతున్నారని, వాళ్ళ దృష్టి మొత్తం దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకుందామని తప్ప… ప్రభుత్వంపై ఏ మాత్రం లేదన్న మాటలు సైతం వినిపిస్తున్నాయి.
అసలు తమ శాఖలో ఏం జరుగుతోంది… ఎన్ని సమీక్షలు చేశాం, ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలు జనంలోకి ఎంతవరకు వెళ్తున్నాయన్న ఆలోచన లేని మంత్రులు కూడా ఉన్నారట ఏపీ కేబినెట్‌లో. అదంతా ఒక ఎత్తయితే… చంద్రబాబు ఎంతగా మొత్తుకుంటున్నా… ప్రతిపక్షం మీద విమర్శల విషయంలో ఎక్కువ మంది మాకెందుకులే అన్న ధోరణితో ఉంటున్నారన్న అభిప్రాయం బలంగా ఉంది. వాళ్ళు ఆ స్థాయిలో విమర్శిస్తుంటే… మీ వైపు నుంచి కనీస స్పందన కూడా లేకుంటే ఎలాగని పలు సందర్భాల్లో సీఎం గుచ్చి గుచ్చి అడుగుతున్నా…నో రియాక్షన్. ఎందుకు అలా ఉంటున్నారంటే… అసలు స్టోరీ వేరే ఉండి ఉండవచ్చన్నది రాజకీయవర్గాల అభిప్రాయం. చంద్రబాబు చెప్పారు కదా అని ఇప్పుడు తాము రెచ్చిపోయి మాట్లాడితే… రేపటిరోజున ఎలా ఉంటుందోనన్న భయం ఎక్కువ మందిలో ఉన్నట్టు చెప్పుకుంటున్నారు. ఆ మాటలు ఎటుపోయి ఎటొచ్చి తాము ఎక్కడ ఇరుక్కుంటామోనన్న ఆలోచన ఉందట చాలా మందిలో. అందుకే ప్రభుత్వం, పార్టీ మీద వైసీపీ ఎన్ని విమర్శలు చేసినా కొంతమంది మంత్రులు సరైన కౌంటర్ ఇవ్వడం లేదనే చర్చ బాగా జరుగుతోంది పార్టీ వర్గాల్లో. మొత్తం మీద బాబు స్పీడ్ అందుకోలేక కొంత, సిగ్గుతో కూడిన భయం వల్ల వచ్చిన గౌరవంతో మరికొంత కలగలిసి మంత్రులు వెనకబడుతున్నారన్నది అంతర్గతంగా జరుగుతున్న చర్చ. ఈ ధోరణి ఇలాగే కొనసాగితే… చివరికి వాళ్ళు మునగడమో, లేక పార్టీని ముంచడమో ఖాయమంటున్నారు టీడీపీ కార్యకర్తలు.