Off The Record: తెలుగు నాట సినీ పరిశ్రమను, రాజకీయాలను వేరువేరుగా చూడటం కష్టం. ఆ లింకులన్నీ అలా సింక్ అయి ఉంటాయి మరి. అదే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారిందట. తమకు ఆర్ధిక సమస్యలు ఉన్నాయంటూ… సినీ ఎగ్జిబిటర్లు జూన్ 1 నుంచి థియేటర్లు బంద్ చేస్తామని ముందు ప్రకటించి తర్వాత అది వివాదాస్పదం కావడంతో…. ఉపసంహరించుకున్నారు. ఎగ్జిబిటర్ల ఉద్దేశ్యం ఏదైనా… దాని మీద భిన్న వాదనలున్నా…. బంద్ ప్రకటనతో పవన్‌కళ్యాణ్‌కు మాత్రం కాలిపోయిందట. తన సినిమా హరిహర వీరమల్లు విడుదలకు పది రోజుల ముందు సినిమా హాళ్ల మూత అన్న ప్రకటన రావడమే ఆయన కోపానికి కారణమని చెప్పుకుంటున్నారు. వీరమల్లు రిలీజ్ టైంకు థియేటర్స్ ఉంటాయా? ఉండవా? అన్న డౌట్స్ రావడంతో… పవన్‌లోని పవర్ బయటికి వచ్చినట్టు అంచనా వేస్తున్నారు. మీకు ముఖ్యమంత్రి మీద గౌరవం ఉందా…కూటమి అధికారంలోకి వచ్చాక ఆయన్ని కలిశారా? గత ప్రభుత్వ చీత్కారాలను మర్చిపోయారా అంటూ సినిమా పరిశ్రమ పెద్దల్ని ప్రశ్నించారు పవన్. టిక్కెట్లకు సంబంధించి ఎంత పన్ను ఎంత కడుతున్నారో లెక్కలు తీయండని అధికారులను ఆదేశించారాయన.
Read Also: Off The Record: కోనేరు కోనప్ప హస్తం పార్టీకి హ్యాండ్ ఇచ్చేసినట్టేనా?
దీంతో… అసలేం జరుగుతోంది.. సినిమా ఇండస్ట్రీ ఎవరి చేతిలోకి వెళ్ళింది… ఇండస్ట్రీలోని అంతర్గత రాజకీయాలు ప్రభుత్వానికి తలనొప్పిగా మారుతున్నాయా అన్న చర్చ మొదలైంది ఏపీ పొలిటికల్ సర్కిల్స్‌లో. తెలుగు సినిమా ఇండస్ట్రీలో రాజకీయాలు కొత్త కాదు. ఒక్కోసారి పార్టీల వారీగా విడిపోతుంటారు కూడా. అయితే వీరు ప్రభుత్వాల దగ్గరికి వచ్చి సమస్యలపై మాట్లాడుకోవడం చాలా తక్కువ. ఒకటి ఆరా సందర్భాల్లో…. అది కూడా టికెట్ రేట్లు బాగా పెంచాలన్నప్పుడే ప్రభుత్వం దగ్గరకు వెళ్తున్నారు. లేదంటే… అసలు ప్రభుత్వాన్ని పట్టించుకుంటున్న దాఖలాలు లేవన్నది దగ్గరగా గమనిస్తున్నవాళ్ళ మాట. అసలు రాష్ట్రం విడిపోయాక ఆంధ్రప్రదేశ్‌లో రెగ్యులర్ షూటింగ్స్ చేయాలన్న స్పృహ కూడా నిర్మాత, దర్శకులకు లేకుండా పోయిందన్న వాదనలున్నాయి. అది చాలదన్నట్టు ఇప్పుడు వాళ్ళ అంతర్గత రాజకీయాల వల్ల రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బందులు పడాల్సి వస్తోందన్న అభిప్రాయం పెరుగుతోంది. వైసీపీ హయాంలో టికెట్ రేట్లు తగ్గించిందని, ఇండస్ట్రీ పెద్దలు ప్రభుత్వం దగ్గరికి వచ్చినప్పుడు మాత్రమే భారీగా పెంచుకోవడానికి అవకాశం ఇచ్చిందని అంటున్నారు. ఇక కూటమి అధికారంలోకి వచ్చాక… అలాంటి పనులేవీ చేయకపోవడంతో… సినిమా ఇండస్ట్రీ పెద్దలు అసలు ప్రభుత్వం ఒకటుందన్న సంగతి మర్చిపోయారన్న చర్చలు జరుగుతున్నాయట ఎన్డీఏ వర్గాల్లో.
Read Also: Chiranjeevi : చిరంజీవికి పోటీగా నవీన్ పోలిశెట్టి.. రిస్క్ చేస్తున్నాడా.?
మొదట ఏదో… మొక్కుబడిగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ని ఇండస్ట్రీ మనిషన్న ఉద్దేశ్యంతో కలిసి వెళ్ళిపోయారని, తర్వాత.. ఏ సందర్భంలోనూ… సీఎంను కలిసే ప్రయత్నం చేయలేదన్న అసంతృప్తి ఉందట. ఇదే విషయాన్ని పవన్ కళ్యాణ్ కూడా చెప్పారు. స్టూడియోలకు స్థలాల కోసమో. లేకపోతే ఇండస్ట్రీ సమస్యలు ఏదైనా ఉన్నప్పుడో తప్ప మిగతా ఏ టైంలోనూ… వాళ్ళు సుహృద్భావ వాతావరణంలో మాట్లాడలేదన్న అభిప్రాయం ఉందట ప్రభుత్వ వర్గాల్లో. ఆంధ్రప్రదేశ్‌లో సినీ ఇండస్ట్రీ అభివృద్ధికి సహకరిస్తామన్న ఒక నిశ్చిత అభిప్రాయాన్ని పరిశ్రమ పెద్దలు కల్పించలేకపోయారని చెప్పుకుంటున్నారట. ఏపీ పాలిటిక్స్‌కు, సినీ ఇండస్ట్రీకి పెన వేసుకుపోయిన బంధాలవల్లే… ప్రభుత్వానికి కొత్త తలనొప్పులు వస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. అసలు ఇండస్ట్రీలో ఉన్న వర్గాలు పరస్పరం రాజకీయాలు చేసుకుంటూ ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్నాయన్న అభిప్రాయం సైతం బలపడుతోందట. కొన్ని రాజకీయ పార్టీలు ఈ పరిస్థితుల్ని వాడుకుని ప్రభుత్వాన్ని బద్నాం చేస్తున్నాయని, వీటికి చెక్ పెట్టాలనుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికైనా ఇండస్ట్రీ పెద్దలు అనవసర రాజకీయాలకు పోకుండా… ప్రభుత్వ పెద్దలతో సానుకూల చర్చలు జరిపితే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది గవర్నమెంట్ సర్కిల్స్‌లో.
