Off The Record: జూబ్లీహిల్స్ సీటు కోసం కాంగ్రెస్ పార్టీలో ఆశావహుల సంఖ్య పెరిగిపోతోంది. ఇప్పటికే రహమత్ నగర్ కార్పొరేటర్ సిఎన్ రెడ్డి, సీనియర్ నేత నవీన్ యాదవ్ పేర్లపై చర్చ జరుగుతోంది. తాజాగా… నేను సైతం అంటూ… తెర మీదికి వచ్చారు మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్. యాదవ సామాజిక వర్గానికి మంత్రి పదవి ఇవ్వలేదు కాబట్టి… జూబ్లీహిల్స్ టికెట్ ఖచ్చితంగా నాకే ఇచ్చి తీరాలన్నది ఆయన డిమాండ్. ఈ సెగ్మెంట్ సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోనే ఉందని, ఇక్కడ నాకంటే సీనియర్ యాదవ్ ఎవరున్నారంటూ మెలికపెట్టారాయన. కానీ… ఇప్పటికే అంజన్ కుమార్ యాదవ్ కొడుకు అనిల్ యాదవ్ రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. అంజన్‌కి కూడా…గత అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఇచ్చింది పార్టీ. కానీ ఆయన ఓడిపోయారు. అంజన్ ఫ్యామిలీ హైదరాబాదులో పార్టీకి కొంత అండగా ఉందన్న ఉద్దేశ్యంతోనే…. సీఎం రేవంత్ రెడ్డి అనిల్‌ను రాజ్యసభకు ప్రమోట్ చేశారు. కానీ…. అంజన్ కుమార్ మాత్రం… అనిల్‌కి యూత్ కాంగ్రెస్ కోటాలో ఇచ్చారు, నేను పార్టీ కోసం చేసిన సేవ గుర్తించండంటూ… కొత్త చర్చను తెరమీద తెచ్చారు. ఇప్పటికే అంజన్ పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కొనసాగుతున్నారు.
Read Also: Off The Record: అమరావతి విషయంలో వైసీపీ యూ టర్న్ ఆ పార్టీకి ప్లస్సా..? మైనస్సా..?
ఇలా… అన్ని పదవులు ఒకే కుటుంబానికేనా అన్న చర్చ జరుగుతోంది కాంగ్రెస్ వర్గాల్లో.. మరోవైపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి సవాల్‌గా మారింది. అది బీఆర్ఎస్ సిట్టింగ్ సీటు కావడంతో… చేజిక్కించుకోవాలని పట్టుదలగా ఉంది పీసీసీ నాయకత్వం. ఒకవేళ చిన్న లెక్కతప్పి ఓడిపోయినా… అది పార్టీతోపాటు ప్రభుత్వం మీద కూడా విమర్శలకు, వ్యతిరేక ప్రభావానికి తావిచ్చినట్టు అవుతుందన్న అభిప్రాయాలు ఉన్నాయి. అదే ఉద్దేశంతో అటు పిసిసి, ఇటు సీఎం పార్టీ నాయకులకు ఇప్పటినుంచే బాధ్యతలను అప్పగించి పనిలో పెట్టినా… బాధ్యులు మాత్రం పూర్తి స్థాయిలో గేరప్ అయినట్టు కనిపించడం లేదంటున్నారు. నాయకులంతా… జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలతో నాకేంటి లాభమన్న తరహాలోనే ఆలోచిస్తున్నట్టు కనబడుతోందంటున్నారు పరిశీలకులు. ఇదే పార్టీకి పెద్ద తలనొప్పిగా మారుతోందట. దీనికి తోడు కార్పొరేషన్ చైర్మన్స్‌ను డివిజన్ల వారీగా ఇన్చార్జిలుగా నియమించింది పార్టీ. ప్రతి పోలింగ్ బూత్ ని టచ్ చేయడంతోపాటు ఓటరు మ్యాపింగ్ చేయాలని ఆదేశించినా… వాళ్ళంతా డివిజన్లో సమావేశాలకు పరిమితం అవుతున్నారు తప్ప అప్పగించిన పనిని పూర్తి స్థాయిలో చేయడం లేదని తెలుస్తోంది.
Read Also: The Great Pre Wedding Show : ఆసక్తికరంగా ‘ది గ్రేట్ వెడ్డింగ్ షో’ టీజర్
ఒకరిద్దరు నేతలు తప్పితే మిగిలిన వాళ్ళంతా…డివిజన్ నాయకులని పోగేసుకొని సమావేశాలు పెట్టడం వరకే పరిమితం అవుతున్నారనేది పార్టీ దగ్గరున్న నివేదిక. ఇటీవల జరిగిన సమావేశంలో కూడా ఎవరు ఏం చేస్తున్నారు నాకు తెలుసు అంటూ సీఎం నర్మగర్భంగా అన్నట్టు తెలిసింది. ఎన్నికలు గెలిచి తీరాలని, ఇది అందరికీ టాస్క్ అంటూ పార్టీ కూడా స్పష్టం చేసింది. కానీ…ఎక్కువ మంది అప్పగించిన పనిని పూర్తిస్థాయిలో చేయకుండా…చేస్తున్నట్టు బిల్డప్ ఇస్తున్నట్టు ఇంటెలిజెన్స్ నివేదిక ప్రభుత్వ దగ్గర ఉందట. ప్రస్తుతం ఎన్నికల బాధ్యతలు అప్పగించిన చాలామంది కార్పొరేషన్ చైర్మన్స్కు త్వరలోనే పదవీకాలం ముగియబోతోంది. అందుకే… ఇప్పుడు ఓవర్ యాక్షన్ చేస్తే… ఇక రెన్సువల్స్ ఉండబోవన్న సంకేతాల్ని కూడా పంపుతోందట పీసీసీ నాయకత్వం. మరోవైపు ఈ పరిధిలోని అధికారులు కొందరు మంత్రుల ఆదేశాల్ని కూడా పట్టించుకోవడం లేదంటూ…వాపోతున్నారు ఓ మంత్రి. ఓవైపు ఉప ఎన్నికలు పెట్టుకొని.. ఇప్పటికీ జూబ్లీహిల్స్ నియోజకవర్గం పరిధిలో అక్కడక్కడ కూల్చివేతలు జరుగుతున్నాయని, వాటిని ఆపమని పట్టించుకోవడం లేదన్న చర్చ కూడా నడుస్తోంది. జీహెచ్ఎంసీ అధికారులు స్పందించకపోతే ఆ శాఖ సీఎం రేవంత్ రెడ్డి దగ్గరే ఉంది కాబట్టి… వ్యవహారాన్ని నేరుగా ఆయన దృష్టికే తీసుకెళ్తే సరిపోతుందన్న చర్చలు సైతం నడుస్తున్నాయి కాంగ్రెస్‌లో.