NTV Telugu Site icon

Off The Record: కొత్త ఇంఛార్జ్‌కి ఆ కాంగ్రెస్‌ నేతపై మూకుమ్మడిగా ఫిర్యాదులు..?

Adb Cong

Adb Cong

Off The Record: ఉమ్మడి ఆదిలాబాద్ కాంగ్రెస్‌లో కయ్యం ముదురుతోందట. తాజాగా రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్‌ మీనాక్షి నటరాజన్ సమక్షంలో మీటింగ్‌ గరగరంగా సాగినట్టు తెలిసింది.నేతల వ్యవహార శైలిపై ఫిర్యాదుల వెల్లువలా వచ్చినట్టు తెలిసింది.ఆమె ముందే పరస్పరం కౌంటర్స్‌ వేసుకున్నారట నాయకులు. పక్క జిల్లాకు చెందిన నేత ఒకరు పార్టీని కులాల వారిగా విభజిస్తున్నారని, జిల్లాలో కాంగ్రెస్ పార్టీ చీలిపోవడం ,గ్రూప్ లుగా మారడానికి సదరు నేతే కారణమని ముందు పేరు చెప్పకుండా ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. అందుకు స్పందించిన నటరాజన్ ఆ నేత ఎవరో పేరు చెప్పమని గట్టిగా అడగడంతో.. కరీంనగర్ జిల్లాకు చెందిన నాయకుడు సత్తు మల్లేష్ పేరును ప్రస్తావించినట్టు తెలిసింది. అందుకు పీసీసీ చీఫ్ స్పందించి అలాంటి నేతలపై విచారణ జరిపి జిల్లాలో అడుగుపెట్టనీయకుండా చేస్తామని హామీ ఇచ్చారట.

కరీంనగర్ జిల్లాకు చెందిన వ్యక్తి ఆదిలాబాద్ ,నిర్మల్ ,కొమురం భీం జిల్లాల్లో పెత్తనం చేలాయించడమే కాకుండా పార్టీ ఫండ్ పంపకాలు,అధికారుల బదిలీల్లో సైతం కీరోల్ పోషిస్తున్నారని ఇన్ఛార్జ్‌ దృష్టికి తెచ్చారట ఆదిలాబాద్‌ నేతలు. దాంతో పాటు ఒక్కొక్కరు ఒక్కో రకమైన ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. పాత వారికి ప్రభుత్వంలో ప్రాధాన్యత కల్పించడంలేదు. ఒక్కరిద్దరు వ్యక్తుల వల్ల ఆదిలాబాద్ పార్లమెంట్ సీట్లో పార్టీకి తీవ్ర నష్టం జరిగిందని మీనాక్షి దృష్టికి తీసుకెళ్ళారట. జిల్లాకు సంబంధం లేని నాయకుడు ఆదిలాబాద్‌లో కాంగ్రెస్ పార్టీని విభజిస్తున్నారని, ఫలానా కులం ఉండకుండా చేయాలని వ్యాఖ్యానించమే కాకుండా ఇంచార్జ్‌ మంత్రిని సైతం తప్పుదోవ పట్టిస్తున్నారని చెప్పారట.పైగా పార్టీని అడ్డం పెట్టుకుని సొంత వ్యాపారాలు చేసుకుంటున్నాడంటూ సదరు నేత మీద ఫిర్యాదు చేశారట ఆదిలాబాద్‌ నాయకులు. పార్టీ ఎందుకు మారామా అని ఇప్పుడు బాధగా ఉందని ఓ మాజీ ఎమ్మెల్యే అన్నట్టు సమాచారం. కార్యక్రమాలకు సంబంధించి ఎవ్వరు సమాచారం ఇవ్వడంలేదు. సమన్వయ లోపం ఎక్కువగా ఉందని మరి కొంతమంది చెప్పుకొచ్చారట. ప్రస్తుతం పార్టీ పరిస్థితి సరిగాలేదు.. ప్రజల్లో అసంతృప్తి ఉందని, స్థానిక సంస్థల్లో గెలవాలంటే రుణమాఫీ, రైతు భరోసాను పూర్తిగా చేయాలని ఓ సీనియర్ నేత రాష్ట్ర ముఖ్యనేతలతో చెప్పారట.

అంతా శ్రద్ధగా విన్న మీనాక్షి నటరాజన్‌.. గ్రూప్స్‌ వద్దు, కో ఆర్డినేషన్‌ కోసం ఓ కమిటీ వేస్తాం, పార్టీ అంతర్గత విషయాలు బయటకెళ్ళవద్దని హెచ్చరించినట్టు సమాచారం. ఇదంతా గమనించిన జిల్లా ఇన్ఛార్జ్‌ మంత్రి సీతక్క సైతం నియోజకవర్గ ఇన్ఛార్జ్‌ల పనితీరుపై అసహనం వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఇలా చేస్తే తాను ఆదిలాబాద్ జిల్లా ఇంచార్జ్‌ మంత్రి హోదానుంచి తప్పుకుంటానని, సీఎం తో చెప్పి ఓ నిర్ణయానికొస్తాని చెప్పినట్టు సమాచారం. అసెంబ్లీ ఎన్నికల కంటే ముందునుంచే జిల్లాలో పాగా వేసిన నాయకుడు పార్లమెంట్ ఎన్నికలు, ఆతర్వాత ఏ కార్యక్రమం లేదా పెద్ద సభలు సమావేశాలు నిర్వహించినా పెత్తనం చెలాయిస్తున్నారట. స్థఆనిక నాయకులు దాన్ని జీర్ణించుకోలేకపోతున్నట్టు తెలుస్తోంది. రాష్ట్ర స్థాయిలో పెద్దనేతల అండ ఉందని ఇన్నాళ్ళు చెప్పుకోవడంతో ఎవరూ ప్రశ్నించలేకపోయారని, ఇప్పుడు స్వయంగా రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్‌ జోక్యం చేసుకునేసరికి అంతా ఓపెన్‌ అయిపోయినట్టు చెప్పుకుంటున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్‌ కాంగ్రెస్‌లో ఎలాంటి మార్పులు వస్తాయో చూడాలంటున్నారు పరిశీలకులు.