NTV Telugu Site icon

Off The Record: ఒక్క ఓటమితోనే ఆ మాజీ ఎమ్మెల్యేకి మైండ్‌ బ్లాంక్‌ అయ్యిందా..?

Guvvala Balaraju

Guvvala Balaraju

Off The Record: 2014 నుంచి వరుసగా రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన గువ్వల బాలరాజును గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడించారు అచ్చంపేట ఓటర్లు . నాగర్ కర్నూల్ జిల్లా బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడిగా కూడా కొనసాగుతున్న గువ్వల.. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అంగబలం, అర్దబలంతో పాటు అధికార యంత్రాంగాన్ని కూడా కనుసన్నల్లో పెట్టుకుని నియోజకవర్గంలో నియంతలా వ్యవహరించారన్న అభిప్రాయం ఉంది. పదేళ్లు తానాడిందే ఆట పాడిందే పాటగా సాగిన గువ్వల వ్యవహారాలతో విసిగిపోయిన ఓటర్లు టైం చూసి వాత పెట్టారని ఇప్పటికీ చెప్పుకుంటారు అచ్చంపేటలో. అధికారం శాశ్వతం అన్నట్లుగా నాడు వ్యవహరించిన తీరే…ఓటమి ప్రధాన కారణమన్న అభిప్రాయం ఉంది. అదంతా గతం. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడాక…. లోక్‌సభ ఎలక్షన్స్‌లో ఎంపీ టిక్కెట్‌ దక్కించుకుని… ఏకంగా ఢిల్లీలో పాగా వేద్దామనుకున్నారట ఆయన. అందుకు కేసీఆర్‌ నో చెప్పడంతో…. డీప్‌గా హర్ట్‌ అయిన గువ్వల ఇటు తనను ఓడించిన అచ్చంపేట ప్రజలకు, అటు ఎంపీ టిక్కెట్‌ ఇవ్వని పార్టీ అధిష్టానానికి ముఖం చాటేశారన్నది లోకల్‌ టాక్‌.

జిల్లా అధ్యక్షుడి హోదాలో పార్టీని ముందుండి నడిపించాల్సిందిపోయి…హైదరాబాద్ కే పరిమితమైనట్టు చెప్పుకుంటున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో, ముఖ్యంగా మొయినాబాద్‍ ఫాం హౌస్‍… ఎమ్మెల్యేల కొనుగోలు ఎపిసోడ్‌ తర్వాత ఆకాశంలో విహరించిన గువ్వల బాలరాజు.. తాను కేసీఆర్‍ వదిలిన బాణాన్ని అంటూ చెలరేగిపోయారు. ఒకానొక దశలో గులాబీ దళంలో నేనే ప్రముఖుడిని అంటూ ఓ రేంజ్‌లో ప్రచారం చేసుకున్నారాయన. కానీ ఎమ్మెల్యేగా ఓటమి, ఎంపీ టిక్కెట్టు దక్కకపోవడంతో తత్వం బోధపడి వాస్తవంలోకి వచ్చారని, తీవ్ర నిరాశకు గురయ్యారని చెప్పుకుంటున్నారు. ఈ క్రమంలోనే రాజకీయ అజ్ఞాతంలోకి వెళ్ళి చివరికి ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు ఫోన్లు చేస్తే కూడా పెద్దగా రెస్పాండ్ అవడంలేదన్నది అచ్చంపేట టాక్‌. అసెంబ్లీ ఎన్నికల తర్వాత చుట్టపుచూపుగా వచ్చిపోతున్న గువ్వల తీరు చూసి… ఆయన కాంగ్రెస్‌ దిశగా అడుగులేస్తున్నారని అనుకుంటున్నారట బీఆర్‍ఎస్‍ కిందిస్థాయి నాయకులు, కార్యకర్తలు. అధికార పార్టీలో ఉంటే పనులు కావడంతో పాటు, స్థానిక ఎన్నికల్లో పట్టు బిగించే అవకాశం ఎక్కువన్న ఉద్దేశ్యంతో అటు టచ్‌లోకి వెళ్తున్నారన్న ప్రచారం జరుగుతోంది.

ఇక అధికారంలో ఉన్నప్పుడు వ్యవహరించిన తీరు కారణంగా ఒక్క ఓటమితోనే అచ్చంపేటలో అడుగు పెట్టలేని దుస్థితి దాపురించిందని కూడా మాట్లాడుకుంటున్నారు నియోజకవర్గంలో. స్థానిక సంస్థల ఎన్నికలు ముంచుకొస్తున్న సమయంలో… క్షేత్ర స్థాయిలో గట్టిగా ఫైట్ చేయాల్సిన పరిస్థితుల్లో తమ నాయకుడు ముఖం చాటేయడం ఏంటో అర్ధం కావడం లేదంటూ నైరాశ్యంలో ఉందట అచ్చంపేట గులాబీ కేడర్‌. ఒకవైపు బాలరాజు పట్టింపులేని తనం, మరోవైపు ఆయన కాంగ్రెస్‌ వైపు చూస్తున్నారన్న ప్రచారం కలగలిసి గులాబీ కేడర్‌లో గందరగోళాన్ని పెంచుతున్నట్టు చెప్పుకుంటున్నారు. దీంతో స్థానిక సంస్థల ఎన్నికల నాటికి పరిస్థితులు ఎలా మారతాయోనన్న చర్చ జరుగుతోంది. మొత్తం మీద మాజీ ఎమ్మెల్యే వ్యవహారశైలి మాత్రం టాక్‌ ఆఫ్‌ ది అచ్చంపేట అయింది. ఆయన తదుపరి అడుగులు ఎలా ఉండబోతున్నాయోనని ఆసక్తిగా గమనిస్తున్నాయి రాజకీయ వర్గాలు.