OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?

  • వరుస ఓటములతో పరసా వెంకటరత్నంను పక్కన పెట్టిన టీడీపీ
  • గత ఎన్నికల్లో టిక్కెట్‌ ఆశించినా చివరికి నిరాశే
  • పార్టీ అధికారంలోకి వచ్చాక మార్క్‌ఫెడ్‌ డైరెక్టర్‌ పోస్ట్‌ ఆఫర్‌
Otr

Otr

OTR: ఆ మాజీ మంత్రి టిడిపి అధిష్టానం మీద తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా..? పైగా పక్క చూపులు చూస్తున్నారన్నది నిజమేనా? పార్టీలో కనీస ప్రాధాన్యం కూడా లేదంటూ రగిలిపోతున్నారన్నది నిజమేనా? బయటి నుంచి వచ్చిన వారికి ఇస్తున్న ప్రాధాన్యం కూడా ఆది నుంచి ఉన్న నాకు లేదంటున్న ఆ మాజీ ఎవరు? ఫ్యాన్‌ పార్టీకి టచ్‌ ఉన్నారన్న ప్రచారంలో నిజమెంత?రాజకీయాల్లో వెనకబడ్డా…. తిరునాళ్ళలో బోర్లాపడ్డా.. తిరిగి లేవడం అంత తేలిక కాదని అంటారు. ప్రస్తుతం మాజీ మంత్రి పరసా వెంకటరత్నంకు ఈ నానుడి పర్‌ఫెక్ట్‌గా సూట్ అవుతుందన్నది ఉమ్మడి నెల్లూరు జిల్లా పొలిటికల్‌ టాక్‌. సూళ్లూరుపేట నియోజకవర్గం నుంచి 1994, 99, 2009లో టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన పరసా…. గతంలో చంద్రబాబు క్యాబినెట్‌లో మంత్రిగా కూడా పనిచేశారు. ఇక ఆ తర్వాత వరుస ఓటములు ఎదువరవడంతో.. ఆయనకు టిక్కెట్‌ ఇవ్వడమే మానేసింది టీడీపీ అధిష్టానం.

గత ఎన్నికల్లో గట్టిగా ఆశలు పెట్టుకున్నా… మొండి చేయే మిగిలింది. పార్టీ ఆదేశాల ప్రకారం సిట్టింగ్‌ ఎమ్మెల్యే విజయశ్రీ గెలుపు కోసం పని చేశారాయన. ఇక అధికారం రాగానే తనకు ప్రాధాన్యత ఉంటుందని భావించిన మాజీ మంత్రికి మళ్ళీ నిరాశ తప్పలేదు. ఇంకా చెప్పాలంటే అధిష్టానం ఆయనకు షాకిచ్చిందన్నది సన్నిహితుల మాట. మార్క్‌ఫెడ్‌ డైరెక్టర్‌గా నామినేటెడ్‌ పోస్ట్‌ ఆఫర్‌ చేశారు ఆయనకు. ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా పని చేసిన తనకు ఒక సంస్థకు డైరెక్టర్ పదవి ఇవ్వడం ఏంటి…? దానికి బదులు అసలు ఏ పదవీ ఇవ్వకున్నా బాగుండేదని సన్నిహితుల దగ్గర ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఆ పదవిని రిజెక్ట్ చేసిన పరసా….అప్పటి నుంచి సొంత కార్యక్రమాలకే పరిమితం అవుతున్నారట. ఎమ్మెల్యే విజయశ్రీ ఆహ్వానం మేరకు అప్పుడప్పుడు సూళ్ళూరుపేట వెళ్తున్నారు తప్ప…. మిగతా వ్యవహారాలు వేటినీ అంతగా పట్టించుకోవడం లేదని, టీడీపీ అధిష్టానం మీద అసంతృప్తిని అలాగే కంటిన్యూ చేస్తున్నారని చెప్పుకుంటున్నారు. కాలేజీ రోజుల్లో సీఎం చంద్రబాబుకు జూనియర్‌ని అన్న సంగతిని పార్టీ నేతల దగ్గర ఆయన ప్రస్తావిస్తుండగా…. పార్టీకి వీర విధేయుడిగా ఉన్న తమ నాయకుడికి చంద్రబాబు సరైన ప్రాధాన్యత ఇవ్వడం లేదని అనుచరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇక పార్టీ పదవుల పరంగా చూసుకున్నా… మొదటి నుంచి తెలుగుదేశంలోనే ఉన్న పరసాకు ప్రాధాన్యత ఇవ్వకుండా.. కాంగ్రెస్ నుంచి వచ్చిన పనబాక లక్ష్మికి తిరుపతి జిల్లా టీడీపీ అధ్యక్ష పదవి ఇచ్చారని, నెలవల సుబ్రహ్మణ్యం కూతురు విజయశ్రీకి ఎమ్మెల్యే టిక్కెట్‌ ఇచ్చారంటూ అసహనం వ్యక్తం చేస్తోందట వెంకటరత్నం అనుచరగణం. ఇలాంటి పరిస్థితుల్లో… ఇటీవల సూళ్లూరుపేట నియోజకవర్గంలో ఓ వార్త బాగా చర్చనీయాంశమైంది. పరసా రత్నం ఇటీవల జిల్లా వైసీపీ నాయకత్వాన్ని కలిశారట. దాంతో… ఆయన ఎందుకు కలిశారు? వెనకా ముందూ ఏంటంటూ రకరకాల విశ్లేషణలు పెరుగుతున్నాయి. మాజీ మంత్రి పక్కచూపులు చూస్తున్నారా అన్నది ఈ సందర్భంగా ఎక్కువ మందికి వస్తున్న డౌట్‌. ఆయన ఆది నుంచి టిడిపినే నమ్ముకున్నారని, పార్టీ మారే ప్రసక్తే లేదని అనుచరులు చెబుతున్నా….పరసా చర్యలు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయని అంటున్నారు. అధిష్టానం పట్టించుకోకపోవడం, నియోజకవర్గంలో ప్రాధాన్యత లేకపోవడం వంటి పరిస్థితుల్లో పక్క చూపులు చూస్తే…. తప్పేంటని కూడా మాజీ మంత్రి అనుచరులు కొందరు గడుసుగా ప్రశ్నిస్తున్నారట. అధికారంలో ఉన్నప్పుడు ఆశించిన స్థాయిలో ఆర్థిక వనరులను సమకూర్చుకోకపోవడం వల్లనే ఈ పరిస్థితి వచ్చిందని కూడా పరసా టీమ్‌ మెంబర్స్‌ కొందరు కామెంట్‌ చేస్తున్నారు. ఐతే అదే సమయంలో ఆయన వైసీపీలోకి వెళ్లినా….స్వాగతించే స్థితిలో ఫ్యాన్‌ కేడర్‌ ఉందా అన్నది ఇంకా పెద్ద ప్రశ్న. ఇక ఎస్సీ నియోజకవర్గంలో పార్టీని నిలబెట్టి…. పూర్తి విధేయత ప్రకటించిన నాయకుడికి ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ ప్రశ్నించే వాళ్ళు సైతం లేకపోలేదు. అందుకు కౌంటర్స్‌ కూడా పార్టీ వర్గాల నుంచే పడుతున్నాయి. వెంకటరత్నంకు టిక్కెట్‌ దక్కని పరిస్థితుల్లో… ఆయన కుమార్తె షాలిని టిడిపి అధిష్టానాన్ని గట్టిగానే విమర్శించిన సంగతి గుర్తు చేస్తున్నారు. ఆ సంగతి ఎలా ఉన్నా… ప్రస్తుత పరిస్థితుల్లో మాజీ మంత్రిని పట్టించుకోకుంటే మాత్రం… ఆయన పక్క చూపులు చూడడం ఖాయమన్న ప్రచారం గట్టిగానే జరుగుతోంది సూళ్ళూరుపేట నియోజకవర్గంలో.