NTV Telugu Site icon

Off The Record: కులగణన కేంద్రంగా కొత్త రాజకీయం..

Congress Brs

Congress Brs

Off The Record: తెలంగాణలో కులగణన కేంద్రంగా… కొత్త రాజకీయం మొదలైందా? క్రెడిట్‌ వార్‌లో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ నేతలు మునిగి తేలుతున్నారా? రీ సర్వేలో బీఆర్‌ఎస్‌ ముఖ్యులు పాల్గొనక తప్పనిసరి పరిస్థితులు ఏర్పడ్డాయన్నది నిజమేనా? ఫస్ట్‌ సర్వేను వదిలేసిన గులాబీ పెద్దలు ఇప్పుడు రీ సర్వే చేస్తే పాల్గొంటామని ఎందుకు చెబుతున్నారు? తెర వెనక ఏం జరిగింది?..

తెలంగాణ పాలిటిక్స్‌లో ఇప్పుడు కులగణన అంశమే హాట్ సబ్జెక్ట్‌. జనవరిలో రాష్ట్ర ప్రభుత్వం సర్వే నిర్వహించగా… వివిధ కారణాలతో కొందరు పాల్గొనలేకపోయారు. కుదరక కొందరైతే… ఉద్దేశ్యపూర్వకంగా వదిలేసిన వాళ్ళు మరి కొందరు. అలా వివరాలు ఇవ్వని వారికోసం మరోసారి సర్వే చేస్తామని ప్రకటించింది ప్రభుత్వం. ఈ విషయంలో కూడా రాజకీయాలు మొదలయ్యాయి. మిస్‌ అయిన వాళ్ళ కోసమే మరోసారి అని ప్రభుత్వ వర్గాలు చెబుతుంటే… కాదు కాదు… అది మా వత్తిడివల్లే, పూర్తిగా మా విజయం అని జబ్బలు చరుచుకుంటున్నారట బీఆర్‌ఎస్‌ లీడర్స్‌. బీసీ కులగణన సర్వే రిపోర్ట్ పై అసెంబ్లీలో సుదీర్ఘ చర్చ జరిగింది. మొత్తం తప్పుల తడకలా ఉందని అప్పుడు వాదించింది బీఆర్‌ఎస్‌. సర్వేలో చూపించిన బీసీ జనాభా చాలా తక్కువగా ఉందని, కావాలనే అలా చేశారంటూ ఆరోపణలు గుప్పించింది. తప్పుల తడకగా ఉన్న సర్వేను ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోబోమంటూ కొట్లాడింది. ఆ చర్చ హాట్‌ హాట్‌గా జరుగుతున్న టైంలోనే సీఎం రేవంత్‌రెడ్డి లేవనెత్తిన పాయింట్‌ గులాబీ పార్టీని డిఫెన్స్‌లో పడేసింది.

అయితే, వాస్తవానికి కవిత తప్ప కేసీఆర్‌ కుటుంబ సభ్యులు ఎవరూ ఈ సర్వేలో పాల్గొనలేదు. ఇదే పాయింట్‌ని హైలైట్‌ చేసిన ముఖ్యమంత్రి.. అసలు సర్వేలో పాల్గొనని కేసీఆర్, కేటీఆర్, హరీష్‌రావు లాంటి వాళ్ళకు దాని మీద మాట్లాడే హక్కు ఉందా అంటూ నిలదీశారు. దీంతో నాలుక్కరుచుకున్న గులాబీ అధిష్టానం ఒక్కసారిగా అలర్ట్‌ అయిపోయి…ఆ తర్వాత తెలంగాణ భవన్‌లో తమ పార్టీ బీసీ నేతలతో సమావేశం నిర్వహించింది. బీసీ కులగణన కోసం చేసిన సర్వేలో తమ పార్టీ ముఖ్య నేతలు పాల్గొనకుండా దాని గురించి మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్‌ అన్న చర్చ జరిగిందట ఆ సందర్భంలో. కుల గణన సర్వేలో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నా…మిగతా ముఖ్య నాయకులంతా ఎందుకు దూరంగా ఉన్నారని… ఇతర బీసీ సంఘాల నాయకులు ప్రశ్నిస్తుంటే… తాము సమాధానం చెప్పలేకపోతున్నామని ఆ మీటింగ్‌లో బీఆర్‌ఎస్‌ బీసీ లీడర్స్‌ వాదించారట. ప్రభుత్వాన్ని ప్రశ్నించాలంటే… ముందు తమ నాయకులు కూడా సర్వేలో పాల్గొంటే బావుంటుందన్న ఏకాభిప్రాయం ఆ మీటింగ్‌లో వ్యక్తం అయినట్టు తెలిసింది. ఇక బీసీ సమావేశం ముగిసిన వెంటనే బయట జరిగిన మీడియా సమావేశంలో కేటీఆర్ కీలక ప్రకటన చేశారు. ప్రభుత్వం చేసిన కుల గణన తప్పుల తడక గా ఉందని, వెంటనే రీ సర్వే చేయాలని డిమాండ్ చేశారాయన. ఆ రీ సర్వేలో… తనతో పాటు కేసీఆర్ కూడా పాల్గొంటారని ప్రకటించారు.

ఇక, అప్పటి నుంచి బీసీ కుల గణన గురించి బీఆర్‌ఎస్‌ నేతలు మాట్లాడిన ప్రతి సందర్భంలోనూ..ప్రభుత్వం రీ సర్వే చేస్తే తమ నాయకులు ఖచ్చితంగా పాల్గొంటారంటూ ఘంటాపథందా చెబుతున్నారు. ఇప్పుడు ఈ విషయంలోనే క్రెడిట్‌ వార్‌ నడుస్తోంది. తప్పుల తడకగా ఉన్న సర్వేని ప్రశ్నించి రీ సర్వే చేయించగలిగామని బీఆర్‌ఎస్‌ పెద్దలు అంటుంటే…. అంత సీన్‌ లేదు, పార్టీ ముఖ్యులే సర్వే పాల్గొన లేదన్న అంశం హైలైట్‌ అయ్యేసరికి బీసీ వర్గాల్లో ఎక్కడ వ్యతిరేకత వస్తుందోనన్న భయంతో వాళ్ళే కొత్త డ్రామా మొదలుపెట్టారని విమర్శిస్తున్నారు కాంగ్రెస్‌ లీడర్స్‌. అటు పార్టీలోని బీసీ నేతల నుంచి కూడా వత్తిడి పెరిగేసరికి గులాబీ పెద్దలు ఊపిరి సలపని పరిస్థితుల్లోనే రీ సర్వేలో పాల్గొనడానికి అంగీకరించి ఉండవచ్చన్న చర్చ జరుగుతోంది రాజకీయ వర్గాల్లో. మొత్తం మీద రీ సర్వే వ్యవహారం మాత్రం.. తెలంగాణ పాలిటిక్స్‌లో సెగలు పుట్టిస్తోంది.