నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్‌తో పాటు మేయర్ స్థానాన్ని కైవసం చేసుకున్న టీడీపీ.. ఇప్పుడు జడ్పీ చైర్మన్ పీఠంపై కన్నేసింది. 35 జడ్పీ స్థానాలకుగాను ఐదింటిని ఏకగ్రీవం చేసుకోగలిగింది. మిగతా 30 సీట్లలో విజయం కోసం వ్యూహాత్మకంగా పావులు కలుపుతోంది. ఆయా నియోజకవర్గాల్లో అధికార పార్టీ నేతలు ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు. అదంతా ఒక ఎత్తయితే.. ఇప్పుడు జడ్పీ చైర్మన్ ఎంపికపై అధికార పార్టీలో అసంతృప్త రాగాలు వినిపిస్తున్నాయట. కోవూరు మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి.. ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే కంభం విజయరామిరెడ్డి, కావలి మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల్ రెడ్డి జడ్పీ సీటుపై కన్నేశారు. ముగ్గురూ నామినేషన్ల సైతం వేశారు. తనకు అవకాశం రాదని గ్రహించిన వంటేరు చివరి నిమిషంలో విత్‌డ్రా చేసుకోవడంతో.. మిగతా ఇద్దరు రేస్‌లో మిగిలారు. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఆయన భార్య, ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి ఇద్దరూ పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి వైపు మొగ్గు చూపుతున్నారట. దీంతో కొందరు పాత తరం ఎమ్మెల్యేలతో పాటు.. ఎక్కువ జడ్పీటీసీ స్థానాలు ఉన్న నియోజకవర్గ ఎమ్మెల్యేలు కూడా ఎంపీ దంపతుల తీరుపై అసంతృప్తితో ఉన్నట్టు చెప్పుకుంటున్నారు.
మాటిచ్చారంటూ మేయర్ పదవిని వీపీఆర్ అనుచురుడైన రూప్ కుమార్ యాదవ్ కి ఇచ్చారని, అందుకు తామంతా మద్దతిచ్చామని గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు జడ్పీ చైర్మన్ వ్యవహారంలో కూడా అధిష్టానం ఆయనకే ప్రాధాన్యత ఇస్తే మేం ఏమైపోవాలంటూ కొందరు ఎమ్మెల్యేలు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. కోవూరు నియోజకవర్గంలో 5 ZPTC స్థానాలు ఉంటే.. ఆత్మకూరు, గూడూరు, ఉదయగిరి, కావలి, సర్వేపల్లిలో మిగిలిన 30ఉన్నాయనీ, అధిష్టానం తమను సంప్రదించకుండానే మంత్రి నారాయణ, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాటలకే ప్రాధాన్యత ఇస్తోందంటూ ఫీలైపోతున్నట్టు సమాచారం. ఎమ్మెల్యేలతో మాట్లాడాకే.. జడ్పీ చైర్మన్ పేరును అధిష్టానానికి పంపాలని సీఎం చంద్రబాబు టెలికాన్ఫెరెన్స్ లో చెప్పారని.. ఐతే తమని సంప్రదించకుండానే.. ఎన్నికల పరిశీలకులు పోలంరెడ్డి పేరును అధిష్టానానికి పంపారంటూ నెల్లూరు టీడీపీ నేతలు రగిలిపోతున్నారట. ఈ విషయంలో మంత్రి అనంతో సహా.. జిల్లా అధ్యక్షుడు, సీనియర్ ఎమ్మెల్యేల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోలేదని చెబుతున్నారు. జిల్లాలో ఏ రాజకీయ నిర్ణయం అయినా MP వేమిరెడ్డి, మంత్రి నారాయణ మాటలనే అధిష్టానం వింటోందని, తమకు పార్టీలో కనీస ప్రాధాన్యత కూడా లేదన్న ఆవేదన ఎమ్మెల్యేలలో కనిపిస్తోందంటున్నారు.
కావలి మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల్ రెడ్డి అనుచరులు సైతం ఎంపీపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారట. వైసీపీలో ఉన్న వంటేరు వేణుగోపాల్ రెడ్డిని టిడిపిలోకి తీసుకొచ్చిన వేమిరెడ్డి.. ఆయనకు జడ్పీ చైర్మన్ అవకాశం కల్పించేలా చొరవ చూపకపోవడంతో.. నామినేషన్ విత్ డ్రా చేసుకున్నారంటూ రగిలిపోతున్నట్టు చెప్పుకుంటున్నారు. అభివృద్ధిలో వెనుకబడిన ఉదయగిరి వ్యక్తులకే ZP చైర్మన్ పదవి ఇవ్వాలన్న డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి. అలాగే… జడ్పీ చైర్మన్ పదవి పోలంరెడ్డికి ఇవ్వాలనుకోవడాన్ని కూడా ఎమ్మెల్యేలు వ్యతిరేకిస్తున్నారట. టికెట్ త్యాగం చేశారన్న సాకుతో ఆయన్ని ముందుకు తెస్తున్నారని, అలాంటప్పుడు పోలంరెడ్డి కొడుకు దినేష్ రెడ్డికి నామినేటెడ్ పదవి ఎందుకు ఇప్పించారన్నది మిగతా ఎమ్మెల్యేల ప్రశ్న. ఒకే ఫ్యామిలీలో ఇద్దరికి పదవులు ఎలా ఇస్తారంటూ టీడీపీ శాసనసభ్యులు అంతర్గతంగా మాట్లాడుకుంటున్నట్టు తెలిసింది. ఎమ్మెల్యేల నిర్ణయాలను పరిగణనలోకి తీసుకోకుండా.. అధిష్టానం ఒంటెత్తు పోకడలను అవలంబిస్తే భవిష్యత్తులో జిల్లా పార్టీలో అంతర్యుద్ధం మొదలువుతుందన్న హెచ్చరికలు సైతం వినిపిస్తున్నాయి. మొత్తంగా జడ్పీ చైర్మన్ పదవి వ్యవహారం నెల్లూరు టీడీపీలో నివురుగప్పిన నిప్పులా ఉందన్నది పొలిటికల్ వాయిస్. ఫైనల్‌గా వేమిరెడ్డి దంపతులు సూచించిన వారికే జడ్పీ చైర్మన్ పదవి ఇస్తారా.. లేక సీనియర్ ఎమ్మెల్యేల డిమాండ్‌ను పరిశీలిస్తారా అన్నది ప్రస్తుతం సింహపురి పాలిటిక్స్‌లో ఆసక్తికరంగా మారింది.

