OTR: నల్లగొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవి నియామకంపై రచ్చ కొనసాగుతూనే ఉంది. పున్నా కైలాష్‌ను డీసీసీ అధ్యక్షుడిగా నియమిస్తూ పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది మంత్రి కోమటిరెడ్డి వర్గం. పున్నాకు వ్యతిరేకంగా వెంకటరెడ్డి రాసిన లేఖతో మొదలైన పంచాయితీ అంతులేని కథలా కొనసాగుతూనే ఉంది. ఓవైపు పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాలతో పున్నా ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తుండగా… మరోవైపు వాటికి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వర్గం సహాయ నిరాకరణ చేతిలో చీలికల్ని కొట్టొచ్చినట్టు చూపిస్తోంది. డీసీసీ నియామకం తరువాత నల్లగొండ జిల్లా కేంద్రంలో రెండుగా విడిపోయిన కాంగ్రెస్ నేతలు ఎవరి అజెండా వాళ్లది, ఎవరి కార్యక్రమాలు వాళ్ళవి అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.
READ ALSO: OTR: బిఆర్ఎస్ ఎమ్మెల్యే & కాంగ్రెస్ సీనియర్ నేత కలసి ఇసుక దందా..!!
సోనియా గాంధీ పుట్టిన రోజు వేడుకలు, కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం, ఉపాధి హామీ పథకం పేరు మార్పు నిరసన కార్యక్రమం, ఇలా…ప్రోగ్రామ్ ఏదైనా సరే…. డిసిసి ఒకవైపు, ఆ పదవి ఆశించి భంగపడ్డ నేతలు మరోవైపు పోటాపోటీ కార్యక్రమాలు చేస్తూ బలప్రదర్శనకు దిగుతున్నారు. ఎవరికి వారు వేరువేరు కార్యక్రమాలతో తమ బలం బలగాన్ని నిరూపించుకునేందుకు చేస్తున్న ప్రయత్నంతో కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం అన్నట్టుగా మారింది కేడర్ పరిస్థితి. రెండు వర్గాల నేతలు తమ సన్నిహితుల దగ్గర చేస్తున్న కామెంట్స్ కూడా ఇప్పుడు పార్టీలో చర్చనీయాంశం అవుతున్నాయి. పున్నా కైలాష్ పూర్తి కాలం పదవిలో ఉండబోరని, ఆయన టైం ఆరు నెలలేనని అంటున్నారట డీసీసీ పోస్ట్ ఆశించి భంగపడ్డ మోహన్ రెడ్డి వర్గం నాయకులు. కొత్త డీసీసీ అధ్యక్షుల్ని ఆరు నెలల పాటు అబ్జర్వేషన్‌లో పెడతామని, వాళ్ల పనితీరును అంచనా వేశాక సంతృప్తికరంగా లేకుంటే తప్పిస్తామని ఇప్పటికే క్లారిటీ ఇచ్చేశారు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్.
దీంతో.. వచ్చే ఆరు నెలల్లో కైలాష్‌ని ఎలాగైనా ఫెయిల్యూర్ లీడర్‌గా చూపించాలని మంత్రి కోమటిరెడ్డి ముఖ్య అనుచరుడు గుమ్మల మోహన్‌రెడ్డి ప్రయత్నిస్తున్నారన్న వార్తలు కాక రేపుతున్నాయి. ఆరు నెలల తర్వాత మరో డిసిసి అధ్యక్షుడు వస్తాడని ఇప్పటికే సన్నిహితులతో చెబుతున్నారట ఆయన. ఆ క్రమంలోనే… ప్రతి సందర్భాన్ని తనకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నంలో బిజీగా ఉన్నట్టు తెలుస్తోంది. నల్గొండ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు గ్రాండ్‌గా జరిగాయి. రాష్ట్రంలో ఎక్కడా జరగని స్థాయిలో ఆ సెలబ్రేషన్స్ ఉండటం, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని ముఖ్య అతిధిగా పిలవడం వెనక బల నిరూపణ వ్యూహం ఉందంటున్నారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభకు ముందు మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో వేలాది మందితో భారీ ర్యాలీ, ఆ తర్వాత సభ నిర్వహించడం కూడా డీసీసీ పీఠంపై తనకు ఉన్న కోరికను బలంగా చెప్పేందుకేనన్న వాదన ఉంది. మరోవైపు సామాజిక సమీకరణలు, పనితీరు ఆధారంగా డీసీసీ పీఠాన్ని దక్కించుకున్న పున్నా కైలాష్ కూడా తగ్గేదిలే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.
మునుగోడు నియోజకవర్గం చండూరులో ఓ ప్రైవేటు కార్యక్రమానికి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హాజరైన సందర్భంలో డీసీసీ అధ్యక్షుడు పున్నా కైలాష్ వేదిక మీదికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. కొందరు నేతల కనుసన్ననల్లోనే డీసీసీ అధ్యక్షుడికి అవమానం జరిగిందనే చర్చ జరుగుతుండగా… వచ్చే ఆరు నెలల కాలాన్ని సద్వినియోగం చేసుకుని తన పనితనం ఏంటో నిరూపించుకునేందుకు సిద్ధమవుతున్నారట డీసీసీ అధ్యక్షుడు. దీంతో పదవి దక్కించుకున్న నేత, పదవి ఆశించి భంగపడ్డ నాయకుడి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. మొత్తంగా డీసీసీ అధ్యక్షుడి నియామకంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ లేఖరాసి నిప్పురాజేసిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డే ఈ మంటను చల్లాచర్చాలని అంటున్నారు నల్గొండ హస్తం నేతలు.
READ ALSO: OTR: టీడీపీ, వైసీపీ రాజకీయాల మధ్య తిరుమల దర్శనాల వివాదం!