వరసగా మూడోసారి తెలంగాణలో అధికారంలోకి వచ్చేందుకు ఇప్పటి నుంచే గ్రౌండ్ వర్క్ చేసుకుంటోంది టీఆర్‌ఎస్ పార్టీ. ఎన్నికల క్షేత్రానికి కావాల్సిన రణతంత్రాన్ని పక్కాగా రచిస్తోంది. ఇందులో కీలకం ఐపాక్‌తో కుదుర్చుకున్న ఒప్పందం. గతంలో ప్రశాంత్‌కిశోర్ నేతృత్వంలోని ఐపాక్ పలు రాజకీయ పార్టీలతో కలిసి పనిచేసింది. ఆయా రాజకీయ పార్టీల నిర్మాణం.. కార్యక్రమాల అమలు క్షుణ్ణంగా అధ్యయనం చేసింది ఐపాక్. ఆ అనుభవంతోపాటు తెలంగాణలో ఉన్న పరిస్థితి… టీఆర్ఎస్‌కు క్షేత్రస్థాయిలో ఉన్న ప్లస్సులు.. మైనస్‌లపై గ్రౌండ్ రిపోర్ట్స్‌ను ఎప్పటికప్పుడు అధినాయకత్వానికి అందజేయనుంది సర్వే బృందం. ఆ రిపోర్ట్స్ ఆధారంగా టీఆర్ఎస్ నాయకత్వం తగిన నిర్ణయం తీసుకుంటుందని అనుకుంటున్నారు.
ఇన్నాళ్లూ టీఆర్ఎస్‌లో పార్టీ కార్యక్రమాల అమలుపై ఇంఛార్జుల నుంచి నివేదికలు అందేవి. ఇప్పుడలా ఉండకపోవచ్చు. ఈ మధ్య కాలంలో ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టింది టీఆర్ఎస్. వివిధ రూపాల్లో నిరసనలు తెలియజేసింది. ఈ కార్యక్రమాలు కొన్నిచోట్ల సక్సెస్ అయితే.. మరికొన్నిచోట్ల నామమాత్రంగా సాగాయి. ఇప్పుడు ఐపాక్ ఎంట్రీతో నిర్లక్ష్యంగా ఉండే నాయకుల తీరు క్షణాల్లో హైకమాండ్‌కు చేరిపోతుంది. ఏం చెప్పినా లైట్‌గా తీసుకునేవారి ఆటలు సాగబోవన్నది గులాబీ శిబిరంలో జరుగుతున్న చర్చ.
టీఆర్ఎస్ పిలుపిచ్చే కార్యక్రమాల అమలు గ్రౌండ్ లెవల్లో ఎలా ఉంటుందో.. ఎవరు చురుకుగా పనిచేస్తున్నారో.. ఎవరు నాటకాలు ఆడుతున్నారో ఐపాక్ బృందం పసిగట్టేస్తుంది. పైగా సర్వే బృందంలో ఎవరు ఉంటున్నారో.. వారెవరో టీఆర్ఎస్ నేతలకు తెలిసే అవకాశం లేదు. గుంపులో గోవిందగా ఉంటారు ఆ సంస్థ సభ్యులు. దీంతో ఐపాక్ ఇచ్చే నివేదికలే టీఆర్ఎస్ నేతల భవిష్యత్ తలరాతలను రాస్తాయని చర్చ సాగుతోంది. గత ఎన్నికల్లో సిట్టింగ్‌లకే ఎక్కువ ఛాన్స్ ఇచ్చింది. కొందరినే మార్చింది. ఇప్పుడు సర్వేలో పాస్ మార్కులు పడేది ఎంత మందికి? పార్టీ అంచనాలను అందుకోలేని వారు ఎవరు? అనేది బయటకు పొక్కే అవకాశాలు లేవు.
గతంలో పార్టీ ఇంఛార్జులు సమీక్షలకు వస్తే.. టికెట్ ఆశించే వాళ్లు బలప్రదర్శనలకు దిగేవాళ్లు. లేదా ఆ ఇంఛార్జులను బుట్టలో వేసుకోవడానికి.. అనుకూలంగా రిపోర్టులు ఇప్పించుకోవడానికి జిమ్మిక్కులు అనేకం చేసేవారు. ఇప్పుడా పప్పులు ఉడకవు. లైట్‌గా తీసుకునేవారికి ఫీజు కొట్టేయడం ఖాయం. ఇప్పటికే ఐపాక్ బృందాలు నియోజకవర్గాల్లో దిగిపోతున్నాయి. అందుకే ఆ సంస్థ మాట వినిపించగానే ఉలిక్కి పడుతున్నారట టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నాయకులు. మరి.. ఈ వడపోతల్లో ఎంతమంది నిలుస్తారో చూడాలి.