తెలంగాణ కాంగ్రెస్‌లో కొందరు సీనియర్ నాయకులతో AICC రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్యం ఠాగూర్ ఇటీవల హైదరాబాద్‌లోని MLA క్వార్టర్స్‌లో సమావేశం అయ్యారు. ఆ సమావేశానికి కేవలం 9 మంది నేతలనే పిలిచారు ఠాగూర్. వీరితోపాటు కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కూడా హాజరయ్యారు. పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, మధు యాష్కీ, ఉత్తమ్ కుమార్‌రెడ్డి.. దామోదర రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీటింగ్‌కు వెళ్లారు. సాధారణంగా సమావేశం సీనియర్ నేతలకే పరిమితమైతే పెద్దగా ఇబ్బంది ఉండేది కాదు. కానీ వ్యూహకర్త రావడంతో ఆహ్వానాలు అందని నాయకులు చాలా ఫీలయ్యారట.
పార్టీ పదవులలో ఉన్న నాయకుల్లో పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్స్.. AICC కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్ మహేశ్వర్‌రెడ్డి వంటి వారికి ఆహ్వానాలు లేవు. దీంతో గీతారెడ్డి.. మహేశ్వర్‌రెడ్డి లాంటి నాయకులు ఇంఛార్జ్ ఠాగూర్‌పై గుర్రుగా ఉన్నారట. పైగా ఆ మీటింగ్‌కు వెళ్లినవారిలో పార్టీపై అసంతృప్తితో ఉన్నవాళ్లు.. పార్టీ లైన్‌కు వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్లూ ఉన్నారు. తాము కూడా అలాగే ఉంటే మీటింగ్‌కు పిలిచేవాళ్లేమో అనే చర్చ మొదలైందట. ఈ పరిణామాలపై కాంగ్రెస్‌లో కీలక పదవిలో ఉన్న నాయకుడు దగ్గర వాపోయారట సీనియర్ నేతలు. AICC ఇంఛార్జే కాంగ్రెస్ సీనియర్లను విస్మరించి సమావేశం ఏర్పాటు చేయడంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారట. పీసీసీలో తాజా, మాజీ చీఫ్‌లతోపాటు వర్కింగ్ ప్రెసిడెంట్స్.. AICC కార్యక్రమాల అమలు కమిటీ కూడీ కీలకమే కదా అని ప్రశ్నిస్తున్నారట.
ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో మీటింగ్ అంతా రహస్యంగానే సాగింది. ఆ భేటీకి సంబంధించి ఫొటోలు.. వీడియోలు తీయడానికి కూడా అంగీకరించలేదు. పూర్తి ఆంక్షల నడుమ.. ఎవరూ దరిదాపులకు రాకుండా సమావేశం సాగిపోయింది. సాధారణంగా కాంగ్రెస్ పార్టీనే పిలిచి సమావేశానికి సంబంధించిన వీజువల్స్.. ఫొటోలు ఇస్తుంది. ఆ సంప్రదాయానికి భిన్నంగా సాగింది లేటెస్ట్ మీటింగ్. పైగా కొందరినే పిలవడం ఇప్పుడు రచ్చ అవుతోంది. త్వరలో రాహుల్ గాంధీ రాష్ట్ర పర్యటన ఉంది. ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంతోపాటు… తెలంగాణలో కాంగ్రెస్ బలోపేతానికి చకచకా చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో నిర్వహిస్తున్న సమావేశాలు కొందరి చుట్టూనే తిరగడం.. ఏం జరుగుతుందో తెలియకపోవడంతో గుర్రుగా ఉన్నారు సీనియర్లు.