బండారు లక్ష్మారెడ్డి. ప్రస్తుతం ఉప్పల్ trs నాయకుడు. మాజీ ఎమ్మెల్యే బండారు రాజిరెడ్డి సోదరుడు. 2014లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత 2018 ఎన్నికల ముందు సీఎం కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకొన్నారు లక్ష్మారెడ్డి. టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తోపాటు మంత్రి హరీష్‌రావుకు కూడా సన్నిహితoగా ఉంటున్నారాయన. నాడు ఉప్పల్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి గెలుపునకు సపోర్ట్ చేయాలని పార్టీ ఆదేశించడంతో లక్ష్మారెడ్డి సహకరించారు. GHMC ఎన్నికల్లో ఉప్పల్ నియోజకవర్గం పరిధిలో తనవర్గం వారికి కూడా కొన్ని సీట్లు ఇప్పించుకున్నారు. ఇద్దరిని గెలిపించుకున్నారు కూడా. ఐతే ఇన్నాళ్లు సైలెంట్‌గా ఉన్న బండారు లక్ష్మారెడ్డి ఇప్పుడు స్పీడ్ పెంచారు. టీఆర్ఎస్ ప్లీనరీ సందర్భంగా నియోజకవర్గం అంతా ప్లెక్సీలు.. కట్ ఔట్లతో హల్ చల్ చేశారు.
ఇంతలో ఏమైందో ఏమో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు లక్ష్మారెడ్డి. దగ్గర బంధువు ఫంక్షన్లో ఇద్దరు గంటకుపైగా మంతనాలు చేశారు. రాజకీయంగా చర్చలు జరిపినట్టు సమాచారం. రాబోయే ఎన్నికల్లో కచ్చితంగా పోటీ చేయాలని భావిస్తున్న లక్ష్మారెడ్డి.. పీసీసీ చీఫ్‌తో ఏం మాట్లాడారన్నది ఆసక్తిగా మారింది.
ఉప్పల్ టీఆర్ఎస్‌లో ఇప్పటికే ఆశావాహులు హడావిడి ఉంది. ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డికి పోటీగా మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ కార్యక్రమాలు చేస్తున్నారు. బొంతు భార్య ఈ నియోజకవర్గం పరిధిలోనే కార్పొరేటర్. ఈ దఫా ఉప్పల్‌లో తానే పోటీ చేస్తా అని ప్రచారం చేసుకుంటున్నారు మాజీ మేయర్. ఎమ్మెల్యే సుభాష్‌రెడ్డి భార్య కార్పొరేటర్‌గా ఓడిపోవడం.. రెండుసార్లు ఎమ్మెల్యేగా భేతి ఉండటంతో ఒకరికి ఒకరు పోటీ పడి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇద్దరి మధ్య విభేదాలు అధిష్టానం దృష్టి కి కూడా వెళ్లాయి. హైకమాండ్ క్లాస్ కూడా పీకింది. ఈ ఇద్దరి మధ్య తాను టీఆర్ఎస్‌లో ఇమడగలనా అని లక్ష్మారెడ్డి ఆలోచిస్తున్నారట.
పీసీసీ చీఫ్ రేవంత్ .. లక్ష్మారెడ్డికి కాంగ్రెస్‌లో చేరాలని ఆఫర్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఐతే తాను ఈసారి ఉప్పల్ నుంచి పోటీ చేయడం ఖాయమని. టీఆర్‌ఎస్ తనకే టికెట్ ఇస్తుంది అని చెప్పుకుంటున్నారు. పార్టీ మారే ఆలోచన లేదని చెప్పేశారట. రేవంత్‌తో భేటీ కేవలం ఆ ఫంక్షన్‌కే పరిమితమని చెబుతున్నారట. మొత్తానికి ఒక సమావేశం ఉప్పల్ రాజకీయాన్ని వేడెక్కించేసింది.