OTR : కృష్ణా జలాల రచ్చ: తాత్కాలిక ఒప్పందం.. శాశ్వత వివాదం, తెలంగాణకు అన్యాయం చేసింది ఎవరు?

  • సాగర్‌ నీటి ఒప్పందాలపై బీఆర్‌ఎస్‌ వర్సెస్‌ కాంగ్రెస్‌
  • నిజంగా అన్యాయం చేసింది ఎవరంటూ రాజకీయ చర్చలు
  • ఏపీ ప్రభుత్వపు పల్నాడు వాటర్‌ గ్రిడ్‌తో మొదలైన వివాదం
  • జల దోపిడీకి కాంగ్రెస్‌ సర్కార్‌ సహకారం అంటూ బీఆర్‌ఎస్‌ ఆరోపణ
  • పాత ఒప్పందాల వివరాలతో సీఎం రేవంత్‌ రివర్స్‌ అటాక్‌
  • బీఆర్‌ఎస్‌ చేసుకున్న ఒప్పందాలవల్లే ఇప్పుడీ సమస్య అన్న సీఎం
  • ఆంధ్రాకు 512, తెలంగాణకు 298.96 టీఎంసీలతో 2015లో అగ్రిమెంట్‌
  • అది ఏడాదికే అయినా పట్టించుకోకపోవడంతో 2020లో పర్మినెంట్‌
  • కేసీఆర్‌ సర్కార్‌ ఎందుకు నిర్లక్ష్యం చేసిందంటూ సీఎం ప్రశ్న
  • సమస్య పరిష్కారం కోసం సుప్రీం కోర్ట్‌కు వెళ్లామంటున్న సర్కార్‌
  • పల్నాడు వాటర్‌ గ్రిడ్‌, రాయలసీమ లిఫ్ట్‌ అన్నీ అప్పుడేనని విమర్శలు
Otr 2

Otr 2

OTR : ఏది నిజం…? నీటి వాటాల పంపకాల్లో ఎవరి వాదన కరెక్ట్‌…? కృష్ణా నీళ్ళ విషయంలో తెలంగాణ హక్కుల్ని కాలరాసింది ఎవరు? దానికి సంబంధించి బీఆర్‌ఎస్‌ విమర్శలు, కాంగ్రెస్‌ కౌంటర్స్‌ మాటేంటి? తాత్కాలిక ఒప్పందం చుట్టూ జరుగుతున్న రచ్చ ఏంటి? అసలు ఏంటా తాత్కాలికం? ఆ ఒప్పందాల లోగుట్టు ఏంటి? నాగార్జునసాగర్ నీళ్ల మీద పొలిటికల్ నిప్పులు కురుస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అక్రమంగా నీటిని తరలించుకుపోయే పనిలో ఉందంటూ… మళ్లీ కృష్ణా జలాల యుద్ధం మొదలైంది. దానికి సంబంధించి తెలంగాణలోని అధికార, ప్రతిపక్షాలు పరస్పరం దూషించుకుంటున్నారు. తప్పు మీదంటే మీదేనంటూ గుట్లు బయటపెట్టేసుకుంటున్నాయి. దీంతో…అసలిప్పుడు కొత్తగా కృష్ణా జలాల సమస్య ఎందుకు వచ్చింది? నిజంగానే తెలంగాణకి అన్యాయం జరుగుతుంటే… అందుకు కారకులు ఎవరు..? నీటి అవసరాలతో రాజకీయం చేస్తోంది ఎవరంటూ రకరకాల చర్చలు జరుగుతున్నాయి.

అదే సమయంలో పాత ఒప్పందాల ప్రపస్తావనలు కూడా వస్తున్నాయి. రెండు రాష్ట్రాల మధ్య నీటి పంపకాలకు సంబంధించి అప్పట్లో జరిగిన ఒప్పందం ఏంటి…? దాని మీద ఇప్పుడు రచ్చ జరగడానికి కారకులు ఎవరన్న ప్రస్తావన కూడా వస్తోంది. అసలు తాజా వివాదానికి కారణం పల్నాడు తాగునీటి పథకం. అక్కడి ప్రజలకు తాగునీరు అందించేందుకు ఏపీ ప్రభుత్వం చేపట్టిన పథకం చుట్టూనే ఇప్పుడు తెలంగాణలో రాజకీయ రచ్చ మొదలైంది. ఆంధ్రప్రదేశ్‌ సర్కార్‌ అక్రమంగా నీటిని తరలించుకుని పోతుంటే తెలంగాణ ప్రభుత్వం పట్టనట్టుగా వ్యవహరిస్తోంది, అసలు ఏపీకి సరెండర్ అయిందంటూ ఆరోపణాస్త్రాలను ఎక్కుపెట్టింది బీఆర్‌ఎస్‌. ఏపీ ప్రభుత్వ నీటి దోపిడీకి ప్రస్తుత తెలంగాణ పాలకులు సహకరిస్తున్నారని కూడా ఆరోపిస్తోంది విపక్షం. సాగర్‌ దగ్గర తెలంగాణ ప్రభుత్వ పర్యవేక్షణ లేకపోవడం వల్లనే జల దోపిడీ జరుగుతోందంటూ మాట్లాడుతున్నారు గులాబీ లీడర్స్‌.
సరిగ్గా ఈ పాయింట్‌ దగ్గరే ఆరోపణల వ్యవహారం కీలక మలుపు తిరిగింది. సమాధానం చెప్పకుండా దీన్ని ఇలాగే వదిలేస్తే… డ్యామేజ్‌ అవుతామని భావించిన అధికార పార్టీ నాయకులు రివర్స్ అటాక్‌ మొదలుపెట్టారు. గతంలో బీఆర్‌ఎస్‌ అధికారంలో ఉన్నప్పుడు ఏపీతో తెలంగాణ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం కారణంగానే… ఇప్పుడీ సమస్య ఉత్పన్నం అయిందంటూ పాత అగ్రిమెంట్స్‌ వివరాలను బయట పెట్టారు సీఎం రేవంత్. ఆ రకంగా… ఏపీ చేస్తున్న జల దోపిడీకి బాధ్యులు BRS వాళ్ళేనని చెబుతోంది తెలంగాణ సర్కార్.

811 టీఎంసీల కృష్ణా జలాల్లో 71 శాతం పరీవాహక ప్రాంతం తెలంగాణలోను, 29 శాతం ఆంధ్రా పరిధిలోను ఉంది. ఈ లెక్కల ఆధారంగా చూస్తే… తెలంగాణకు 578 టీఎంసీల నీటి వాటా ఉండాలి. ఐతే.. గతంలో కేసీఆర్ సీఎంగా, హరీష్‌రావు ఇరిగేషన్‌ మంత్రిగా ఉన్నప్పుడు జరిగిన అగ్రిమెంట్‌వల్లే సమస్య వచ్చిందని చెబుతున్నారు తెలంగాణ సీఎం రేవంత్‌. 2015, జూన్ 26న అప్పటి కేంద్ర మంత్రి ఉమా భారతి సమక్షంలో ఆంధ్రాకు 512, తెలంగాణకు 298.96 టీఎంసీలు చాలంటూ సంతకం చేశారని గుర్తు చేస్తున్నారు రేవంత్. అయితే… ఇందులో కూడా ఓ చిన్న తిరకాసు ఉంది. అప్పటి ఒప్పందం ఏడాదికే పరిమితం. ప్రతి ఏటా దాని గురించి చర్చించి ఎప్పటికప్పుడు పరిస్థితులకు అనుగుణంగా మార్పులు చేసుకునే వెసులుబాటు ఉండేది. కానీ… నాటి సీఎం కేసీఆర్ పట్టించుకోకపోవడంతో 2015 నాటి పంపకాలే శాశ్వతం అంటూ 2020, జనవరి 29న కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందట. ఆ లెక్క ప్రకారమే… ఇప్పుడు ఏపీ… మాకు కేటాయించిన నీటి వాటా మేరకే ప్రాజెక్టులు కడుతున్నాంగానీ… అదనపు వాటా మాకు అవసరం లేదని వాదిస్తోందంటున్నారు. ఆ పాత సంగతిని గుర్తు చేస్తూనే…. గతంలో కుదుర్చుకున్న నీటి ఒప్పందాలను సమీక్షించాలంటూ కేంద్రం మీద ఒత్తిడి పెంచుతున్నామని, దానికి సంబంధించిన నిర్ణయం కూడా వీలైనంత త్వరగా వచ్చేలా చూస్తున్నామని చెబుతున్నారు రేవంత్‌. ఈ విషయంలో సుప్రీం కోర్టును ఆశ్రయించి చేయాల్సిన అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు తెలంగాణ ముఖ్యమంత్రి. ఆ రకంగా…. నాడు మేం చేసుకున్న నీటి ఒప్పందాలు తాత్కాలికం అని బీఆర్‌ఎస్‌ వాదిస్తుంటే… ఆ విషయంలో కూడా ఎందుకు రాజీపడ్డారని ప్రశ్నిస్తోంది కాంగ్రెస్‌. ఒక ఏడాదికే జరిగిన నీటి కేటాయింపుల్ని పట్టించుకోకుండా నాటి బీఆర్‌ఎస్‌ సర్కార్‌ నిర్లక్ష్యంగా వ్యవహరించినందునే ఇప్పుడీ పరిస్థితి వచ్చిందన్నది కాంగ్రెస్‌ సర్కార్‌ వాదన. దీనికి తోడు.. పల్నాడు వాటర్ గ్రిడ్ పథకం అయినా, రాయలసీమ లిఫ్ట్ స్కీమ్ అయినా కేసీఆర్‌ అధికారంలో ఉన్నప్పుడే ప్రారంభమయ్యాయంటూ… జీవోలు, నిధుల కేటాయింపుల వివరాలను కూడా బయట పెట్టారు సీఎం రేవంత్. మొత్తానికి… BRS వాదనలు… కౌంటర్ గా కాంగ్రెస్ వాస్తవాలు అంటూ నివేదికలు బయట పెడుతున్నారు.