Kothapalli Subbarayudu : చాలు బాబు చాలు…! మీతోపాటు ఆపార్టీ ఈపార్టీ అని తిరిగింది చాలు..!! ఇకనైనా మేం చెప్పినట్టు చేయండి. లేదంటే మాదారి మేం చూసుకుంటాం అని.. ఆ మాజీ మంత్రికి తెగేసి చెప్పారట అనుచరులు. దీంతో ఆ నేతకు కొత్త కష్టాలు తప్పడం లేదని టాక్. ఇంతకీ ఎవరా నాయకుడు? ఏమా కథా?
కొత్తపల్లి సుబ్బారాయుడు. కొత్తదనం కోసమో లేక ఉనికి కాపాడుకోవడానికో ఏమో పార్టీలు మారడమే ఆయన హాబీ అయ్యింది. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా పనిచేశారు. ఒకసారి ఎంపీగానూ ఉన్నారు. టీడీపీలో ఉన్నప్పుడు ఓ వెలుగు వెలిగారు సుబ్బారాయుడు. 2009లో పీఆర్పీలోకి తొలి జంప్ చేశాక.. మాజీ మంత్రి పరిస్థితి ఎన్నికలకో పార్టీ అన్నట్టుగా మారిపోయింది. ఎన్నికలొస్తే చాలు.. సుబ్బారాయుడు ఏ పార్టీలో ఉన్నారో నరసాపురం ప్రజలు ఆరా తీసే పరిస్థితి. 2009 నుంచి నిలకడ లేకుండా పోయింది. బీజేపీ.. లెఫ్ట్ పార్టీలు మినహా అన్నీ ప్రధాన పార్టీలను ఓ రౌండ్ వేశారు కొత్తపల్లి. వైసీపీ సస్పెండ్ చేశాక.. ఖాళీగా ఉన్న ఆయన.. ఇప్పుడు పొలిటికల్ గూటిని వెతుక్కునే పనిలో పడ్డారు. అనుచరులతో పలుదఫాలుగా చర్చలు జరిపారని… తుది నిర్ణయానికి వచ్చేశారని టాక్. కాకపోతే ఇక్కడే ట్విస్ట్‌లు ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది.
అనుచరులతో ఎన్ని మంతనాలు చేసినా.. వడపోతలు చేపట్టినా.. ఏ పార్టీలో చేరాలో కొత్తపల్లికి అంతుచిక్కడం లేదట. చివరాఖరి మీటింగ్‌లో అదే తేలడంతో.. మాజీ మంత్రిపై కేడర్ కన్నెర్ర చేసిందట. ఇప్పటి వరకు ఆయనతోపాటు ఉండి.. కొత్తపల్లి ఏ పార్టీలోకి వెళ్లితే.. ఆ పార్టీ కండువా కప్పుకొన్న అనుచరులు… అయ్యా మీకో దండం..! మీరు చేసింది చాలు.. ఆలోచించింది అంతకంటే ఎక్కువే. ఇకనైనా మేం చెప్పింది చేయండి అని సూటిగా సుత్తిలేకుండా కొత్తపల్లికి చెప్పేశారట. జరిగిందేదో జరిగింది అంతా కలిసి టీడీపీలోకి రీఎంట్రీ ఇద్దాం.. అలా అయితేనే మీతో కలిసి వస్తాం లేదంటే.. టాటా బైబై అని అనుచరులు తేల్చేడంతో కంగుతిన్నారట కొత్తపల్లి. భవిష్యత్‌లో మరోసారి తప్పు జరిగితే త్యాగాలు చేసే ఓపిక తమకు లేదని వెల్లడించడంతో.. కొత్తపల్లి సైతం టీడీపీవైపు చూస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. దానిపైనే త్వరలోనే ప్రకటన చేస్తారని సమాచారం.
కొత్తపల్లి.. ఆయన అనుచరుల నిర్ణయం బాగానే ఉన్నా.. నరసాపురంలో టీడీపీ కేడర్ ఏరకంగా రిసీవ్ చేసుకుంటుంది అనేది పెద్ద ప్రశ్న. అవకాశాలు.. పదవులు ఇచ్చిన పార్టీని కాదని కీలక సమయంలో టీడీపీని వదిలి వెళ్లిన కొత్తపల్లిని ఎలా నమ్మేది అనేది కొందరు సందేహిస్తున్నారట. మధ్యలో ఒకసారి టీడీపీలోకి వచ్చినా ఎక్కువ రోజులు ఉండలేదనేది గుర్తు చేస్తున్నారట. ఇప్పుడు మరోసారి టీడీపీ కండువా కప్పుకొంటే.. పార్టీలో ఆయన పరిధి ఎక్కడి వరకు అనేది తేల్చాలని లోకల్ తెలుగు తమ్ముళ్లు డిమాండ్ చేయబోతున్నారట. కొత్తపల్లి రాకను స్వాగతించేందుకు సిద్ధంగా లేని విషయాన్ని చంద్రబాబు దృష్టికీ తీసుకెళ్లారట. మొదటి నుంచి టీడీపీలో ఉన్నవాళ్లకు.. కష్టకాలంలో టీడీపీకి అండగా ఉన్నవారికి అధిష్ఠానం ఇచ్చే భరోసా ఏంటని ప్రశ్నిస్తున్నారట. తరచూ పార్టీలు మారే కొత్తపల్లికి టీడీపీలో ప్రాధాన్యం ఇస్తే తామేం చేయాలో కూడా పార్టీ పెద్దలు చెబితే బాగుంటుందని వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారట.
నరసాపురం టీడీపీలో ఈ సెగలు కొత్తపల్లి దృష్టికి వెళ్లాయో లేదో.. ఆయన ఏం చేస్తారనేది ఉత్కంఠగా మారింది. టీడీపీలో ఉన్న వర్గపోరుతో ఆయనకు లభించే ప్రాధాన్యంపై ప్రశ్నలు వినిపిస్తున్నాయి. మరి.. అనుచరుల మాట ప్రకారం నిర్ణయం తీసుకునే మాజీ మంత్రికి పొలిటికల్ ఫ్యూచర్ ఎలా ఉంటుందో చూడాలి.