కొండా విశ్వేశ్వర్‌రెడ్డి. మాజీ ఎంపీ. టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఆహ్వానంతో 2013లో గులాబీ కండువా కప్పుకొన్న విశ్వేశ్వర్‌రెడ్డి.. 2014 లోక్‌సభ ఎన్నికల్లో చేవెళ్ల నుంచి ఎంపీగా గెలిచారు. 2018 అసెంబ్లీ ఎన్నికల ముందు నాటకీయ పరిణామాల మధ్య టీఆర్ఎస్‌కు రాజీనామ చేసి కాంగ్రెస్ కండువా కప్పేసుకున్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి ఎంపీ అభ్యర్థిగా బరిలో దిగినా 13వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఆ తర్వాత కాంగ్రెస్‌లోనూ ఉక్కపోత ఫీలయ్యారు విశ్వేశ్వర్‌రెడ్డి. 2021 మార్చిలో హస్తంపార్టీకి హ్యాండిచ్చారు. అప్పటి నుంచి ఏ పార్టీలోనూ చేరలేదు. బీజేపీలోకి వెళ్తారని కొన్నిసార్లు.. కాదు తిరిగి కాంగ్రెస్ కండువా కప్పుకొంటారని మరికొన్నిసార్లు ప్రచారం జరిగినా.. ఆయన ఏ నిర్ణయమూ తీసుకోలేదు. తెలంగాణలో ప్రధాన పార్టీలు ఎన్నికల మూడ్‌లోకి వెళ్తున్నా.. ఈ మాజీ ఎంపీకి చురుకు పుట్టడం లేదు. దాంతో కొండా దారెటు అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
వర్తమాన రాజకీయ నాయకులకు కాస్త భిన్నంగా కనిపిస్తారు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి. తన రూటే సెపరేట్ అన్నట్టుగా ఉంటుంది ఆయన తీరు. వార్తల్లో వ్యక్తిగా ఉంటారు కానీ.. తన భవిష్యత్ రాజకీయ ప్రయాణం ఎక్కడో.. ఎటువైపో చెప్పరు. అలాగని రాజకీయలను వదిలి పెట్టలేదు. బీజేపీ, కాంగ్రెస్ నాయకులతో చెట్టపట్టాలేసుకుని తిరుగుతారు. ఆ నాయకులతో మాజీ ఎంపీకి ఉన్న సాన్నిహిత్యం చూస్తే విశ్వేశ్వర్‌రెడ్డి రెండిళ్ల పూజారేమో అనే అనుమానం కలుగుతుంది. ఆయా సందర్భాలను బట్టి కాసేపు బీజేపీకి జైకొడతారు.. మరో సమయంలో కాంగ్రెస్‌ను ప్రశంసిస్తారు. ఆ మధ్య విశ్వేశ్వర్‌రెడ్డిని బీజేపీలోకి తీసుకురావడానికి కమలనాథులు చాలా ప్రయత్నాలు చేశారు. కానీ.. ఆయన నుంచి ఉలుకు పలుకు లేకపోవడంతో పట్టించుకోవడమే మానేశారు బీజేపీ నాయకులు.
తిరిగి కాంగ్రెస్‌లోకి వెళ్లే ఆలోచనలో ఉండటం వల్లే బీజేపీ ఆఫర్‌పై విశ్వేశ్వర్‌రెడ్డి పక్కన పెట్టేశారని చర్చ జరిగింది. కానీ.. ఇటీవల బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్.. ఈ మాజీ ఎంపీతో సమావేశం అయ్యారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో కాషాయ కండువా కప్పుకోవడమే తరువాయి అని అంతా అనుకున్నారు. కానీ..కథ మళ్లీ మొదటికొచ్చింది. అంతకుముందు హుజురాబాద్ ఉపఎన్నికలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ను గెలిపించాలని ఓపెన్ స్టేట్‌మెంట్ ఇచ్చారు. దానికి కొద్దిరోజుల ముందు కాంగ్రెస్‌పట్ల సానుకూల వైఖరి కనబర్చారు. స్పష్టత లేని ఈ వైఖరే కాంగ్రెస్, బీజేపీ వర్గాలను గందరగోళంలో పడేస్తున్నాయి. మరి.. తెలంగాణలో పొలిటికల్ టెంపరేచర్ పెరుగుతున్న సమయంలోనూ విశ్వేశ్వర్‌రెడ్డి ఇలా స్వతంత్రంగానే ఉంటారా? లేక కాంగ్రెస్, బీజేపీల్లో దేన్ని ఎంచుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నారా.. కాలమే చెప్పాలి.