రబీ ధాన్యం కొనుగోళ్లులో పెద్ద కుంభకోణం జరుగుతుందని వైసీపీ రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ బహిరంగ విమర్శలు చేశారు. ఇందుకు జిల్లా డీఆర్సీ, నీటి సలహా కమిటీ వేదికైంది. రైతుల అమాయకత్వాన్ని రైస్ మిల్లర్లు దోచేస్తున్నారనేది బోస్ ఆరోపణ. అయితే ఎంపీ చేసిన కామెంట్స్‌పై జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఆయన ఇన్‌డైరెక్ట్‌గా ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి ఫ్యామిలీని టార్గెట్ చేశారనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
కాకినాడ వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి.. తండ్రి భాస్కర్‌రెడ్డి ఇటీవలే సివిల్ కార్పొరేషన్ ఛైర్మన్ అయ్యారు. అంతకుముందు ఆయన సుధీర్ఘ కాలంపాటు రాష్ట్ర రైస్ మిల్లర్లు అసోసియేషన్ ప్రెసిడ్ంట్‌గా ఉన్నారు. సివిల్ కార్పొరేషన్ చైర్మన్ అయ్యాక.. రైస్ మిల్లర్ల అసోసియేషన్ పదవిని ఎమ్మెల్యే సోదరుడు వీరభద్రారెడ్డికి అప్పగించారు. ఇంకోవైపు.. ద్వారంపూడి ఫామిలీకి పిల్లి సుభాష్‌చంద్రబోస్‌కి ముందు నుంచి విభేదాలున్నాయి. ఇద్దరూ కాంగ్రెస్‌లో ఉన్నప్పుడే వైరి పక్షాలుగానే వ్యవహరించేవారు. గత ఏడాది జరిగిన జిల్లా సమావేశంలో ఇద్దరు ఘాటైన పదజాలంతో పరస్పరం విమర్శలు చేసుకున్నారు. ఆ రగడ సీఎం వరకు వెళ్లింది. దాంతో ఇద్దరిని పిలిచి మాట్లాడి వివాదం క్లోజ్ చేశారు. ఆ తర్వాత ఎంపీ బోస్ స్వయంగా ఎమ్మెల్యే ద్వారంపూడి ఇంటికి వెళ్లడంతో సమస్యకి ఫుల్‌స్టాప్ పడింది. తాజాగా పిల్లి బోసు చేసిన కామెంట్స్‌తో ద్వారంపూడి వర్గం రగిలిపోతుందట. ఎప్పటికప్పుడు ఈ గూడు పుఠాణి ఏంటని ఫైర్ అవుతున్నారట.
గతంలో వైఎస్ క్యాబినెట్‌లో బోసు మంత్రిగా ఉన్నారు. ఆ సమయంలో ద్వారంపూడి ఎమ్మెల్యే. మంత్రి హోదాలో బోసు తనని ఇబ్బంది పెట్టి.. ప్రతిపక్షాలతో చెట్టాపట్టాలు వేసుకుని తిరిగే వారనేది ద్వారంపూడి వాదన. ఆ తర్వాత జగన్‌కి మద్దతుగా ద్వారంపూడి, పిల్లి ఇద్దరు రాజీనామా చేశారు. ఆ సమయంలో జరిగిన ఉపఎన్నికలో బోసుపై తోట త్రిమూర్తులు గెలిచారు. ఆ బై ఎలక్షన్‌లో బోసు ఓటమికి ద్వారంపూడి పని చేశారని ప్రచారం జరిగింది. అప్పటి నుంచి ఇరువర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. 2019లో బోసు ఓడినప్పటికి మంత్రివర్గంలో చోటు కల్పించారు సీఎం జగన్. ఆ తర్వాత కూడా మంత్రి హోదాలో ద్వారంపూడికి చెక్ పెట్టేవారని చెవులు కొరుక్కునేవారు.
కాకినాడలో టిడ్కో ఇళ్లలో అవినీతి జరిగిందనే ఆరోపణలు.. మేడ లైన్ వంతెన నిర్మాణాన్ని అడ్డుకోవడంలో బోసు పాత్ర ఉందనేది ఎమ్మెల్యే వాదన. కాకినాడలోఅభివృద్ధి పనులు అడ్డుకోవడంలో ప్రభుత్వానికి తప్పుడు నివేదికలు ఇచ్చేవారని సోషల్ మీడియాలో వార్ నడిచింది. ఇప్పుడు జిల్లాలో రైస్ మిల్లర్లకి సంబంధించి బోసు చేసిన వ్యాఖ్యలపై ద్వారంపూడి వర్గం సీరియస్‌గా ఉందట. తమపై బురద చల్లుతున్నారని గుర్రుగా ఉన్నట్టు టాక్. సమస్యలు ఉంటే తమ దృష్టికో.. ప్రభుత్వం దగ్గరకో తీసుకెళ్లాలి కానీ.. ఇదెక్కడి రాజకీయం అని కుతకుత లాడుతున్నారట. ఎప్పటికప్పుడు వివాదం క్లోజ్ అయినప్పటికి పుండు మీద కారం చల్లుతున్నారనేది ద్వారంపూడి వర్గం చెప్తున్న వాదన.
ఎంపీ బోసు మాత్రం ద్వారంపూడి వర్గం చేస్తున్న కామెంట్స్‌కు గట్టిగానే కౌంటర్లు ఇస్తున్నారట. గ్రామాల వారీగా జరిగిన దోపిడీకి తన దగ్గర ఆధారాలు ఉన్నాయని చెబుతున్నారట. మరి.. ఈ ఎపిసోడ్ అధికారపార్టీలో ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.