తెలంగాణ రాజకీయం ప్రస్తుతం మూడు పార్టీల చుట్టూ తిరుగుతుంది. ప్రధానంగా TRS..కాంగ్రెస్ మధ్య పొలిటికల్ గేమ్ నడుస్తున్నా.. బీజేపీ తన సత్తా చాటే పనిలో ఉంది. పదవులు… జాతీయ కార్యవర్గ సమావేశాలు అంటూ… తెలంగాణలో హడావిడి చేస్తోంది. లక్ష్మణ్‌కు రాజ్యసభ సీటు కూడా ఇచ్చింది. బీజేపీ వ్యూహం ఏ మేరకు వర్కవుట్ అవుతుందో ఏమో.. ఆ స్థాయిలో రాష్ట్రంలో కాంగ్రెస్ హైకమాండ్ దృష్టి పెడుతుందా అనేది పెద్ద ప్రశ్నగా ఉంది. దీనికి కారణం లేకపోలేదు. ఇటీవల కొందరు నాయకులను కాంగ్రెస్ అత్యున్నత నిర్ణాయక మండలి అయిన CWCలోకి సభ్యులుగా తీసుకున్నారు. చివరకు ఏపీకి కూడా అందులో ప్రాధాన్యం దక్కింది. తెలంగాణ నుంచి ఎవరినీ సభ్యులుగా తీసుకోలేదు. దీంతో తెలంగాణ సంగతి ఏంటనే చర్చ ఊపందుకుంది.
వాస్తవానికి తెలంగాణలో కాంగ్రెస్ కార్యకలాపాల జోష్ పెరిగింది. అధికారంలోకి రావడానికి అవకాశం ఉన్న స్టేట్‌గా హైకమాండ్ భావిస్తోంది. కాకపోతే పదవుల భర్తీలో మాత్రం రాష్ట్రానికి పెద్దగా అవకాశం ఇవ్వడం లేదన్న అభిప్రాయం నేతల్లో ఉంది. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ CWCలో తెలంగాణకి ప్రాతినిధ్యం వస్తుందా..? ఆ స్థాయి నేతలు ఇక్కడ ఉన్నట్టు హైకమాండ్ ఫీల్ అవ్వడం లేదా ? అనే ప్రశ్నలు పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఇప్పటికే తెలంగాణలో బీజేపీ..TRSలు వ్యూహాత్మకంగా రాజకీయం చేస్తున్నాయి. పదవుల భర్తీలో ప్రాధాన్యం ఇస్తున్నాయి. కానీ కాంగ్రెస్ హైకమాండ్ పార్టీ పదవుల విషయంలోనూ తెలంగాణను విస్మరించడం పార్టీ శ్రేణులకు అంతుచిక్కడం లేదట.
తెలంగాణలో గాంధీ కుటుంబానికి లాయల్‌గా ఉన్న వారిలో వి హన్మంతరావు ఉన్నారు. అలాగే సోనియాగాంధీ దగ్గర సన్నిహిత పరిచయాలు ఉన్న పీసీసీ మాజీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి.. మరో ఎంపీ ఇలా చాలా మందికి ఢిల్లీ స్థాయిలో లాబీయింగ్ తెలుసు. అలాంటి వారిలో ఎవరికి CWCలో చోటు ఇస్తారు? అసలు వారిని పరిగణనలోకి తీసుకుంటారా? లేక AICC కొత్త అధ్యక్షుడు ఎన్నికైన తర్వాత CWCలోకి తీసుకుంటారా? దీనిపై పార్టీ వర్గాల్లోనే స్పష్టత లేదు. ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాత్రం AICC లేదా పార్టీలో మరేదైనా కీలక పదవి వస్తుందనే ఆశల్లో ఉన్నారు. తాజాగా CWCలోకి కొందరిని తీసుకోగా.. వారిలో తెలంగాణలో క్రియాశీలకంగా పనిచేస్తున్న నాయకులకు చోటు దక్కలేదు. కాకపోతే రానున్న రోజుల్లో గుర్తిస్తారనే ఆశ మాత్రం నాయకుల్లో సజీవంగా ఉంది. సరైన సమయం వచ్చినప్పుడు తప్పకుండా చోటు లభిస్తుందనే ధీమా కనిపిస్తోంది. మరి.. ఆ సరైన సమయం ఎప్పుడో ఏంటో కాంగ్రెస్ హైకమాండ్‌కే తెలియాలి.