Munugode TRS : మునుగోడు ఉపఎన్నికలో టీఆర్ఎస్ వ్యూహం మార్చేస్తోందా..? గత బైఎలక్షన్లకు భిన్నంగా వెళ్లబోతుందా..? సరికొత్త రణతంత్రంలో కొత్త వ్యూహంలో భాగమా? ఇంతకీ ఏంటది? గులాబీ నేతల ఆలోచనలు ఏం చెబుతున్నాయి? లెట్స్ వాచ్..!
మునుగోడు ఉపఎన్నికకు రాజకీయ పార్టీలు అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. ఉపఎన్నిక షెడ్యూలు ఎప్పుడు వస్తుందో అంచనా వేసుకుంటూనే.. నియోజకవర్గంలో గ్రౌండ్‌వర్క్ మొదలు పెట్టాయి. మునుగోడులో గెలుపే లక్ష్యంగా వ్యూహాలకు పదును పెడుతున్నారు నాయకులు. పోటా పోటీగా ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తూ.. ఓటర్లకు దగ్గరయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి పార్టీలు. వచ్చే ఏడాది సాధారణ ఎన్నికలు ఉండడంతో ఈ ఉపఎన్నిక అన్ని పక్షాలకు ప్రతిష్టాత్మకంగా మారిపోయాయి.
టీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చాక ఎదుర్కోబోతున్న నాలుగో ఉపఎన్నిక ఇది. 2018 తర్వాత ఏడాదికో బై ఎలక్షన్ అన్నట్టుగా రాజకీయం మారిపోయింది. హుజుర్‌నగర్, దుబ్బాక, హుజూరాబాద్, నాగార్జునసాగర్ ఉపఎన్నికలు జరిగితే.. వీటిలో రెండు చోట్లే టీఆర్ఎస్ గెలిచింది. దుబ్బాక, హుజూరాబాద్ ఉపఎన్నికల్లో ఓటమికి దారితీసిన కారణాలను విశ్లేషించుకున్న టిఆర్ఎస్.. మునుగోడులో మాత్రం ఆచితూచి అడుగులు వేయాలనే నిర్ణయానికి వచ్చిందట. ఆ మధ్య హుజూరాబాద్ ఉపఎన్నికను టిఆర్ఎస్ సవాల్‌గా తీసుకుంది. గతంలో ఏ ఉపఎన్నికలో వ్యవహరించని విధంగా అధికారపార్టీ అడుగులు పడ్డాయి. హుజూరాబాద్‌లోని వివిధ వర్గాలకు చేరువయ్యే క్రమంలో వారికి పదవులు కట్టబెట్టింది. పెద్ద ఎత్తున అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టింది. కమ్యూనిటీ హాళ్ల నియామకం.. పనులపై హామీలు చాలా ఇచ్చారు నాయకులు. అయినప్పటికీ హుజూరాబాద్‌లో గులాబీ పార్టీకి ఓటమి తప్పలేదు. అక్కడ నేర్పిన పాఠాలతో మునుగోడులో జాగ్రత్త పడుతున్నట్టు తెలుస్తోంది.
మునుగోడు అసెంబ్లీ నియెజకవర్గంలో కొత్తగా అభివృద్ధి కార్యక్రమాలను మొదలుపెట్టే విషయంలో ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తున్నారట టీఆర్ఎస్ నేతలు. ఇప్పటికే నిధులకు ఆమోదం వచ్చిన పనులపై మాత్రమే ఫోకస్ పెట్టాలని.. వాటిని త్వరగా పూర్తి చేయాలనే లక్ష్యం పెట్టుకున్నారట. కొత్త పనుల జోలికి వెళ్లకపోవడమే కరెక్ట్ అనే అభిప్రాయంతో ఉన్నారట గులాబీ నేతలు. మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఉపఎన్నికతో మునుగోడులో అభివృద్ధి జరుగుతుందనే వాదనను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. రాజకీయంగా లబ్ధిపొందే పనిలో ఆయన ఉన్నారనేది టీఆర్ఎస్ నేతల అనుమానం. ఆ ఛాన్స్ రాజగోపాల్‌రెడ్డికి ఇవ్వకూడదనే ఆలోచనతో మునుగోడులో కొత్త తంత్రం రచిస్తున్నారట. మునుగోడులో ఏం జరిగినా అది అధికారపార్టీ ఖాతాలో పడేలా చూసుకోవాలని స్థానిక నాయకత్వానికి ఆదేశాలు వెళ్లాయట.
ఇప్పటికైతే ఈ వ్యూహంతో ముందుకెళ్తున్నా.. ఉపఎన్నిక వేడి మరింత రాజుకున్న తర్వాత అప్పటి పరిస్థితులకు అనుగుణంగా టీఆర్ఎస్ అడుగులు వేయొచ్చని తెలుస్తోంది. అదే సమయంలో ఇతర పార్టీలు కూడా టీఆర్ఎస్ వ్యూహాలపై కన్నేసి ఉంచాయి. ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నారు. మరి.. రానున్న రోజుల్లో తమ అమ్ముల పొదిలో ఉన్న అస్త్రాలను టీఆర్ఎస్ ఏ విధంగా ప్రయోగిస్తుందో చూడాలి.