Bojjala Gopalakrishna Reddy : గత ఎన్నికల్లో ఓడిన తర్వాత నియోజకవర్గంలో నల్లపూస అయిపోయారా? కేడర్ పిలిచినా ఎందుకు పలకడం లేదు? ఈ నెలలో పార్టీ అధినేత వస్తుండటంతో.. అప్పుడైనా ఇంఛార్జ్ కనిపిస్తారా? తెలుగు తమ్ముళ్లకు ఆయన తీరు అంతుచిక్కడం లేదా?
శ్రీకాళహస్తి నియోజకవర్గంలో టీడీపీ ఆరుసార్లు గెలిచింది. మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ఒక్కరే టీడీపీ నుంచి ఐదుసార్లు గెలిస్తే… ప్రస్తుతం నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్‌గా బొజ్జల తనయుడు సుధీర్‌రెడ్డే ఉన్నారు. గత ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు కూడా. ఒకప్పుడు శ్రీకాళహస్తిలో పార్టీకి బొజ్జల ఫ్యామిలీ అసెట్ అయితే.. ఇప్పుడు అదే కుటుంబానికి చెందిన సుధీర్‌రెడ్డి మైనస్ అయ్యారనేది తెలుగు తమ్ముళ్ల ఆవేదన. గత ఎన్నికల్లో ఓడిన తర్వాత నియోజకవర్గంలో అందుబాటులో లేకుండా పోయారనేది శ్రీకాళహస్తి టీడీపీ కేడర్ ఆరోపణ. అధికార పార్టీపై పోరాటం చేస్తున్నా.. భరోసా ఇచ్చే వాళ్లే లేరని.. ఇంఛార్జ్ ఎక్కడున్నారో కూడా తెలియదని మండిపడుతున్నారట. మూడేళ్లుగా ఇంచుకూడా మార్పు లేదన్నది శ్రేణులు చెప్పేమాట.
ఆ మధ్య స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో శ్రీకాళహస్తిలో తళుక్కుమన్నారు బొజ్జల సుధీర్‌రెడ్డి. తర్వాత ఆయన తండ్రి గోపాలకృష్ణారెడ్డి ఆస్పత్రిలో చేరడంతో హైదరాబాద్‌కే పరిమిత అయ్యారు. గోపాలకృష్ణారెడ్డి మే నెలలో కాలం చేశారు. ఆ తర్వాత సుధీర్‌రెడ్డి మరీ నల్లపూసయ్యారనేది పార్టీ వర్గాల మాట. ఇంఛార్జ్ తీరుతో విసుగెత్తిన పార్టీ ద్వితీయశ్రేణి నేతలు.. కొందరు వైసీపీలోకి జంప్ అయిపోయారు. వైసీపీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి.. ఇక్కడ టీడీపీని ఖాళీ చేసే పనిలో పడ్డారు. ఇదంతా తెలిసినా సుధీర్‌రెడ్డి టీడీపీ పరంగా చురుకైన పాత్ర పోషించడం లేదట.
ఈ నెల 16న బాదుడే బాదుడు కార్యక్రమం కోసం చంద్రబాబు శ్రీకాళహస్తి వస్తున్నారు. అప్పుడైనా ఇంఛార్జ్ సుధీర్‌రెడ్డి వస్తారా లేదో క్లారిటీ లేదట. ఈ సమస్య సుధీర్‌రెడ్డి వరకు చేరిందో ఏమో.. ఆయన వర్గం వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టిందట. కుటుంబ సమస్యల వల్లే శ్రీకాళహస్తికి రాలేకపోతున్నారని.. చంద్రబాబు కాలు పెట్టాక.. సరికొత్త సుధీర్‌రెడ్డిని చూస్తారని కేడర్‌కు బూస్టర్ డోస్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారట. అయితే సొంత పార్టీతోపాటు.. వైసీపీ నుంచి కూడా సుధీర్‌రెడ్డిపై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. వాటికి చెక్ పెట్టాలంటే సుధీర్‌రెడ్డి తీరు మార్చుకోవాలన్నది లోకల్ టీడీపీ నేతలు చెప్పేమాట. వచ్చే ఎన్నికల కోసం ఇప్పటి నుంచీ క్షేత్రస్థాయిలో కసరత్తు చేస్తేకానీ.. పార్టీకి పూర్వ వైభవం రాదనేది తమ్ముళ్ల వాదన. శ్రీకాళహస్తిలో టీడీపీ పుంజుకోవాలంటే యాక్షన్ ప్లాన్ మార్చాలని చెబుతున్నారు. ఈ దిశగా సుధీర్‌రెడ్డి పార్టీ పెద్దలు కూడా తగిన సూచనలు చేయాలని కేడర్ సూచిస్తోందట. మరి.. శ్రీకాళహస్తి టీడీపీకి చేసిన సుస్తికి పార్టీ ఎలాంటి మందు వేస్తుందో చూడాలి.