ఆయన ఆ పార్టీలో నెంబర్ టు. కానీ.. నియోజకవర్గంలో కర్చీఫ్ వేసి.. కేడర్ కష్టాలను మర్చిపోయారట. అదే ప్లేస్ నుంచి గతంలో రెండుసార్లు ఎమ్మెల్యేగా చేసినా… ప్రస్తుతం చుట్టపు చూపుగానే వస్తున్నారట. పార్టీలో నెంబర్ టు కావడంతో రాష్ట్రంలో ఏ సీటైనా తనకు వస్తుందనే లెక్కలో ఏమో పార్టీ శ్రేణులకు మాత్రం ఆయన వైఖరి అర్థం కావడం లేదట. ఇంతకీ ఎవరా నాయకుడు? ఆయన అంచనాలేంటి?
వచ్చే ఎన్నికల్లో తెనాలి నుంచి పోటీ చేస్తారా? నాదెండ్ల మనోహర్. జనసేనలో నెంబర్ టు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు చిట్టచివరి స్పీకర్. వచ్చే ఎన్నికల్లో ఆయన ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే ప్రశ్న జనసైనికుల్లో ఉందట. సొంత నియోజకవర్గం తెనాలి నుంచే పోటీ చేస్తారని నిన్న మొన్నటి వరకు అనుకున్నా.. ఈ మధ్య తెనాలి విషయంలో ఆయన అనుసరిస్తున్న వైఖరే సందేహాస్పదంగా ఉందట. తెనాలి నుంచి పోటీ చేస్తారా లేక మరో జిల్లాకు వెళ్లిపోతారా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి పార్టీ శ్రేణులు.
2019లో ఓడిన తర్వాత తెనాలిని పక్కన పెట్టేశారా? కొత్తగా ఈ ప్రశ్నలు రావడానికి కారణం.. నాదెండ్ల మనోహర్ తెనాలిలో అందుబాటులో లేకపోవడమేనట. 2004లో ఆయన ఇక్కడ నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా తొలిసారి గెలిచారు. 2009లోనూ ఆ గెలుపును కంటిన్యూ చేశారు. డిప్యూటీ స్పీకర్‌గా.. స్పీకర్‌గా పనిచేశారు కూడా. 2014, 2019 ఎన్నికల్లో మాత్రం తెనాలి మనోహర్‌కు కలిసిరాలేదు. 2014లో ఓడినప్పుడే తెనాలితో అంటీముట్టనట్టు ఉన్నట్టు చెవులు కొరుక్కున్నారు. 2019లో ఓడిన తర్వాత ఇక పూర్తిగా పక్కన పెట్టేశారని ప్రచారం జరిగింది.
బెజవాడలోని ఓ నియోజకవర్గంపై లవ్వు..!ప్రస్తుతం తనను విజయ తీరాలకు చర్చే నియోజకవర్గాన్ని మనోహర్ అన్వేషిస్తున్నట్టు చెబుతున్నారు. ఈ కారణంగానే జనసేన రాష్ట్ర కార్యాలయం ఉన్న మంగళగిరికి వస్తున్నా.. తెనాలికి రాకుండా అటు నుంచి అటే హైదరాబాద్ లేదా విజయవాడలోని ఒక నియోజకవర్గానికి వెళ్లిపోతున్నారట. ముఖ్యంగా బెజవాడలోని ఒక నియోజకవర్గ నాయకులతో సన్నిహితంగా ఉంటున్నట్టు ఆంధ్రా ప్యారిస్ తెనాలి కోడై కూస్తోందట. అక్కడి నుంచి ఆయన పోటీ చేసే ఆలోచనలో ఉన్నట్టు చెబుతున్నారు.
తెనాలిలో పార్టీ కేడర్‌నూ పట్టించుకోవడం లేదా? ఒకవేళ తప్పనిసరి తెనాలి వస్తే.. గతంలో మనోహర్ వెంట నడిచిన కీలక నాయకులు ఎవరూ అందుబాటులో ఉండటం లేదట. ఒకరిద్దరు చోటా నాయకులు వచ్చిన నాలుగు మాటలు మాట్లాడేసి వెళ్తున్నారట. పైగా తెనాలి సమస్యలపై పెదవి విప్పడం లేదని.. పోరాటాలు చేయడం లేదనే విమర్శలు జనసేన వర్గాల్లోనే ఉన్నాయట. స్థానికంగా ఉన్న పార్టీ కేడర్‌నూ ఆయన పట్టించుకోవడం లేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆయన చివరిసారిగా నియోజకవర్గంలోని కొల్లిపర మండలంలో వర్షాలకు కొట్టుకుపోయిన పంట పొలాలను పరిశీలించడానికి వచ్చారట.
గడిచిన ఎన్నికల్లో 30 వేల లోపే ఓట్లు 2004 నుంచి 2014 వరకు మనోహర్‌తో కలిసి తెనాలిలో పనిచేసిన కేడర్ మొత్తం ప్రస్తుతం చెల్లాచెదురైంది. ఆయన అందుబాటులో లేకపోవడంతో కీలక నాయకులు పక్క పార్టీల్లోకి వెళ్లిపోయారు. గడిచిన ఎన్నికల్లో మనోహర్‌కు తెనాలిలో 30 వేల లోపే ఓట్లు వచ్చాయి. గత నెలలో మనోహర్ పుట్టినరోజుకు తెనాలికి వస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అప్పుడు ఆయనతో కలిసి నియోజకవర్గంలో గేర్ మార్చాలని జనసైనికులు అనుకున్నారట. కానీ.. మనోహర్ రాలేదు. చివరకు పార్టీ శ్రేణులే కేకులు కట్ చేసి… చాక్లెట్లు పంచుకుని ఎవరికి వారుగా వెళ్లిపోయారు.
తెనాలి నుంచే పోటీ చేస్తారని కొందరి వాదన అయితే రాజకీయంగా బిజీగా ఉండటం వల్లే తెనాలికి రాలేకపోతున్నట్టు మనోహర్ చెబుతున్నట్టుగా కొందరు ప్రచారం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయన తెనాలి నుంచే పోటీ చేస్తారని.. ఆయన్ని గెలిపించే బాధ్యత కార్యకర్తలపైనే ఉందని అంటున్నారట. గెలుపు సంగతి ఏమో కానీ.. నాయకుడు లేని పోరాటం ఎంత వరకు చేస్తామని జనసైనికులు ఆవేదన చెందుతున్నారట. మరి.. నాదెండ్ల మనోహర్ ఏం చేస్తారో చూడాలి.