Site icon NTV Telugu

Off The Record: ఆ జిల్లా బీఆర్ఎస్ లో అసంతృప్తి రాగాలు సెట్ అయినట్టేనా..?

Off The Record: మంచిర్యాల జిల్లా బీఆర్‌ఎస్‌లో గ్రూప్ వార్ పెరిగింది. టికెట్ల ప్రకటన తర్వాత నారాజ్‌గా ఉన్నారు పలువురు నాయకులు. అలాంటి వాళ్ళు పార్టీ మారతారన్న ప్రచారం కూడా జరిగింది. దీంతో అధిష్టానం దూతలు రంగంలోకి దిగి మేటర్‌ని సెటిల్‌ చేసే పనిలో ఉన్నారట. మంచిర్యాల సిట్టింగ్ ఎమ్మెల్యే దివాకర్‌రావుని మార్చాలని పట్టుబట్టారు మాజీ ఎమ్మెల్యే అరవింద్ రెడ్డి. ఆయన టికెట్ ఇస్తే తన వర్గం సహకరించబోదని కూడా తేల్చేశారు. ఏకంగా ప్రెస్‌మీట్‌ పెట్టి మరీ ఈ విషయం చెప్పడంతోపాటు కేటీఆర్, హరీష్‌రావుల జిల్లా టూర్‌కి కూడా డుమ్మా కొట్టారాయన. పార్టీ వ్యవహారాలతో అంటీ ముట్టనట్టుగా ఉన్నారు. దీంతో అరవింద్‌రెడ్డితో పాటు మరో అసంతృప్త నేత, మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్‌ని కూడా బుజ్జగించేందుకు దూతల్ని పంపిందట అధినాయకత్వం. ఇదివరకే పురాణం సతీష్ ఇంటికెళ్లిన బాల్క సుమన్… కలిసి పని చేద్దామని చెప్పినట్టుగా సమాచారం

Also Read: Journalist Soumya Vishwanathan Case: జర్నలిస్ట్ సౌమ్య విశ్వనాథన్ హత్య కేసులో సాకేత్ కోర్టు కీలక తీర్పు

అటు అరవింద్‌రెడ్డి కూడా గతంలో దివాకర్ రావుని దగ్గరుండి గెలిపించిన తనకు పార్టీ సముచిత స్థానం కల్పిస్తుందని ఆశించారట. కానీ… అలాంటిదేం లేకపోగా మరోసారి సిట్టింగ్‌నే అభ్యర్థిగా ప్రకటించడంతో తిరుగుబాటు జెండా ఎగరేసినట్టు తెలిసింది. టిక్కెట్‌ ప్రకటన తర్వాత మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ… అభ్యర్థిని మార్చాల్సిందేనని…బి ఫామ్ ఇవ్వవద్దని స్పష్టం చేశారు. ఒకవేళ ఇస్తే తాను సహకరించబోమని తేల్చి చెప్పారట. సీటు కూడా తనకు కాకుండా బీసీలకు ఇవ్వాలని కొత్త వాదాన్ని తెరమీదికి తెచ్చారాయన. ఈ పరిస్థితుల్లోనే బుజ్జగింపుల పర్వం మొదలైందంటున్నారు.ఇక చెన్నూరు నియోజకవర్గంలో హరీష్ రావు, కేటీఆర్ పర్యటనలు జరిగినా… దూరంగా ఉన్నారు మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్. ఆయనకు వేరే నియోజకవర్గ ఇన్చార్జి బాధ్యతలు ఇవ్వడంతో వెనక్కి తగ్గినట్టు చెప్పుకుంటున్నారు. పార్టీలో టికెట్ ప్రకటన తర్వాత అసంతృప్తిగా ఉన్న కొంతమంది, వివిధ అవసరాల కోసం మరికొంత మంది స్థానిక నాయకులు బీఆర్‌ఎస్‌ విడిచి వెళ్ళారట.

మంచిర్యాలలో ఎమ్మెల్యే దివాకర్ రావు మీదున్న వ్యతిరేకతతో కొందరు కాంగ్రెస్‌ గూటికి చేరినట్టు తెలిసింది.ఇది ఇంకా ఎక్కువైతే ఇబ్బందులు వస్తాయని గ్రహించిన అధినాయకత్వం నష్ట నివారణ చర్యలు చేపట్టిందంటున్నారు. అందులో భాగంగానే తాజాగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండే విటల్, మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు సుమన్, స్థానిక ఎమ్మెల్యే దివాకర్ రావు తో కలిసి అరవింద్ రెడ్డి ఇంట్లో చర్చలు జరిపారు. అరవింద్ రెడ్డి వెనక్కి తగ్గడంతో పాటు దివాకర్ రావు గెలుపు కోసం కృషి చేస్తానని ప్రకటించారు. మొత్తం మీద మంచిర్యాల జిల్లాలో అసంతృప్త నేతలు ఇద్దర్నీ సెట్‌ చేయగలిగామని అనుకుంటోంది బీఆర్‌ఎస్‌ అధిష్టానం. మరి పోలింగ్‌ నాటికి పరిస్థితులు ఎలా ఉంటాయో చూడాలి.

Exit mobile version