Off The Record: తెలంగాణ బీజేపీలో అంతర్యుద్ధం పతాక స్థాయికి చేరిందా? ఆధిపత్య పోరుతో నాయకులే పార్టీ పరువును బజారుకీడుస్తున్నారా? సోషల్ వీధుల వాల్స్ మీద సొంత నేతల పోస్ట్ పోస్టర్స్ వేస్తూ… రచ్చకు దిగుతున్నారా? ఈ యుద్ధం వెనక పార్టీకి చెందిన సీనియర్ నాయకులు సైతం ఉన్నారా? సొంత పార్టీ నాయకుల మీదే దుష్ప్రచారం చేస్తున్న ఆ తెరచాటు వ్యక్తులెవరో అధిష్టానం కనిపెట్టేసిందా? తెలంగాణ కమలదళంలో అసలేం జరుగుతోంది?
Read Also: Bangladesh: NSA అజిత్ దోవల్‌కు బంగ్లాదేశ్ ఆహ్వానం..
తెలంగాణ కమలంలో సోషల్ మీడియా రచ్చ ఓ రేంజ్‌లో నడుస్తోంది. ఎవరో బయటోళ్లు, వాళ్ళు వీళ్ళు కాకుండా.. సొంత పార్టీ నాయకులే ఒకరి మీద ఒకరు సోషల్ పోస్ట్‌లు పెట్టుకుంటూ పార్టీ పరువును రోడ్డుకు లాగడంపై ముఖ్య నాయకత్వం కూడా సీరియస్‌గా ఉందట. మేం నిఖార్సయిన బీజేపీ అని చెప్పుకునే వారే సొంత పార్టీ నాయకుల మీద ఘోరమైన కామెంట్స్ చేస్తున్నారు. అంతకు మించి వ్యక్తిత్వ హననానికి పాల్పడటం, స్థాయి మర్చిపోవడం లాంటివి నాయకత్వానికి బాగా చికాకు తెప్పిస్తున్నాయట. ఉపేక్షించేకొద్దీ…ఈ తలనొప్పి పెరిగిపోతుండటంతో… ఇక నుంచి సొంత పార్టీ నేతలైనాసరే.. ఇష్టమొచ్చినట్టు పోస్ట్‌లు పెట్టేవాళ్ళ విషయంలో కఠినంగా ఉండాలని నాయకత్వం డిసైడ్ అయినట్టు తెలుస్తోంది.
Read Also: 200MP Camera Phones: 200MP కెమెరా స్మార్ట్‌ఫోన్‌ల జాబితా.. 23 వేల నుంచే ఆరంభం!
పరువు తీసేవాడు ఎవడైతే ఏంటన్న నిర్ణయానికి వచ్చినట్టు చెప్పుకుంటున్నాయి పార్టీ వర్గాలు. ఈ విషయంలో ఇప్పటికే పలువురిని మందలించడంతో.. వాళ్ళు కూడా వెంటనే తాము పెట్టిన వికృతమైన పోస్ట్‌లను డిలిట్ చేసినట్టు సమాచారం. పార్టీ లోని కొందరు ముఖ్యనేతలే వెనకుండి ప్రోత్సహిస్తూ… ఇంటర్నల్‌గా తాము ప్రత్యర్థులుగా భావించే వాళ్ళ మీద సోషల్ మీడియా దాడి చేయిస్తున్నారన్న నిర్ధారణకు వచ్చిందట నాయకత్వం. బీజేపీ వర్గాల్లో కూడా ఇదే ప్రచారం విస్తృతంగా జరుగుతోంది. మెల్లిగా ఈ విష సంస్కృతి పెరిగిపోతుండటంతో… అసలు దీని మూలాలు ఎక్కడున్నాయని ఎంక్వైరీ చేయించిన బీజేపీ పెద్దలకు దిమ్మ తిరిగిపోయే విషయాలు తెలిశాయట. తీగ లాగితే డొంక కదిలినట్టు… ఆ పోస్టింగ్స్ వెనక పార్టీలోని కొన్ని పెద్ద తలకాయలే ఉన్నట్టు తేలిందట. వాళ్ళే సొంత టీమ్స్‌ని ఏర్పాటు చేసుకుని పార్టీలో తమకు గిట్టని వాళ్ళ మీద సోషల్ దాడి చేయిస్తున్నట్టు తెలిసిందని చెప్పుకుంటున్నారు.
Read Also: World Cup 2026 Schedule: ప్రపంచకప్ షెడ్యూల్ వచ్చేసింది.. వేర్వేరు గ్రూప్‌ల్లో భారత్, పాకిస్థాన్!
అయితే, ఈ విషయం తెలిసిన ముఖ్య నాయకులు మాత్రం సీరియస్‌గా ఉన్నట్టు సమాచారం. పార్టీకంటే వ్యక్తులు ముఖ్యం కాదని, ఈ రకంగా డ్యామేజ్ చేసేవాళ్ళు ఎంతటి వాళ్ళయినా ఉపేక్షించే ప్రసక్తే లేదని అంటున్నట్టు తెలిసింది. క్రమశిక్షణ చర్యలు కఠినంగా ఉంటాయని, వ్యవహారం మరీ…. ముదిరితే పార్టీ నుంచి సస్పెండ్ చేయడానికి కూడా వెనుకాడబోమని చెబుతోందట అగ్ర నాయకత్వం. అలాగే న్యాయపరమైన చర్యలు కూడా ఉంటాయని హెచ్చరిస్తున్నట్టు తెలిసింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావుతో పాటు మిగతా ముఖ్య నేతల వ్యక్తిత్వం మీద దాడి చేస్తున్నారని, ఇది మంచి పద్ధతి కాదన్న చర్చ జరుగుతోంది తెలంగాణ బీజేపీలో. ఆ పోస్ట్‌లు పెట్టేవాళ్ళు తమకు నచ్చని ఏదో ఒక వ్యక్తిని డ్యామేజ్ చేస్తున్నామని అనుకుంటున్నారుగానీ… అంతిమంగా అది మొత్తం పార్టీ మీదే దుష్ర్పభావం చూపిస్తోందన్న సంగతి మర్చిపోతే ఎలాగన్న ప్రశ్నలు వస్తున్నాయి. ఇలాంటి చర్యల వల్ల పార్టీ పలుచన అవడంతోపాటు… కార్యకర్తల్లో నైతిక స్థైర్యం తగ్గుతుందని, వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావాలనుకుంటున్న పార్టీలో ఉండాల్సిన లక్షణాలు ఇవేనా అని మాట్లాడుకుంటున్నాయి రాజకీయ వర్గాలు. ఇలాంటి పిచ్చి పనులు ఆపి క్షేత్ర స్థాయి నుంచి బలోపేతానికి ప్రత్నించాలని అంటోంది తెలంగాణ బీజేపీ కేడర్.