Manickam Tagore : తనకు తాను నోరు అదుపులో పెట్టుకుని.. అందరినీ కంట్రోల్‌లో పెట్టే బాధ్యత కాంగ్రెస్ ఇంఛార్జ్ మాణిక్యం ఠాగూర్‌ది. కానీ ఆయనే నోరు పారేసుకున్నారట. ఒకటి కాదు… రెండు కాదు.. మూడోసారి ఠాగూర్ అదే చేశారట. ఎందుకలా? ఇంఛార్జ్ నియంత్రణ కోల్పోతున్నారా.. కావాలని చేస్తున్నారా?
తెలంగాణ కాంగ్రెస్‌లో పరిస్థితికి అనుగుణంగా ప్రవర్తిస్తారు కొందరు నాయకులు. ఎప్పుడు ఏ పొరపాటు జరుగుతుందా అని వేచి చూస్తారు మరికొందరు. ఇలాంటి వాటికి ఆస్కారం ఇవ్వకుండా అందరినీ సమన్వయం చేయాల్సిన కీలక బాధ్యతల్లో ఉన్నారు AICC రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్యం ఠాగూర్. ఆ మధ్య పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, పీసీసీ మాజీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, AICC కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్ మహేశ్వర్‌రెడ్డి, పీసీసీ ప్రచారం కమిటీ ఛైర్మన్ మధుయాష్కీ, పీసీసీ మాజీ చీఫ్ VH తదితర ముఖ్య నాయకులతో హైదరాబాద్ MLA క్వార్టర్స్‌లో సమావేశం అయ్యారు ఠాగూర్. ఆ సమావేశం అంతా మునుగోడు ఉపఎన్నిక.. అనుసరించాల్సిన వ్యూహం.. ఆర్ధిక పరమైన అంశాలపై చర్చ సాగింది.
సమావేశం మొదలు కాగానే పీసీసీ చీఫ్ తర్వాత వరసలో కీలక పదవి ఉన్న నాయకుడు కొన్ని అంశాలను చెప్పి వెళ్లాలని చూశారట. వేరే అంశాలపై ప్రిపరేషన్ అవ్వాలని రిక్వస్ట్ చేశారట. అయితే మీటింగ్‌ను కొద్దిసేపట్లోనే ముగించేద్దాం అని చెప్పి సమావేశాన్ని కంటిన్యూ చేశారట ఠాగూర్. ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, ఉత్తమ్, VH, మహేశ్వర్‌రెడ్డి అభిప్రాయాలు చెప్పారు. సమావేశం సీరియస్‌గా సాగుతోంది. ఆ కీలక నాయకుడు మాట్లాడే వంతు వచ్చింది. ఇంతలో ఠాగూర్ కల్పించుకుని.. అయ్యో.. నువ్వు వెళ్లలేదా? ఇంకా మీటింగ్‌లోనే ఉన్నావా? అని పుసుక్కున ఒక మాట అనేశారట. దీంతో సదరు నాయకుడికి చికాకు పీక్స్‌కు వెళ్లింది. ఒక్కసారిగా కూర్చున్న కుర్చీలో నుంచి లేచి.. ఆగ్రహం వ్యక్తం చేశారట. అసలు నన్నేమని అనుకుంటున్నావ్.. నేనేంటో చూపిస్తా నీకు. నాకు మునుగోడులో అప్పగించిన మండలంలో నేనేంది.. నా పని తీరు ఎంటో చూపిస్తా అని ఠాగూర్‌పై ఫైర్ అయ్యారట. ఆపై సమావేశం నుంచి వెళ్లిపోయారు ఆ కీలక నేత. బుసలు కొడుతున్న ఆ నాయకుడిని బుజ్జగించేందుకు మధుయాష్కీ, మహేశ్వర్‌రెడ్డి ప్రయత్నించారట. అయినా వెనక్కి తగ్గలేదట ఆ నాయకుడు. జరిగిన ఘటనపై ఠాగూర్‌తోపాటు సమావేశంలో ఉన్న మిగతా నాయకులు షాక్ అయ్యారట. నేనేదో సరదాగా అన్నాను అని వివరణ ఇచ్చుకునే పనిలో పడ్డారట ఠాగూర్.
సమావేశంలో సీరియస్‌గా చర్చ జరుగుతూ ఉంటే.. సరదాగ అనడం ఏంటనేది ఇప్పుడు చర్చగా మారింది. ఠాగూర్ నిత్యం నాయకులతో టచ్‌లో ఉండి.. సరదాగా మాట్లాడితే మిగిలిన నాయకులు కూడా దాన్ని లైట్ తీసుకునేవారని అభిప్రాయ పడుతున్నారట. టాగూర్ వ్యవహారం అంతా సీరియస్‌గానే ఉంటుంది. విషయం సీరియస్ కాగానే.. జస్ట్ కిడ్డింగ్ అంటే.. మిగిలిన నాయకులకు కాలిపోతుందట. టాగూర్ రాష్ట్ర ఇంఛార్జి గా వచ్చిన కొత్తలో VHతో కూడా ఇలాగే జరిగింది. అనుమతి లేనిదే మీటింగ్ లోపలికి రావద్దు అని VHకు ముఖంమీదే చెప్పేశారు. తాను గాంధీ ఫ్యామిలీకి దగ్గర అని…తనను గాంధీ ఫ్యామిలీనే పంపింది అని మాటలు విసిరారు. ఉత్తమ్ కుమార్‌రెడ్డితో కూడా పిసిసిలో మార్పులు..చేర్పులపై మాటలు పేలాయి. ఇటీవల మహేశ్వర్ రెడ్డీ ఎపిసోడ్‌లోనూ అలాగే జరిగింది. ఇలా వరుసగా ఠాగూర్ పార్టీ నేతలపై నోరు పారేసుకుంటున్నారనే చర్చ జరుగుతోంది.
అసలే ఠాగూర్.. పీసీసీ చీఫ్ రేవంత్ మనిషి అని.. రేవంత్ చెప్పిందే చేస్తున్నారనే అభిప్రాయం పార్టీ వర్గాల్లో ఉంది. ఇప్పుడు నోరు పారేసుకోవడంతో కొత్త సమస్యలు వస్తున్నాయి. మరి.. హైకమాండ్ దూతలుగా ఉన్న AICC కార్యదర్శుల దృష్టికి ఈ ఎపిసోడ్ వెళ్లిందో లేదో.. వెళ్లితే వాళ్లు అధిష్ఠానానికి చెప్పారో లేదో అనే చర్చ నడుస్తోందట.