Off The Record: రాజకీయ వ్యవహారాల్లో పార్టీలు వేరైనా.. ఆలోచనలు భిన్నంగా ఉన్నా అక్కడికి వచ్చేసరికి అన్నీ ఆ తాను ముక్కలే అన్నట్టుగా మారిపోయిందా? దిక్కులేని వారికి దేవుడే దిక్కు అంటారుగానీ.. ఇక్కడ మాత్రం పొలిటికల్ పార్టీలన్నీ కలిసి దేవుణ్ణే దిక్కులేని వాడిని చేసేస్తున్నాయా? వందల ఎకరాలు కబ్జా చేస్తున్న వాళ్ళకు వత్తాసు పలుకుతున్నాయా? ఏ ప్రముఖ ఆలయం విషయంలో అలా జరుగుతోంది? కబ్జాలకు మద్దతిస్తున్నాయంటున్న పార్టీలు ఏవి?
Read Also: Off The Record: ప్రభుత్వం మారినా.. రేషన్ మాఫియా తీరు మారలేదా?
భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయానికి ఉన్న ప్రాముఖ్యత, ప్రాశస్త్యం గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కానీ…రెండు రాష్ట్రాల మధ్య ఉన్న, నలుగుతున్న ఆలయ భూముల గురించి మాత్రం రామయ్య భక్తగణంలో తీవ్ర ఆవేదన వ్యక్తం అవుతోంది. ఈ విషయంలో రాజకీయ పార్టీలు అనుసరిస్తున్న వైఖరి ఎప్పటికప్పుడు హాట్ టాపిక్ అవుతూనే ఉంది. రామ.. కనవేమిరా.. అని ఆలయ అధికారులు వేడుకుంటుంటే.. రాజకీయ పార్టీలు మాత్రం కంచె వేసెయ్, కాజేసెజ్ అన్నట్టుగా అనుచరుల్ని ప్రోత్సహిస్తున్నాయట. ఇందులో ఎవ్వరికీ మినహాయింపు లేదన్నది భద్రాద్రి టాక్. మిగతా వాళ్ళ సంగతి ఎలా ఉన్నా… అయోధ్యలో రామాలయాన్ని నిర్మించామని గొప్పలకు పోతున్న బీజేపీ సైతం దక్షిణ అయోధ్యగా చెప్పుకునే భద్రాచలం రాములవారి ఆలయ భూముల విషయంలో ఎందుకు ఉదాసీనంగా ఉంటోందన్నది భక్తుల ప్రశ్న. దేవస్థానానికి చెందిన వందల ఎకరాలు ఆక్రమణ అవుతున్నా.. వాటిని అడ్డుకునేందుకు ఒక్క రాజకీయ పార్టీ కూడా ముందుకు రావడం లేదన్నది భక్తుల ఆవేదన.
Read Also: Kothapalli Lo Okappudu: ‘కొత్తపల్లిలో ఒకప్పుడు’ ట్రైలర్ రిలీజ్..
తాజాగా జరుగుతున్న పరిణామాలతో ఆలయవర్గాల్లో మరింత ఆందోళన పెరుగుతున్నట్టు తెలుస్తోంది. భద్రాద్రి రామయ్యకు వివిధ ప్రాంతాల్లో మొత్తం 1300 ఎకరాల భూమి ఉండగా.. ఒక్క ఎటపాక మండలంలోని పురుషోత్తమపట్నంలోనే ఎక్కువగా 889ఎకరాల దాకా ఉంది. అయితే, ఇదంతా రాష్ట్ర విభజన తర్వాత ఏపీ పరిధిలోకి వెళ్ళడంతో సమస్య మరింత పెరిగిందట. ఆలయం తెలంగాణలో, ఆస్తులు ఎక్కువ శాతం ఆంధ్రాలో ఉన్నాయి. ఎటపాక మండలంలోని 889 ఎకరాల భూమికి సంబంధించి గతంలో ఏటా దాదాపు 30 లక్షల కౌలు వచ్చేది. అయితే రాష్ట్ర విభజన తర్వాత ఆ కౌలు ఇవ్వడం మానేశారట. పైగా భూ ఆక్రమణల జోరు పెరిగిందని చెబుతున్నారు. అదేమని అడిగితే.. కౌలు, ఆక్రమణ దారులంతా కలిసి దేవస్థానం ఉద్యోగులను బెదిరిస్తున్నారట. భూమిని కాపాడేందుకు అక్కడ గోశాలను ఏర్పాటు చేసింది దేవస్థానం. ఆ నిర్మాణం కూడా పూర్తి స్థాయిలో జరక్కుండా అడ్డంకులు సృష్టిస్తున్నట్టు స్థానికంగా చెప్పుకుంటున్నారు. మరీ ముఖ్యంగా.. గడిచిన రెండు నెలల నుంచి కబ్జాకోరుల ఇష్టారాజ్యమైపోయిందన్నది రామాలయ వర్గాల మాట. ఇక తాజాగా ఆక్రమణలను అడ్డుకునే ప్రయత్నం చేసిన ఈవో రమాదేవితోపాటు పూజారుల మీద కూడా దాడి జరిగింది. ఆ తర్వాతి నుంచి భూ రక్షణ విషయంలో మరింత ఆందోళన పెరిగిందట ఆలయ వర్గాల్లో. గతంలో ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ నాయకులు ఆక్రమణదారులకు అండగా ఉండేవారట. సర్వం తామే అన్నట్టుగా అప్పట్లో వాళ్ళు వ్యవహరించినట్టు చెప్పుకుంటారు. ఇప్పుడు ప్రభుత్వం మారాక కూడా.. పార్టీ కలర్ మారిందేగానీ.. కబ్జాలు మాత్రం యధాతథంగా జరిగిపోతున్నాయట. భూముల్ని చెరబట్టేవాళ్ళకు అప్పట్లో వైసీపీ నేతలు అండగా ఉంటే.. ఇప్పుడు టీడీపీ వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారన్నది లోకల్ టాక్.
Read Also: Off The Record: ప్రభుత్వం మారినా.. రేషన్ మాఫియా తీరు మారలేదా?
లోకల్ ఓట్ బ్యాంక్ కోసం పార్టీలు ఇలాంటి వాళ్ళకు మద్దతిస్తున్నారన్న విశ్లేషణలు సైతం ఉన్నాయి. దేవస్థానం భూముల ఆక్రమణకు సంబంధించి ఎన్ని ఫిర్యాదులు చేసినా.. రెవెన్యూ, పోలీసు యంత్రాంగం అస్సలు పట్టించుకోవడం లేదట. పోలీసులకు ఇప్పటికి 60 సార్లు ఫిర్యాదు చేశారట ఆలయ అధికారులు. అయినా నో యూజ్. ఒక్క కేసు కూడా బుక్ అవలేదంటున్నారు. అటు కోర్ట్ తీర్పులు కూడా దేవస్థానానికి అనుకూలంగా వచ్చినా.. ఏపీ ప్రభుత్వం వైపు నుంచి సహకారం లేదంటున్నారు. ఆలయ భూముల చుట్టూ రాజకీయం అల్లుకుపోవడమే ఇందుకు కారణం అంటున్నారు. ఇంత జరుగుతున్నా.. ఇటు తెలంగాణ ప్రభుత్వం వైపు నుంచి కూడా స్పందన ఉండటం లేదన్నది టెంపుల్ సిబ్బంది బాధ అట. తెలంగాణ ప్రభుత్వ పెద్దలు జోక్యం చేసుకుని ఏపీ సర్కార్‌తో మాట్లాడితే తప్ప రెండు రాష్ట్రాల సరిహద్దులో ఉన్న ఈ భూముల సమస్యకు పరిష్కారం రాదంటున్నారు.