పార్టీ పరంగా ఎన్ని పదవులు వచ్చినా.. ఆ ఎమ్మెల్యేకు నిత్యం భయంగానే ఉంటోందా? చుట్టూ ఉన్నవారే కోవర్టులుగా మారి కంగారెత్తిస్తున్నారా? సోషల్ మీడియాలో ఎమ్మెల్యే పోస్టింగ్‌లు ఎలాంటి సంకేతాలు పంపుతున్నాయి? ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే? ఆయనకు అనుచరులపై ఎందుకు సందేహం?
రేగా సోషల్ మీడియా పోస్టింగ్‌లపై చర్చ
కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచినా.. గులాబీ కండువా కప్పుకొన్న తర్వాత పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు వరుసగా పదవులు చేపట్టారు. ప్రభుత్వ విప్ తర్వాత బీఆర్ఎస్ పార్టీకి జిల్లా అధ్యక్షుడు ఆయనే. ఉమ్మడి రాష్ట్రంలోనూ కాంగ్రెస్‌పార్టీలో ఉన్నప్పుడు నియోజకవర్గంలో పెత్తనం చేశారు. అధికారపార్టీ ఎమ్మెల్యే కావడంతో పార్టీ అనుచరులు రేగా చుట్టూ గట్టిగానే చేరారు. టీఆర్ఎస్ నుంచి పోటీ చేసి ఓడిన పాయం వెంకటేశ్వర్లను అనుసరించిన వారంతా తర్వాత రేగా శిబిరంలో చేరిపోయారు. మూడున్నరేళ్ల కాలంలో వారితో ఎమ్మెల్యేకు ఎలాంటి ఇబ్బంది రాలేదు. కానీ, ఏడాదిలో అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో రేగాలో కొత్త గుబులు మొదలైందట. సోషల్ మీడియాలో ఆయన పెడుతున్న పోస్టింగ్‌లను దీనికి ఉదాహరణగా చెబుతున్నారు.
అనుచరులు కోవర్టులుగా మారినట్టు రేగా సందేహం
పినపాకలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి అనుచరగణం ఎక్కువ. మాజీ ఎమ్మెల్యే పాయం సైతం పొంగులేటి అనుచరుడే. ఈ సమీకరణాలు సహజంగానే ఎమ్మెల్యే రేగా కాంతారావుకు కంటగింపుగా మారాయి. మాజీ ఎంపీని.. మాజీ ఎమ్మెల్యేని దరి చేరనివ్వకుండా రేగా వేయని ఎత్తులు లేవు. ఛాన్స్ ఇస్తే నియోజకవర్గంలో తనకు పోటీగా వస్తారని అనుకున్నారో ఏమో.. ఎక్కడికక్కడ చెక్ పెట్టుకుంటూ వచ్చారు. ఈ మధ్యకాలం పినపాకలో పొంగులేటి, పాయం వర్గాల కదలికలు పెరిగాయి. వారికి తన చుట్టూ ఉన్న వారు ఎవరో సమచారం అందజేస్తున్నారని రేగా సందేహిస్తున్నారట. అనుచరులే కోవర్టులుగా మారినట్టు డౌట్ పడుతున్నారట.
రేగాకు ఏమైంది అని పార్టీ శ్రేణుల ప్రశ్న
సోషల్ మీడియాలో రేగా కాంతారావు యాక్టివ్‌గా ఉంటారు. ఏ చిన్న లీడ్ దొరికినా.. వెంటనే పోస్టింగ్‌లు పెడుతుంటారు. వాటిపై అప్పటికప్పుడు మాత్రమే చర్చ జరిగేవి. కానీ.. తాజాగా రేగా పెట్టిన పోస్టింగ్స్ మాత్రం.. ఎమ్మెల్యేకు ఏమైంది అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఫాంహౌస్ కేసులో రేగా కూడా ఒకరు. ఆ తర్వాత పార్టీలో ఆయన ప్రతిష్ట పెరిగిందని.. చర్చ సాగింది. కానీ.. వెంట ఉన్నవారు ఎవరో వెన్నుపోటు పొడుస్తున్నారని అనుమానిస్తున్నారట. పాయం, పొంగులేటి శిబిరాల నుంచి వచ్చినవాళ్లే తిరిగి మనసు మార్చుకుని ఏదైనా ప్లాన్ వేస్తున్నారా అనే ఫీలింగ్‌లో రేగా ఉన్నట్టు సమాచారం. ఎమ్మెల్యే సందేహిస్తున్నట్టు ఆయన చుట్టూ కోవర్టులు ఉన్నారా? లేక సొంత నీడను చూసి భయపడుతున్నారా అని గులాబీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి.