Site icon NTV Telugu

Allagadda Hot Politics: ఆళ్ళగడ్డలో హై ఓల్టేజ్

అసలే ఆళ్లగడ్డ. రాజకీయాలు ఓ రేంజ్‌లో ఉంటాయి. అసెంబ్లీ ఎన్నికల తర్వాత కొన్నాళ్లు పొలిటికల్‌ సందడి తగ్గినా.. ఒక్కసారిగా హైఓల్టేజ్‌..! పదునైన విమర్శలు.. సవాళ్లు..ఆరోపణలు ఆళ్లగడ్డను అట్టుడికిస్తున్నాయి. ఎందుకిలా? అసలు నియోజకవర్గంలో ఏం జరుగుతోంది?

రోడ్ల విస్తరణపై ఆళ్లగడ్డలో రాజకీయ సెగలు
కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గంలో రోడ్ల విస్తరణ రాజకీయంగా కాక రేపుతోంది. భూమా, గంగుల కుటుంబాల మధ్య ఇప్పటికే రాజకీయంగా విభేదాలు భగ్గుమంటున్నాయి. రోడ్ల విస్తరణలో భాగంగా చేపట్టిన పనులు ఆ విభేదాలకు మరింత ఆజ్యం పోస్తున్నాయట. నాలుగు రోడ్ల కూడలిలో బస్ షెల్టర్‌ను కూలగొట్టడంతో పొలిటికల్‌ సెగలు.. భగభగలు మొదలయ్యాయి. భూమా నాగిరెడ్డి హయాంలో నిర్మించిన బస్‌షెల్టర్ ఎందుకు కూలగొడతారని ఆయన తనయుడు భూమా విఖ్యాత్‌ రెడ్డి ప్రశ్నించడం.. ఆయనపై కేసు నమోదు కావడం చకచకా జరిగిపోయాయి.

ఎమ్మెల్యే లక్ష్యంగా భూమా అఖిల సవాళ్లు.. ఆరోపణలు
ఆళ్లగడ్డలో రోడ్ల విస్తరణ వివాదం ఎమ్మెల్యే గంగుల బిజేంద్రనాథ రెడ్డి, మాజీ మంత్రి భూమా అఖిలప్రియ మధ్య అవినీతి ఆరోపణలు, సవాళ్లు, ప్రతి సవాళ్లకు దారి తీసింది. ఇద్దరి మధ్య మాటల తూటాలు పేలాయి. రోడ్ల విస్తరణలో భాగంగా షాపుల యజమానుల నుంచి ఎమ్మెల్యే వర్గీలయు భారీగా డబ్బులు వసూలు చేశారనే అఖిల ఆరోపణలు దుమారం రేపాయి. ఏడాదిగా ఆళ్లగడ్డలో రాజకీయంగా ఆమె చురకుగా లేరు. కానీ.. ఎమ్మెల్యేను లక్ష్యంగా చేసుకుని ఆరోపణలు చేయడం.. సవాళ్లు విసరడం పొలిటికల్‌ అటెన్షన్‌కు కారణమైంది.

అఖిల సవాల్‌ను స్వీకరించిన ఎమ్మెల్యే గంగుల బిజేంద్రనాథ్‌రెడ్డి
అవినీతిని నిరూపిస్తే రాజకీయ సన్యాయం తీసుకుంటారా అని ఎమ్మెల్యేను సవాల్‌ చేశారు అఖిల. అలా నిరూపించలేకపోతే తానే రాజకీయ సన్యాసం చేస్తానని చెప్పారామె. ఆ తర్వాత చంద్రబాబు ఆదేశాలతో పార్టీ నేతలు ఫరూక్‌, గౌరు వెంకటరెడ్డిలతో కలిసి ర్యాలీ నిర్వహించారు అఖిల. మాజీ మంత్రి చేసిన సవాళ్లకు ఎమ్మెల్యే గంగుల బిజేంద్రనాథ్‌రెడ్డి వెంటనే స్పందించారు. అఖిల సవాల్‌ను స్వీకరిస్తున్నట్టు చెప్పారాయన. ఆళ్లగడ్డ అభివృద్ధిని అడ్డుకునేందుకే అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు కూడా. తనపై చేసిన ఆరోపణలకు కలెక్టర్‌తో విచారణకు సిద్ధమని.. అవినీతిని నిరూపించకుంటే రాజకీయ సన్యాసానికి సిద్ధంగా ఉండాలని గట్టిగానే కౌంటర్‌ ఇచ్చారు ఎమ్మెల్యే బిజేంద్రనాథ్‌రెడ్డి.

నేతల సవాళ్లు చుట్టూ ఆళ్లగడ్డలో రాజకీయ చర్చ
ప్రస్తుతం ఈ సవాళ్ల చుట్టూనే ఆళ్లగడ్డలో చర్చ జరుగుతోంది. రాజకీయంగా నేతలు అనేక మాటలు అనుకున్నా.. ఆళ్లగడ్డలో ఈ సవాళ్లకు మాత్రం ప్రత్యేకత ఉందని లోకల్‌గా వినిపిస్తున్న టాక్‌. అయితే సవాళ్లకు చివరివరకు కట్టుబడి ఉండేదెవరనేది స్థానికంగా వినిపించే మాట. మరి.. మాటల తూటాలకే నేతలు పరిమితమై.. ఎవరి శిబిరంలో వాళ్లే ఉంటారో.. పొలిటికల్‌ మైలేజీ కోసం ఎపిసోడ్‌ను మరింత ముందుకు తీసుకెళ్తారో చూడాలి.

Exit mobile version