Warangal TRS MLA’s : ఆ జిల్లాలోని MLAలకు కొత్త చిక్కులు వచ్చి పడ్డాయా? సీటు నాదే అని చెప్పుకోవడానికి నానా తంటాలు పడుతున్నారా? ఎందుకీ పరిస్థితి వచ్చింది? ఎవరా ఎమ్మెల్యేలు? ఏంటా జిల్లా? లెట్స్ వాచ్..!
ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొన్ని రోజులుగా సిట్టింగ్ ఎమ్మెల్యేల మార్పు తప్పదనే ప్రచారం జోరుగా సాగుతోంది. కొత్త వారికి ఛాన్స్ ఇస్తారని చాలా మంది ఆశావహులు ఎదురు చూస్తున్నారు. ఎవరి ప్రయత్నాల్లో వాళ్లు బీజీ అయ్యారు. పోటీ చేసేది మనమే అని అనుచరులకు చెబుతూ.. సమర సన్నాహాల్లో మునిగిపోతున్నారట. ఈ క్రమంలో మహబూబాబాద్, డోర్నకల్, వరంగల్ తూర్పు, భూపాలపల్లి, స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గాల్లో జరుగుతున్న పరిణామాలు ఆసక్తి కలిగిస్తున్నాయి.
చూస్తూ ఊరుకుంటే మొదటికే ఎసరు రావొచ్చని ఆందోళన చెందుతున్న ఎమ్మెల్యేలు.. డ్యామేజీ కంట్రోల్‌కు ప్రాధాన్యం ఇస్తున్నారు. అసంతృప్తిని తగ్గించుకునేందుకు విస్తృతంగా పర్యటిస్తూ మీటింగ్‌లు పెడుతున్నారట. తనకేమీ వయసు పైబడలేదని.. వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్ సీటు నాదే.. టికెట్ నాదే అని ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి భూపాలపల్లిలో ఊదరగొడుతున్నారు. స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే రాజయ్య కూడా ఎవరేం చెప్పినా అధిష్ఠానం ఆశీసులు తనకే అని చెబుతున్నారట. వరంగల్ తూర్పులో ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ పార్టీలోని ప్రత్యర్థులకు గట్టి చురకలే వేస్తున్నారు.
డోర్నకల్‌లో ఎమ్మెల్యే రెడ్యానాయక్ వాదన మరోలా ఉంది. మంత్రి పదవి రాకున్నా ఓపిగ్గా ఉన్నానని.. తన సీనియారిటీకి పట్టడం కడతారని కేడర్‌కు వెల్లడిస్తున్నారట. ఉద్యమ నాయకులను తొక్కేస్తామనే కలలు నిజం కాబోవన్నది మరో ఎమ్మెల్యే శంకర్ నాయక్ మాట. పార్టీ కేడర్‌లో గందోరగోళం తెచ్చేందుకే లేని పోని ప్రచారం చేస్తున్నారని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి ఫైర్ అవుతున్నారట. ఎమ్మెల్యేల వాదన ఇలా ఉంటే.. ఆశావహుల లెక్కలు మరోలా ఉన్నాయి. తగ్గేదే లేదన్నట్టుగా అడుగులు వేస్తున్నారు. ఈ పరిణామాలు జనాల్లోకి ఎలాంటి సంకేతాలు పంపుతున్నాయి? అధిష్ఠానం ఆలోచనలేంటి? అని కేడర్ ఆరా తీస్తున్న పరిస్థితి నియోజకవర్గాల్లో ఉందట. ఎవరికి వారు పార్టీ హైకమాండ్ పేరు చెప్పి.. కేడర్ తమ దగ్గర నుంచి జారిపోకుండా జాగ్రత్త పడుతున్నారు.
ఉమ్మడి జిల్లాలో చాలా మంది టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ఉండగా.. కేవలం కొన్ని సెగ్మెంట్‌లలోనే రాజకీయ అలజడి రేగుతోంది. ఎవరికి వాళ్లు సీటు నాదే .. గెలుపు నాదే అని ఢంకా బజాయించి చెప్పేస్తున్నారు. ఎమ్మెల్యేలది ఇదే మాట.. ఆశావహుల నోటి నుంచి వస్తోన్న పలుకులు ఇవే. మరి.. సీట్ల చదరంగంలో ఎవరు బరిలో నిలుస్తారో.. ఎవరు ప్రేక్షక పాత్రకు పరిమితం అవుతారో చూడాలి.