ఆరు నియోజకవర్గాలు కలిగిన విశాఖపట్టణంజిల్లా ప్రధాన రాజకీయపార్టీలకు ఆయువు పట్టు. సంస్ధాగతంగా పార్టీల బలోపేతంపై టీడీపీ, వైసీపీ ఫోకస్ పెంచాయి. సోషల్ ఇంజనీరింగ్‌లో పది అడుగులు ముందేవున్న వైసీపీ.. కీలకమైన జిల్లా అధ్యక్ష పదవిలో మార్పు చేసింది. మూడేళ్లు మంత్రిగా ఉన్న భీమిలి ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్‌కు ఆ బాధ్యతలు అప్పగించింది. తొలిసారి పార్టీని నడిపించే అవకాశం లభించడంతో అవంతి సైతం ప్రతిష్టాత్మకంగానే భావిస్తున్నారు. కానీ, క్షేత్రస్ధాయిలో పార్టీ పరిస్ధితులు అవంతికి ఏ మాత్రం కొరుకుడుపడ్డం లేదనేది అంతర్గత చర్చ.
గత ఎన్నికల్లో గ్రేటర్ విశాఖ పరిధిలో నాలుగు స్ధానాలను టీడీపీ గెలుచుకుంది. భీమిలి, గాజువాక మాత్రమే వైసీపీకి దక్కాయి. వచ్చే ఎన్నికల్లో మొత్తం సీట్లన్నీ తమ ఖాతాలోనే వేసుకోవాలనేది అధికారపార్టీ ఆలోచన. కొత్త అధ్యక్షుడుకి వైసీపీ కోఆర్డినేటర్ల మధ్య మంచి సంబంధాలు ఉన్నప్పటికీ నియోజకవర్గాల వారీగా అంతర్గత రాజకీయాలు ఇబ్బంది కలిగిస్తున్నాయట. పార్టీ కార్యకలాపాలపై ప్రభావం పడుతుందనే సంకేతాలు ఉన్నాయి. ఉమ్మడి విశాఖ జిల్లా వైసీపీ సమన్వయకర్త హోదాలో తొలిసారి నగరానికి వైవీ సుబ్బారెడ్డి వచ్చారు. ఆయనకు స్వాగతం చెప్పే సమయంలోనే సమన్వయ లోపం బయటపడింది. అధ్యక్షుడిగా అవంతి అందరికీ సమాచారం పంపినా కొందరు సీనియర్లు సహకరించలేదట. ఈ అంశంపై కొందరిని అవంతి నేరుగానే ప్రశ్నించారని..అంతర్గత రాజకీయాలకు పార్టీ కార్యక్రమాలను వాడుకోవడం కరెక్ట్ కాదని చెప్పినట్టు తెలిసింది. ఈ క్రమంలోనే ఓ ఎమ్మెల్సీకి అవంతికి మధ్య వాగ్వివాదం జరిగిందట.
వైవీ కార్యక్రమానికి భారీగా జనసమీకరణ చేయాలని వైసీపీ నేతలు భావించారు. నాయకులు, ముఖ్య కార్యకర్తలతో రెండుసార్లు సన్నాహాక సమావేశం నిర్వహించారు. వార్డుల వారీగా జన సమీకరణ ఎలా ఉండాలనే దానిపై స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. చివరికి కార్యకర్తలను సమీకరించడంలో మీరు ముందు అంటే మీరు ముందు అంటూ వాదులాడుకుని అంతా గాలికి వదిలేశారట. అదే సమయంలో అనకాపల్లి జిల్లా సమావేశం భారీగా జరిగింది. ఇప్పుడు రెండు జిల్లాల మధ్య ఆ ప్రోగ్రామ్‌పై పోలికలు మొదలయ్యాయి.
ప్రధానంగా తూర్పు, దక్షిణ నియోజకవర్గాల్లో అసంతృప్తులు, గ్రూపు రాజకీయాలు అవంతికి ఇబ్బందిగా మారాయనేది టాక్. దక్షిణంలో ఐదు గ్రూపులు ఉండగా.. ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్, బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ సీతంరాజు సుదాకర్ వర్గాలు కుమ్ములాడుకుంటున్నాయి. కేడర్ మధ్య అయోమయం, స్పష్టమైన చీలిక ఉంది. తూర్పు నియోజకవర్గంలో మేయర్ గొలగాని హరివెంకటకుమారి, వీఎంఆర్‌డీ చైర్మన్ అక్కరమాని విజయనిర్మల, ఎమ్మెల్సీ వంశీకృష్ణల మధ్య పొసగటం లేదు. వీరి మధ్య సమన్వయం అవంతికి సవాలే అన్నది పార్టీ వర్గాల మాట.
ఇక మంత్రి గుడివాడ అమర్నాథ్, అవంతి మధ్య బలమైన సంబంధాలు లేవనేది బహిరంగ రహస్యం. పార్టీపై పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తున్న అవంతి.. కఠినమైన వైఖరి ప్రదర్శించేందుకు సిద్ధం అవుతున్నట్టు చెబుతున్నారు. ఈ దిశగా కీలకమైన చర్యలు తప్పవని బహిరంగ వేదికలపైనే హెచ్చరిస్తున్నారు. మంత్రులైన కార్యకర్తలైనా వరసగా మూడుసార్లు పార్టీ సమావేశాలకు హాజరు కాకపోతే షోకాజ్ నోటీసులు ఇవ్వాలని నిర్ణయించినట్టు సమాచారం. తద్వారా మొత్తం పార్టీ కార్యకలాపాలను తన పరిధిలోని తెచ్చుకోవాలన్నది అధ్యక్షుడు ఆలోచనగా తెలుస్తోంది. మరి ఇవన్నీ ప్రాక్టికల్‌గా ఎంత వరకు సాధ్యమో చూడాలి.