మంత్రి వర్గ విస్తరణలో అవకాశం దక్కకనినేతల అసంతృప్తి ఇంకా చల్లారినట్టు కనిపంచడంలేదు.. ముఖ్యంగా పశ్చిమగోదావరిజిల్లా నేతల్లో అసంతృప్తి సెగ పొగలుగక్కుతోంది. చాపకింద నీరులా వ్యాపించి ఓట్లేసిన జనంలో దృష్టిలో చులకన చేస్తోంది. తాజాగా భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ వ్యవహరంలో జరిగిన ఘటనే ఇందుకు నిదర్శనంగా కనిపిస్తోంది. భీమవరంలో వైసీపీ జిల్లా పార్టీ మీటింగ్ రసాభాసగా మారడం మంత్రి వర్గవిస్తరణలో ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ కు చోటు దక్కకపోవడం ఎంతటి అసంతృప్తిని మిగిల్చిందో బయటపెట్టింది. పార్టీని మరింత బలోపేతం చేద్దామని చెప్పడానికి వచ్చిన నేతల ఎదుటే మంత్రి వర్గవిస్తరణలో తమ నేతకు ప్రాధాన్యత కల్పించలేదని కేడర్ ఎదురు ప్రశ్నించే పరిస్థితి వచ్చింది.
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మీద పోటిచేసి ఘనవిజయం సాధించడం, పైగా సీనియర్ ఎమ్మెల్యే అయిన గ్రంధి శ్రీనివాస్ కు మంత్రి వర్గవిస్తరణలో ఎందుకు స్థానం కల్పించలేదంటూ ఆయన అనుచరగణం ఆగ్రహించింది. పార్టీ ఉభయగోదావరి జిల్లాల కోఆర్డినేటర్ లు, ఎంపీలు మిథున్ రెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, తాజాగా మంత్రి పదవులు దక్కించుకున్న కొట్టు సత్యనారాయణ, కారుమూరిల ముందే ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ వర్గం తమ నేతకు అన్యాయం జరిగిందంటూ మండిపడ్డారు. భీమవరంలో ఉన్న వైసిపి పార్టీ నాయకులకు, కార్యకర్తలకు విలువ లేదని అందుకే తమ ఎమ్మెల్యేని అధినేత సైతం పట్టించుకోలేదని బహిరంగంగానే ఆవేదన వ్యక్తం చేసారు. మంత్రి పదవి విషయంలోనూ అన్యాయం చేశారని పార్టీ పెద్దలను ఘోరావ్ చేసారు. దీంతో అవాక్కైన పార్టీ పెద్దలు, మంత్రులు గ్రంధి వర్గానికి నచ్చచెప్పే ప్రయత్నం చేసినా ఉపయోగం లేకుండా పోయింది.
2019 ఎన్నికలు ఫలితాలు ప్రకటించిన వెంటనే భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌కు మంత్రి పదవి ఖాయమంటూ చర్చలమీద చర్చలు జరిగాయి. అప్పుడు మంత్రి పదవి దక్కకపోయినా అక్కడి నేతల్లో ఆత్మస్థైర్యం ఏమాత్రం తగ్గలేదు. మరోసారి మంత్రి వర్గ విస్తరణ జరిగినపుడు అవకాశం ఉంటుందని అంతా ఎదురుచూసారు. తీరా అందులోనూ అవకాశం రాకపోవడంతో ఎమ్మెల్యే వర్గంలో అసంతృప్తి మరింత ఎక్కువయ్యింది. గ్రంథికి మంత్రి పదవి రాలేదని ఆగ్రహంతో ఉన్న కేడర్ అగ్రనేతలంతా రాగానే భగ్గుమన్నారు. మంత్రి వర్గ విస్తరణలో తమ నేతకు అవకాశం కల్పించకపోవడం కనీసం అధినేతను కలిసేందుకు అవకాశం కల్పించకపోవడం భీమవరం నేతల్లో కాకరేపిందట.. తనకు మంత్రి పదవి దక్కకపోవడానికి కారణం అధినేత దృష్టిలో తనకున్న స్థానమేంటో మీరే నేరుగా తేల్చండంటూ పార్టీ వర్గాలకు సూచనలు చేసారట.
అయితే గ్రంధి శ్రీనివాస్ కు మంత్రి పదవి దక్కకపోవడం వెనుక కారణాలు అనేకం ఉన్నాయట.. భీమవరం అసెంబ్లీ ప్రాంతానికి చెందిన కొయ్యే మోషేన్ రాజు ఇపుడు ఏపి శాశనమండలి చైర్మెన్ గా ఉన్నారు. మోషెన్ రాజుకు గ్రంధి శ్రీనివాస్ కు మద్య కొంత గ్యాప్ ఉండటం, తరచూ ప్రోటోకాల్ వివాదాలు తలెత్తడం అదే సమయంలో భీమవరంలో కీలకంగా నీలిచే క్షత్రియ సామజికవర్గంతో గ్రంథికి విభేదాలు ఉండటం మరోకారణమట. ఇదే సమయంలో క్షత్రియ సామాజికి వర్గానికి చెందిన చెరుకువాడ శ్రీరంగనాధరాజును పక్కనబెట్టి గ్రంధికి అవకాశమివ్వడం సరికాదని సొంతపార్టీ నేతలే చెప్పుకొచ్చారట. మరోపక్క పక్కపార్టీ అధినేతల ఓడించడం ఎంత అవసరమో అదే సమయంలో సొంతపార్టీ నేతలతో సఖ్యతగా ఉండాలనే మాటను వైసిపి అధినేత భీమవరం ఎమ్మెల్యే గ్రంధికి మంత్రి పదవి ఇవ్వకుండా చెప్పకనే చెప్పారని ఇతర నియోజకవర్గ నేతల మాట. ఇదంతా ఇలా ఉంటే పార్టీలో ఉన్న అసంతృప్తి, వర్గవిభేదాలు వచ్చే ఎన్నికలపై ఎలాంటి ప్రభావం చూపబోతున్నాయో అనే చర్చకూడా ఇపుడు భీమవరంలో హాట్ టాపిక్..