ఒకే పదవి కోసం ముగ్గురు ఎమ్మెల్యేలు కుస్తీ పడుతున్నారు. పార్టీ హైకమాండ్ దగ్గర పెద్దస్థాయిలోనే లాబీయింగ్ చేస్తున్నారట. ఆ లెక్కలు ఈ లెక్కలు బయటకు తీసి.. పాగా వేయడానికి చూస్తున్నారట ఎమ్మెల్యేలు. ఇంతకీ ఏంటా పదవి? ఏమా గొడవ? లెట్స్ వాచ్..!
బాజిరెడ్డి గోవర్దన్, షకీల్, గణేష్ గుప్త. ముగ్గురూ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలే. ఒకే జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధులు. గణేష్ గుప్త నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యేగా ఉంటే.. బాజిరెడ్డి గోవర్దన్ రూరల్ ఎమ్మెల్యే. ఇక షకీల్ బోధన్ శాసన సభ్యుడు. తమనే నమ్ముకున్న అనుచరులకు నామినేటెడ్ పదవులు ఇప్పించేందుకు ఎమ్మెల్యేలు చక్రం తిప్పడం వరకు బాగానే ఉన్నా.. ముగ్గురూ ఒకే పదవి కోసం ఉడుంపట్టు పట్టడమే జిల్లా అధికారపార్టీ రాజకీయాల్లో కాక రేపుతోంది. నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ పదవిని తమ ఖాతాలో వేసుకోవడానికి ఎమ్మెల్యేలు ముగ్గురూ గట్టిగానే పావులు కదుపుతున్నారు.
నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో కార్యకలాపాలు సాగిస్తోంది. దీంతో అనుచరులను ఛైర్మన్ సీటులో కూర్చోబెట్టేందుకు ఎమ్మెల్యేలు చేస్తున్న ప్రయత్నాలే ఆసక్తి రేకెతిస్తున్నాయి. ఆ పదవిపై ఆశలు పెంచుకున్న లోకల్ లీడర్లు కూడా ‘సార్.. మా సంగతేంటి? ఆ కుర్చీయేదో మాకు ఇప్పించండి’ అని ఎమ్మెల్యేలపై ఒత్తిళ్లు పెంచుతున్నారట. వాస్తవానికి గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ పదవిని ఆర్మూర్ నియోజకవర్గానికి ఇచ్చారు. ఇక కీలకమైన నూడా ఛైర్మన్ పదవిని నిజామాబాద్ అర్బన్‌కు కేటాయిస్తే.. అర్బన్ పరిధిలో ఉన్న మార్కెట్ కమిటీ పదవి ప్రస్తుతం రగడకు కేంద్రంగా మారిపోయింది.
ఎమ్మెల్యేల మధ్య ఏకాభిప్రాయం లేకపోవడం వల్లే నాలుగేళ్లుగా మార్కెట్ కమిటీ ఛైర్మన్ పదవిని భర్తీ చేయలేదు అధికారపార్టీ. త్వరలో ఛైర్మన్ నియామకం ఉంటుందని సంకేతాలు రావడంతో ఎమ్మెల్యేలు మళ్లీ పావులు కదపడం మొదలుపెట్టారట. ఈ దఫా రూరల్ నియోజకవర్గానికి మార్కెట్ కమిటీ ఛైర్మన్ పదవి ఇస్తారని ప్రచారం జరుగుతోంది. అయితే అర్బన్‌తోపాటు బోధన ఎమ్మెల్యేలు ససేమిరా అంటున్నారట. గతంలో రూరల్ ఎమ్మెల్యే అనుచరుడికే ఆ పదవి కట్టబెట్టారని.. ఈ సారి మాత్రం బోధన్‌ను పరిగణనలోకి తీసుకోవాలని షకీల్ పట్టుబడుతున్నారు.
దసరాలోపు పదవుల భర్తీ పూర్తి చేస్తారని ప్రచారం జరుగుతుండటంతో నిజామాబాద్ గులాబీ శిబిరంలో ఒక్కసారిగా రాజకీయం వేడెక్కుతోంది. ఎమ్మెల్యేల ప్రతిపాదనలను పరిగణలోకి తీసుకుంటారా? లేక అధిష్ఠానం నిర్ణయమే ఫైనల్ అవుతుందా అనేది కేడర్‌లో సస్పెన్స్‌గా ఉందట. ఒకవేళ ఎమ్మెల్యేల సిఫారసులకు ఓకే చెబితే.. ముగ్గురిలో ఎవరు అనుచరులకు పట్టం కడతారో అని లెక్కలేస్తున్నారట. ప్రస్తుతం ఈ పదవి చుట్టూ శాసనసభ్యుల ఆధిపత్యపోరు పీక్స్‌కు వెళ్లడంతో.. రేపటి రోజున ప్రకటన వెలువడ్డాక.. అసంతృప్తుల రియాక్షన్ ఏలా ఉంటుందో అంతుచిక్కడం లేదట. క్షేత్రస్థాయిలోని పరిస్థితులను అధిష్ఠానం గట్టిగానే వడపోస్తున్నట్టు సమాచారం. మరి.. మార్కెట్ మంటలు చల్లార్చేందుకు పార్టీ పెద్దలు ఏం చేస్తారో చూడాలి.