కొంత కాలంగా అధికారపార్టీలో చర్చగా మారిన ఆ మాజీ ఎంపీ.. మరోసారి మాటల తూటాలతో చర్చల్లోకి వచ్చారు. పదవి ఉన్నా లేకున్నా ఒకేలా ఉండాలంటూ కొత్త అస్త్రాలు వదిలారు? ఇంతకీ ఆయన ఎవరిని ఉద్దేశించి ఆ కామెంట్స్ చేశారు? ఎవరా మాజీ ఎంపీ?
రాజకీయ వ్యూహాలు ఆపని పొంగులేటి
పొంగులేటి శ్రీనివాసరెడ్డి. మాజీ ఎంపీ. టీఆర్ఎస్ నేత. కొంత కాలంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా అధికారపార్టీలో చర్చల్లో ఉన్న నాయకుడు. తన వర్గంతో కలిసి కొత్త రాజకీయ ఎత్తుగడలు వేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన చర్యలు పార్టీలోని ప్రత్యర్థుల శిబిరాల్లో నిప్పు రవ్వలు రాజేస్తున్నాయి. ఒకరిపై ఒకరు దాడులు చేసుకునే వరకు వెళ్తున్నాయి. తన వర్గంపై కేసులు నమోదవుతున్నా.. రాజకీయ వ్యూహాలు ఆపడం లేదు.
సరికొత్త కామెంట్స్‌తో చర్చల్లోకి మాజీ ఎంపీ
గత ఎన్నికల్లో టీఆర్ఎస్ ఎంపీ టికెట్ నిరాకరించినా.. పార్టీ ఏదైనా పదవి ఇవ్వకపోతుందా అని ఎదురు చూశారు పొంగులేటి. కానీ.. పదవి ఇచ్చే సంకేతాలు రాకపోవడంతో.. కామ్‌గా ఉండిపోయారు. ప్రస్తుతం రాష్ట్రంలో రాజకీయ వేడి రాజుకోవడంతో గేర్ మార్చేశారు. జిల్లాలో తనకు పట్టున్న నియోజకవర్గాల్లో అదే పనిగా పర్యటనలు చేస్తున్నారు. ఈ క్రమంలో పినపాక నియోజకవర్గంలో రచ్చ రచ్చ అయింది. ఇప్పుడు సరికొత్త కామెంట్స్‌తో మళ్లీ చర్చల్లోకి వచ్చారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి.
ఎవరిని ఉద్దేశించి పొంగులేటి కామెంట్స్ చేశారు?
పదవులు ఎవరికీ శాశ్వతం కాదని తాజాగా ఖమ్మంలో జరిగిన ఒక కార్యక్రమంలో పొంగులేటి వ్యాఖ్యానించారు. అక్కడితో ఆగితే లాభం లేదని అనుకున్నారో ఏమో.. ఈ రోజు పదవి ఉంటుంది.. రేపు పోతుంది.. నీవు బతికినంత కాలం అధికారం నీతోనే ఉండదు అని కాస్త బరువైన పదాలే ఉపయోగించారు. పదవి లేకుండా ఒకేలా ఉండాలని కూడా ఆయన తేల్చేశారు. ప్రజల ప్రేమాభిమానాలు పొందితేనే గౌరవం ఉంటుందని ముక్తాయింపు ఇచ్చారు పొంగులేటి. మాజీ ఎంపీ చేసిన ఈ కామెంట్స్ సాధారణంగా కనిపిస్తున్నా.. ఆయన ఎవరిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు అన్నది పెద్ద ప్రశ్నగా మారింది.
పార్టీలో పొంగులేటి శత్రువులు ఎవరు?
టీఆర్ఎస్‌లో..ముఖ్యంగా జిల్లాలో పొంగులేటి శత్రువులుగా భావిస్తున్నవారు ఎవరు? ఇటీవల కాలంలో ఆయనతో ప్రతిఘటిస్తున్నది ఎవరు? ఎందుకు ఈ కామెంట్స్ చేశారు? ఆయన మాటల వెనక ఉద్దేశం ఏంటి ఇలా రకరకాలుగా ఆరా తీస్తున్నాయి గులాబీ వర్గాలు.