ఆ మాజీ ఎమ్మెల్యేకి అన్నీ చింతలేనా? అధికారపార్టీలో ఉన్నప్పటికీ .. అవకాశాలు వచ్చినట్టే వచ్చి చేజారిపోతున్నాయా? ఎల్ రమణకి ప్రాధాన్యం ఇచ్చాక.. అదే సామాజికవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యేలో కలవరం పెరిగిందా? విపక్ష ఎమ్మెల్యేతో అధికారపార్టీ పెద్దలు రాసుకు పూసుకుని తిరగడం బీపీని పెంచుతోందా?
మాజీ ఎమ్మెల్యేకు మరిన్ని చింతలు
చింతా ప్రభాకర్. సంగారెడ్డి టీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే. 2014లో ఎమ్మెల్యేగా గెలిచి తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టిన ఆయన.. 2018 ముందస్తు ఎన్నికల్లో ఓడిపోయారు. అప్పటి నుంచి మాజీగానే మిగిలిపోయారు. చేతిలో మరో పదవి లేదు. అదిగో ఇదిగో అని కొన్ని పదవులు ఊరిస్తున్నా చేతికి అందవు. టిస్కో ఛైర్మన్ పదవి ఇస్తామన్న పెద్దల హామీ.. హామీగానే ఉండిపోయింది. కొంత డీలా పడ్డా తిరిగి యాక్టివ్ అయ్యారు. ఇంతలోనే అనుకోని షాక్‌లతో ప్రభాకర్‌కు మరిన్ని చింతలు పెరిగాయి.
జనంలోకి రావడమే మానేశారా?
చేతిలో ప్రొటోకాల్ పదవి లేకపోవడంతో సంగారెడ్డిలో చురుకుగా తిరగలేకపోతున్నారట. మొన్నటికి మొన్న ప్రొటోకాల్ పదవి వస్తుందని చింతా ప్రభాకర్ అనుచరులు తెగ ప్రచారం చేశారు. స్థానిక సంస్థలు లేదా ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీని చేసేస్తారని గొప్పలు పోయారట. ఆలు లేదు చూలు లేదన్నట్టు.. కాబోయే ఎమ్మెల్సీని తానేనని ప్రచారం ఊదరగొట్టేశారట. ఇంతలో ఏ కేటగిరీలోనూ చింతా ప్రభాకర్ పేరును పరిగణనలోకి తీసుకోలేదు. దీంతో ఆయన ముఖం కొట్టేసినట్టు ఫీలవుతున్నారట. జనంలోకి రావడమే మానేసినట్టు చెబుతున్నారు.
ఎల్. రమణకు పదవి ఇవ్వడంతో ఢీలా
గత ఏడాది జరిగిన GHMC ఎన్నికల సన్నాహక సమావేశంలో.. గతంలో TRSకి ఒక పద్మశాలి ఎమ్మెల్యే ఉండేవారని.. ఆయన ఓడిపోవడంతో వచ్చే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కచ్చితంగా అవకాశం కల్పిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఆ స్టేట్‌మెంట్ తన గురించే అని సంబరపడ్డారు చింతా ప్రభాకర్. అయితే హుజురాబాద్ ఉపఎన్నిక ముందు టీఆర్ఎస్‌లో చేరిన ఎల్ రమణను ఎమ్మెల్సీని చేయడంతో కంగుతిన్నారు మాజీ ఎమ్మెల్యే. ఎల్. రమణ కూడా చింతా ప్రభాకర్ సామాజికవర్గమే. తనకు రావాల్సిన పదవి వేరొకరికి వెళ్లిపోయిందని తెగ ఆవేదన చెందారట.
సంగారెడ్డిలో జగ్గారెడ్డికి ప్రాధాన్యం ఇవ్వడంతో దిగాలు
ఈ బాధ నుంచి ఇంకా తేరుకోక ముందే సంగారెడ్డి కేంద్రంగా ఇటీవల జరిగిన కొన్ని పరిణామాలు చింతా ప్రభాకర్‌ను మరింత కుంగదీశాయట. మంత్రి కేటీఆర్ సంగారెడ్డి పర్యటనకు వచ్చినప్పుడు స్థానిక ఎమ్మెల్యే జగ్గారెడ్డి వచ్చారు. అదే కార్యక్రమానికి చింతా ప్రభాకర్ హాజరయ్యారు. ఆ కార్యక్రమంలో జగ్గారెడ్డి.. మంత్రి కేటీఆర్ మధ్య జరిగిన సంభాషణలు.. నవ్వులు చూసి సైలెంట్ అయ్యారట. ఏదో అనుకుంటే ఇంకేదో జరుగుతోందని సైలెంట్‌గా పక్కకి తప్పుకున్నారట. ఇప్పట్లో కొత్తగా వచ్చే పదవి ఏమీ లేదని తెలుసుకున్నారో ఏమో.. కేడర్‌ను బుజ్జగించే పనిలో పడ్డారట.
భవిష్యత్‌పై బెంగ
ఎమ్మెల్యేగా ఓడినా.. పార్టీ అధికారంలో ఉండటంతో సంగారెడ్డిలో హవా చెలాయించొచ్చని చింతా ప్రభాకర్ లెక్కలు వేసుకున్నారు. కానీ.. విపక్ష ఎమ్మెల్యే జగ్గారెడ్డికి పార్టీ పెద్దలే ప్రాధాన్యం ఇవ్వడంతో తన భవిష్యత్ ఏంటో తెలియక ఆందోళన చెందుతున్నారట. మరి.. చింతా ప్రభాకర్ చింతలు ఎప్పుడు దూరం అవుతాయో ఏమో..?