ఒకే వరలో రెండు కత్తులు ఇమడలేవని అంటారు. హుజురాబాద్‌లో ప్రస్తుతం అదే పరిస్థితి ఉందట. ఒకప్పుడు నువ్వా నేనా అని కత్తులు దూసుకున్న మాజీ మంత్రులు ఇప్పుడు ఒకే గూటిలోకి వచ్చారు. అయినప్పటికీ ఎడముఖం పెడముఖంగానే ఉన్నారట. అదే అక్కడి రాజకీయాన్ని వేడెక్కిస్తోంది. ఇంతకీ ఎవరా మాజీ మంత్రులు.. ఏంటా పంచాయితీ? లెట్స్ వాచ్!
హుజురాబాద్‌లో మారుతున్న సమీకరణాలు!
మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీలో చేరిన సందర్భంగా కమలనాథులు సంతోషంగా ఉంటే.. తెరవెనక వారిని కలవరపెడుతున్న మరో అంశం హుజురాబాద్‌లోనే ఉందట. అదే మరో మాజీ మంత్రి పెద్దిరెడ్డి. ఇద్దరూ ఒకరిపై ఒకరు గతంలో పోటీపడిన వారే. ప్రస్తుతం ఇద్దరూ బీజేపీలోనే ఉన్నారు. బలమైన నేతలు ఒకే పక్షంలో ఉండటంతో బీజేపీకి తిరుగే ఉండబోదన్నది పార్టీ నేతల ఆలోచన. కానీ.. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు రోజు రోజుకూ మారిపోతున్నాయి. ఆ పరిణామాలే పార్టీ నేతలను టెన్షన్ పెడుతున్నాయట.
ఈటల చేరికను ముందుగా చెప్పలేదని పెద్దిరెడ్డి కినుక
హుజురాబాద్ నియోజకవర్గ బీజేపీ ఇంఛార్జ్‌గా పెద్దిరెడ్డి ఉన్నారు. బీజేపీలోకి ఈటల రాకను ఆయన మొదటి నుంచి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కొన్నేళ్లుగా ఈ నియోజకవర్గంలో ఇద్దరూ వేర్వేరు పార్టీలలో ఉండి ఒకరిపై ఒకరు పోరాటం చేశారు. విమర్శలు చేసుకున్నారు. ఆరోపణలు.. సవాళ్లు హోరెత్తాయి. ఈటల చేరిక సందర్భంగా ఢిల్లీకి పెద్దిరెడ్డిని పార్టీ నేతలు పిలవలేదట. దీంతో ఆయన చిన్నబుచ్చుకున్నట్టు సమాచారం. అసలు ఈటల బీజేపీలోకి వస్తున్నారన్న విషయాన్నే ఇంఛార్జ్‌గా ఉన్న తనకు చెప్పకపోవడంపై ముందు నుంచీ పెద్దిరెడ్డి ఒకింత అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఢిల్లీ ఎపిసోడ్ ఆ అసంతృప్తికి మరింత ఆజ్యం పోసినట్టు చెవులు కొరుక్కుంటున్నారు.
పెద్దిరెడ్డి శిబిరం రియాక్షన్‌పైనే ఎక్కువగా చర్చ
ఈ పరిణామాలే హుజురాబాద్‌లో బీజేపీలో వ్యతిరేక పవనాలకు ఆస్కారం ఉందని కమలనాథులు ఆందోళన చెందుతున్నారట. ఇప్పటికే తన అసంతృప్తిని.. నిరసనను పార్టీ నేతలకు పెద్దిరెడ్డి తెలియజేశారన్నది టాక్. ఈటల వచ్చారన్న సంతోషం కంటే.. పెద్దిరెడ్డి శిబిరం నుంచి వస్తోన్న రియాక్షనే పెద్ద చర్చగా మారింది. ఇది ఏ రూపంలో బరస్ట్ అవుతుందో అంతుచిక్కడం లేదట.
తన ప్రాబల్యం తగ్గిపోతుందని పెద్దిరెడ్డి ఆందోళన
గతంలో ఈటల రాజేందర్, పెద్దిరెడ్డి ఇద్దరూ హుజురాబాద్ నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచారు. మంత్రులుగానూ చేశారు. స్థానికంగా పట్టున్న నాయకులు. అందుకే ఇద్దరు ఉద్దండులను ఒకేతాటిపైకి తీసుకురావాలని బీజేపీ నేతలు విశ్వప్రయత్నాలు చేస్తున్నారట. కానీ.. ఈటల రాకతో నియోజకవర్గంలో తన ప్రాబల్యం తగ్గిపోతుందనే ఆందోళనలో పెద్దిరెడ్డి ఉన్నట్టు సమాచారం. ఇదే విషయాన్ని అనుచరుల దగ్గర కూడా ఆయన ప్రస్తావించారట. ఒకవేళ బీజేపీలో తనకేదైనా కీలక పదవి ఇస్తే.. పార్టీలో ఉంటానని స్పష్టం చేశారట.
బీజేపీ నాయకత్వం ముందు డిమాండ్స్ పెట్టనున్న పెద్దిరెడ్డి?
ప్రాధాన్యం తగ్గుతుందని భావిస్తే బీజేపీకి గుడ్‌బై?
హుజురాబాద్‌లో పర్యటించి.. అనుచరులతో మాట్లాడిన తర్వాత పెద్దిరెడ్డి.. భవిష్యత్ కార్యాచరణ ప్రకటించే వీలుందని తెలుస్తోంది. రెండు రోజులపాటు నియోజకవర్గంలో ఆయన పర్యటన ఉంటుందని చెబుతున్నారు. అనుచరులతో మాట్లాడిన తర్వాత.. బీజేపీ నాయకత్వం ముందు పెద్దిరెడ్డి తన డిమండ్స్ పెడతారని చర్చ జరుగుతోంది. ఇదే సమయంలో మరో అంశం కూడా బయటకు వస్తోంది. పార్టీలో తనకు ప్రాధాన్యం తగ్గుతుందని భావిస్తే బీజేపీకి రాజీనామా చేసే ఆలోచనలో కూడా పెద్దిరెడ్డి ఉన్నట్టు చెవులు కొరుక్కుంటున్నారు. అందుకే హుజురాబాద్ ఒకే వరలో రెండు కత్తులు ఇమడతాయా లేదా అన్న చర్చ వాడీవేడీగా సాగుతోంది.