OTR: ఆరు నియోజకవర్గాల్లో కొత్త ఇన్ఛార్జ్లు.. తూర్పుగోదావరిపై చంద్రబాబు ప్రత్యేక ఫోకస్..
- ఉమ్మడి తూ.గో. జిల్లా టీడీపీలో సంస్థాగత మార్పులు?..
- ఆరు నియోజకవర్గాలకు కొత్త ఇన్‌ఛార్జ్‌ల కోసం కసరత్తు..
- పనితీరు, కేడర్‌తో అనుబంధం, ప్రజాదరణలాంటి ప్రామాణికాలు..
- కొన్నిచోట్ల ఆశించిన స్థాయి పురోగతి లేదన్న క్లారిటీ..
- అనపర్తి ఇన్‌ఛార్జ్‌గా బీజేపీ ఎమ్మెల్యే కుమారుడు నల్లమిల్లి మనోజ్‌రెడ్డి?..
- రాజానగరం నుంచి బొడ్డు వెంకటరమణ చౌదరికి ఉద్వాసన?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉమ్మడి తూర్పుగోదావరి టీడీపీలో భారీ మార్పులు జరగబోతున్నాయా? పార్టీ అధిష్టానం ఆ దిశగా చేస్తున్న కసరత్తు దాదాపుగా కొలిక్కి వచ్చిందా? సరికొత్త ముఖాలు సారధ్య బాధ్యతల్లోకి రాబోతున్నాయా? ఉన్నట్టుండి ఇప్పుడే ఎందుకు ఈ ప్రక్రియ మొదలైంది? పార్టీ అధిష్టానం ఏమని ఆలోచిస్తోంది?
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పార్టీ సంస్థాగత బలోపేతంపై తెలుగుదేశం అధిష్ఠానం సీరియస్‌గా దృష్టి సారించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం అధికారంలో ఉన్నప్పటికీ కొన్ని చోట్ల గట్టి సమస్యలే ఉన్నాయని, వాటిని ఇప్పుడే సరిదిద్దుకోకుంటే భవిష్యత్‌లో వ్యతిరేక పరిణామాలు ఉంటాయని గుర్తించారట పార్టీ పెద్దలు. పి.గన్నవరం, అనపర్తి, రాజానగరం, నిడదవోలు, కొవ్వూరు, పిఠాపురం నియోజకవర్గాలకు కొత్త ఇన్ఛార్జ్లను నియమించే దిశగా కసరత్తు మొదలైందట. ప్రతి నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలను సమన్వయం చేసే బలమైన నాయకత్వాన్ని తయారు చేసే ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయంటున్నారు. స్థానిక పరిస్థితులు, నాయకుల పనితీరు, కేడర్‌తో అనుబంధం, ప్రజల్లో ఆదరణ వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని కొత్త బాధ్యతలు అప్పగించే అవకాశాలు ఉన్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
Also Read
కొన్ని చోట్ల ప్రస్తుత నాయకత్వంపై అసంతృప్తి వ్యక్తమవుతుండగా, మరికొన్ని చోట్ల సమన్వయ లోపం కారణంగా పార్టీ కార్యక్రమాలు ఆశించిన స్థాయిలో జరగడం లేదన్న అభిప్రాయంతో పెద్దలు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో కొత్త ఇన్‌ఛార్జ్‌ల నియామకం ద్వారా కేడర్‌కు స్పష్టమైన దిశానిర్దేశం చేయాలని అధిష్ఠానం భావిస్తున్నట్లు సమాచారం. రాజానగరం, నిడదవోలు, అనపర్తి వంటి నియోజకవర్గాల్లో సీనియర్స్‌తో పాటు యువ నేతల పేర్లు కూడా పరిశీలనలో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. అలాగే పి.గన్నవరం, పిఠాపురంలో సామాజిక సమీకరణాలు, స్థానిక రాజకీయ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు. కొత్త ఇన్‌ఛార్జ్‌ల విషయంలో ఇప్పటికే ప్రాధమిక అవగాహన కుదరగా… పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు ఆమోదం కోసం ఎదురు చూస్తున్నట్టు చెప్పుకుంటున్నాయి లోకల్ టీడీపీ వర్గాలు.
అనపర్తి నియోజకవర్గంలో బీజేపీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కుమారుడు మనోజ్ రెడ్డికి టీడీపీ ఇన్ఛార్జ్ పదవి దక్కవచ్చని తెలుస్తోంది. పార్టీ ప్రకటించకపోయినప్పటికీ ప్రస్తుతం మనోజ్ రెడ్డి అనపర్తి టీడీపీకి అనధికార ఇన్‌ఛార్జ్‌గా చెలామణి అవుతున్నారు. రాజానగరంలో కొత్తవారికి అవకాశం దక్కవచ్చని అంటున్నారు. ప్రస్తుత ఇన్చార్జ్ బొడ్డు వెంకటరమణ చౌదరి రుడా చైర్మన్‌తో పాటు టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా మొత్తం మూడు పదవుల్లో కొనసాగుతున్నారు. ఆయన పెద్దాపురం నియోజకవర్గానికి చెందిన వారు కావడంతో…. బొడ్డును తప్పించి లోకల్ లీడర్‌కే బాధ్యతలు అప్పగించబోతున్నట్టు సమాచారం. ప్రస్తుతం ముఖ్యమంత్రి ప్రోగ్రాం కన్వీనర్‌గా ఉన్న పెందుర్తి వెంకటేష్ భార్య అన్నపూర్ణకు రాజానగరం ఇన్ఛార్జ్ పోస్ట్ దక్కవచ్చన్నది పార్టీ టాక్.
అన్నపూర్ణ గతంలో టిడిపి అభ్యర్థిగా పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయారు. ఆమెను ఇన్ఛార్జ్ని చేస్తే… పార్టీలో వర్గ విభేదాలు తొలగిపోతాయన్న ఆలోచన కూడా ఉందట. ఇక నిడదవోలు తిరిగి మాజీ ఎమ్మెల్యే బూరుగుపూడి శేషారావుకే దక్కనుంది. శేషారావు ప్రస్తుతం కూటమి ప్రభుత్వ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ కేవలం టీడీపీ ప్రోగ్రామ్స్‌కే పరిమితం అవుతున్నారన్న విమర్శలున్నాయి. ఈ కోణంలో ఆయన్ని తప్పిస్తారని ప్రచారం జరిగినా… నిడదవోలు టీడీపీని సమర్థవంతంగా నడపడానికి అంతకు మించిన నాయకుడు మరొకరు కనిపించలేదని, అందుకే కొనసాగిస్తారన్నది ఇంటర్నల్ వాయిస్. ఇక అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచినప్పటికీ పి.గన్నవరం నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ లేరు.
ఇక్కడ స్థానికుడికే ఇవ్వాలన్న డిమాండ్ గట్టిగా వినిపిస్తోంది. ఇన్ఛార్జ్ లేకపోవడంతో… విభేదాలు పెరిగిపోయి మొత్తంగా పార్టీనే గందరగోళ స్థితిలో ఉందట. ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్‌కు బాధ్యతలు అప్పగిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఆయన ముమ్మిడివరం నియోజకవర్గానికి చెందిన వారు కావడంతో స్థానిక నాయకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు సమాచారం. ఇది ఎస్సీ రిజర్వుడు సీటు కావడంతో….అదే సామాజిక వర్గానికి చెందిన స్థానిక నాయకుడిని ఇన్ఛార్జ్ని చేయమన్న డిమాండ్ ఉంది. అటు కొవ్వూరులో టీడీపీ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు ఉండగా…. ఇక్కడ ద్వి సభ్య కమిటీ నియోజకవర్గ బాధ్యతలను చూస్తోంది. కంఠమని రామకృష్ణ, జొన్నలగడ్డ సుబ్బారాయ చౌదరి ద్వి సభ్య కమిటీగా మొత్తం పెత్తనం చెలాయిస్తున్నారు. ఇది పార్టీ శ్రేణులకు అస్సలు ఇష్టం లేదట. పార్టీ ఎమ్మెల్యే ఉన్నచోట ద్విసభ్య కమిటీ పెత్తనం ఏంటంటూ ప్రశ్నిస్తోంది కేడర్. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ద్విసభ్య కమిటీని తొలగించి ఎమ్మెల్యేకు పూర్తి స్థాయిలో బాధ్యతలు అప్పగించాలని పార్టీ కార్యకర్తల నుంచి డిమాండ్ వినిపిస్తోంది. ఇలా… రకరకాల కారణాలతో…. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని పలు నియోజకర్గాల్లో టీడీపీకి కొత్త సారధులు తెల మీదికి రావచ్చని అంటున్నారు. అధికారిక ప్రకటన వచ్చేసరికి లిస్ట్‌లో ఎవరెవరు ఉంటారో చూడాలి.
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!