తేనే తుట్టను కదిలించడం.. తేనెటీగలతో కుట్టించుకోవడం TTD పాలకమండలికి రోటీన్‌గా మారిపోయింది. ఆర్జిత సేవా టికెట్ల రేట్ల పెంపు కూడా ఆ కోవలోకే చేరింది. ఆ అంశంపై ఎందుకు చర్చ ప్రారంభించారు? ఎందుకు వెనక్కి తగ్గారు? అసలేం ఏం జరిగింది?
హడావిడి నిర్ణయాలు.. ఆనక వెనక్కి తగ్గడం..!
తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి యూటర్న్స్ పాలకమండలిగా మారిపోతోంది. సాధ్యాసాధ్యాలను పరిశిలించకపోవడం.. కంగారుగా నిర్ణయాలు తీసుకోవడం.. ప్రభుత్వానికి అప్రతిష్ట తీసుకురావడం.. చివరికి వెనక్కి తగ్గడం ఒక ప్రహాసనంలా కనిపిస్తోంది. ఈ జాబితాలో శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవా టికెట్ల ధరల పెంపు కూడా చేరింది.
ఆర్జిత సేవా టికెట్స్ రేట్ల పెంపుపై గతంలోనూ వివాదం
శ్రీవారి ఆలయంలో నిర్వహించే ఆర్జిత సేవలకు పరిమిత సంఖ్యలోనే భక్తులను అనుమతిస్తారు. వాటికి హజరైన భక్తులు స్వామివారికి బలంగానే హుండీలో కానుకలు సమర్పిస్తారు. సుప్రభాత సేవ మొదలుకోని.. వీఐపీ బ్రేక్ దర్శనం సమయానికే మూడో వంతు హుండీ ఆదాయం లభిస్తుంది. అందువల్ల ఆర్జిత సేవల టికెట్స్ రేట్లను ఆర్థికపరమైన అంశంగా TTD ఎప్పుడూ చూడదు. పైపెచ్చు పరిమిత సంఖ్యలో జారీ చేసే ఆర్జిత సేవా టికెట్ల ధరల పెంపుతో ఆలయానికి వచ్చే ఆదాయం కన్నా.. ప్రభుత్వానికి వచ్చే అప్రతిష్టే ఎక్కువ. దీంతో ఈ అంశాన్ని ఎవరూ టచ్ చేసేందుకు సాహసించరు. గత ప్రభుత్వ హయంలో కూడా ఇలాంటి ప్రయత్నమే అప్పటి పాలకమండలి చేసింది. ధరల పెంపు కోసం సబ్‌కమిటీని నెలకొల్పారు. ఆ కమిటీ ప్రతిపాదించిన ధరలు పాలకమండలి సమావేశం రోజున బయటకు పొక్కడంతో గగ్గోలు రేగింది. ఓ రేంజ్‌లో వ్యతిరేకత రావడంతో ప్రభుత్వ పెద్దలు జోక్యం చేసుకోక తప్పలేదు. దాంతో పాలకమండలి ఎలాంటి నిర్ణయం తీసుకోకుండానే ఆ అంశాన్ని పక్కన పెట్టేసింది.
సామాన్యులకు అందుబాటులో లేకుండా చేశారని తాజాగా విమర్శలు
శ్రీవారి ఆలయంలో రెండేళ్లుగా భక్తులను ఆర్జిత సేవలకు అనుమతించడం లేదు. దర్శనానికి కూడా పరిమిత సంఖ్యలోనే భక్తులకు అవకాశం కల్పిస్తున్నారు. గత పాలకమండలి సమావేశంలో టెబుల్ అజెండాగా ఆర్జిత సేవల టికెట్ల ధరల పెంపుపై చర్చ చేపట్టారు. సామాన్య భక్తులకు ధరలు పెంచబోమంటూనే.. సిఫారసు లేఖలపై కేటాయించే ఆర్జిత సేవా టికెట్ల రేట్లను పదింతలు పెంచుతూ ప్రతిపాదన చేశారు. దీనిపై భక్తులు మండిపడ్డారు. ఆర్జిత సేవా టికెట్స్ సామాన్యులకు అందుబాటులో లేకుండా చేశారని విమర్శలు వచ్చాయి.
చేతులు కాల్చుకోవడం.. యూటర్న్స్ తీసుకోవడం
అసలు సిఫారసు లేఖలు ద్వారా సామాన్య భక్తులు ఆర్జిత సేవలు పొందరా అనే ప్రశ్నలు వచ్చాయి. ప్రజాప్రతినిధులతోపాటు పాలకమండలి సభ్యులు సిఫారసు లేఖలు ఇస్తారు. ఆ లేఖలను సంపన్నులతోపాటు సామాన్యులకు కూడా ఇస్తుంటారు. అదే విషయాన్ని ప్రస్తావిస్తూ విమర్శలు రావడంతో ప్రజాప్రతినిధులకు ఇబ్బందిగా మారింది. పాలకమండలిలో చర్చ కూడా రచ్చరచ్చ కావడంతో ప్రభుత్వ పెద్దలు జోక్యం చేసుకోవాల్సి వచ్చినట్టు టాక్. వివాదాస్పద అంశాలకు ఫుల్‌స్టాప్ పెట్టాలని అక్షింతలు వేయడంతో.. దానిపై నిర్ణయం తీసుకోలేదు. అలాంటి ఆలోచనే లేదని పాలకమండలి పెద్దలు వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఎదురైంది. మొత్తానికి అమలు చెయ్యలేని అంశాల జోలికి వెళ్లి చేతులు కాల్చుకోవడం.. యూటర్న్స్ తీసుకోవడం పాలకమండలికి కామనైపోయిందనే గుసగుసలు ఎక్కువయ్యాయి.