దళిత గిరిజన ఆత్మగౌరవ పేరుతో సభలు.. సమావేశాలు పెట్టి కాంగ్రెస్ దూకుడుగా వెళ్తోంది. ఈ స్పీడ్ పార్టీ వర్గాలకు బలమైన టానిక్‌లా పనిచేస్తుందన్నది నేతల ఆలోచన. కానీ.. ఆ నియోజకవర్గంలో అంతా రివర్స్. కయ్యానికి కాలుదువ్వడమే తప్ప.. కలిసి సాగే పరిస్థితి లేదు. అందుకే వచ్చే ఎన్నికల నాటికి కొత్త నేత తెరపైకి వస్తారని జోరుగా చర్చ జరుగుతోంది. ఇంతకీ ఆ నేత ఎవరు? ఏంటా నియోజకవర్గం?
దేవరకద్రలో కాంగ్రెస్ ప్లాన్ బీ అమలు చేస్తుందా?
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో పెద్ద నియోజకవర్గం దేవరకద్ర. 2009లో నియోజకవర్గంగా మారినప్పుడు టీడీపీ పాగా వేసినా.. 2014, 2018లో టీఆర్‌ఎస్‌దే గెలుపు. దేవరకద్రలో క్షేత్రస్థాయిలో పట్టున్నా.. అసెంబ్లీ ఎన్నికల నాటికి సత్తా చాటలేక చతికిల పడుతోంది కాంగ్రెస్. చివరి వరకు అభ్యర్థి ఎవరో తేల్చకపోవడం.. వర్గపోరు.. నేతలకు ఒకరంటే ఒకరికి పడకపోవడం పార్టీ ఓటమికి కారణంగా విశ్లేషిస్తున్నాయి కాంగ్రెస్ వర్గాలు. బరిలో ఉన్న సొంత పార్టీ అభ్యర్థికి సహకరించకుండా కోవర్టులుగా మారేవారు అనేకమంది. ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు పీసీసీ కొత్త కమిటీ ఫోకస్ పెట్టినా.. ఇక్కడి నాయకులు వర్గపోరు వీడటం లేదు. దీంతో ప్లాన్ బీ అమలు చేయడానికి పీసీసీ సిద్ధమవుతున్నట్టు టాక్. దానిపైనే ఇప్పుడు కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ప్రస్తుతం వర్గపోరుతో దేవరకద్ర కాంగ్రెస్ సతమతం!
2018లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడిన పవన్‌కుమార్‌రెడ్డి ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు. ఆయన వెళ్లినప్పటి నుంచి ఇక్కడ కాంగ్రెస్‌కు ఇంఛార్జ్ లేరు. మధుసూదన్‌రెడ్డి, ప్రదీప్‌గౌడ్ అనే ఇద్దరు నాయకులే కాంగ్రెస్ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నారు. ఎవరికి వారు ఇంఛార్జ్ కావడానికి చేయని లాబీయింగ్ లేదు. ఇంచార్జ్ అయితే వచ్చే ఎన్నికల్లో టికెట్ గ్యారెంటీ అన్నది వారి ఆలోచన. ఈ క్రమంలోనే ఇద్దరు నాయకుల మధ్య ఆధిపత్యపోరు తారాస్థాయికి చేరుతోంది. తాజాగా ప్రదీప్‌గౌడ్‌పై మధుసూదన్‌రెడ్డి చేసిన కామెంట్స్ ఆడియో రూపంలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పార్టీ శ్రేణులు గందరగోళంలో పడ్డాయట. రెండువర్గాలు నిత్యం ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు.
కాంగ్రెస్‌లోకి సీతా దయాకర్‌రెడ్డి వస్తున్నట్టు ప్రచారం!
స్థానిక సంస్థలు, మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఆశించిన ఫలితాలు వచ్చినా.. నియోజకవర్గ స్థాయిలో నాయకత్వ సమస్య వేధిస్తోంది. కలిసి కార్యక్రమాలు చేసే వాతావరణం లేదు. దీంతో దేవరకద్రలో కాంగ్రెస్‌ను గాడిలో పెట్టడానికి పీసీసీ పెద్దలు ఫోకస్ పెట్టారట. మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత సీతా దయాకర్‌రెడ్డిని కాంగ్రెస్‌లోకి తీసుకొచ్చి.. ఇంఛార్జ్ చేస్తారని ప్రచారం జరుగుతోంది. ఆమె కాంగ్రెస్‌లోకి వస్తే పార్టీకి మంచిరోజులు వస్తాయని కేడర్ కూడా చర్చించుకుంటోందట. సీతాదయాకర్‌రెడ్డికి బలమైన వర్గం ఉండటంతో.. అది కాంగ్రెస్‌కు కూడా కలిసి వస్తుందని లెక్కలు వేస్తున్నాయట పార్టీ శ్రేణులు.
సీతా దయాకర్‌రెడ్డి వస్తే కాంగ్రెస్‌లో వర్గపోరుకు చెక్?
దేవరకద్రలో జరుగుతున్న ప్రచారంపై సీతా దయాకర్‌రెడ్డిపై ఖండించలేదు.. ఆహ్వానించలేదు. కానీ.. ఆమె చుట్టూ బలమైన చర్చ కాంగ్రెస్‌లో జరుగుతోంది. కాంగ్రెస్ అభ్యర్థిగా ఆమె తెరపైకి వస్తే మాత్రం పోరు ఆసక్తిగా మారుతుందని.. ఇప్పుడు వర్గాలుగా విడిపోయి కొట్లాడుతున్న మధుసూదన్‌రెడ్డి, ప్రదీప్‌గౌడ్‌లకు చెక్ పడుతుందని లెక్కలు వేస్తున్నారట. మరి.. దేవరకద్ర కాంగ్రెస్‌కు పీసీసీ ఎలాంటి చికిత్స చేస్తుందో చూడాలి .