Deputy Chief Minister Narayana Swamy : అయ్యో స్వామీ ఎంత కష్టం వచ్చింది అంటున్నారట విన్నవాళ్లంతా..రాష్ట్రంలో ఏ మంత్రికీ లేని సమస్యలు ఈయనకే ఉన్నాయనుకుంటున్నారట.ఎమ్మెల్యేగా ఉన్నంత కాలం హాయిగా గడిపేసిన ఆయన, డిప్యూటీ సీఎం అయిన తర్వాత మాత్రం నానా తంటాలు పడుతున్నారట. ఎంత చేసినా ఈ అసమ్మతి ఆగదా అని ప్రశ్నిస్తున్నారట.
వైసిపిలో గ్రూపులకు అడ్డాగా మారిందట జిడినెల్లూరు నియోజక వర్గం. ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు. అందుకు భిన్నంగా సాగుతోందట డిప్యూటి సీఎం నారాయణస్వామి పరిస్థితి. ఎమ్మెల్యేగా మూడు సార్లు పనిచేసిన సమయంలో ఎటువంటి తలనొప్పులు పడని నారాయణ స్వామి, పార్టీ అధికారంలోకి వచ్చి డిప్యూటీ సిఎం పదవి చేపట్టిన తర్వాత మాత్రం రాష్ట్రంలో ఏ మంత్రి చూడని ఇబ్బందులు అనుభవిస్తున్నారని జిల్లాలో ఓరెంజ్ లో టాక్ నడుస్తోంది. గత ఎన్నికల్లో గెలిచినప్పటి నుండి గ్రూపుల గోల నారాయణ స్వామిని తెగ వేదిస్తోంది. అ మాటను చాలాసార్లు బహిరంగంగా ఆయన చెప్పుకొచ్చారు.
నియోజకవర్గంలో గంగాధర్ నెల్లూరు, పెనుమూరు, వెదురుకుప్పం, ఎస్ఆర్ పురం, కార్వేటినగరం మండలాల్లో గ్రూపు రాజకీయాలు సర్వసాధారణంగా మారాయి. పంచాయతీ ఎన్నికల తర్వాత అవి కాస్తా పిక్స్ కి చేరాయట. మీరు మారాలని నేతలకు పదేపదే నారాయణ స్వామి విజ్ఞప్తి చేస్తున్నా, ఫలితం మాత్రం ఇంకోలా ఉంటోందని టాక్ గట్టిగానే వినపడుతోంది. ఇక ఇప్పుడు అ వంతు కార్యకర్తలు నుండి నేతల వరకు రావడంతో తెగ ఆవేదన చెందుతున్నారట. ముఖ్యంగా ప్రభుత్వ ఎన్ఆర్ఐ సలహాదారు మహాసముద్రం జ్ఞానేంద్రరెడ్డికి, డిప్యూటీ సీఎం నారాయణ స్వామి వర్గాల మధ్య నెలకొన్న అంతర్గత విభేదాలు ఆ పార్టీ మండల కమిటీ అధ్యక్షుల నియామకంతో బయటపడ్డాయి. ఇక అప్పటి నుంచి పక్కలో బల్లెంలా మారారట జ్ఞానేంద్రరెడ్డి.
జ్ఞానేంద్రరెడ్డి సొంత మండలం పెనుమూరు. అక్కడ పార్టీ మండల అధ్యక్షుడిగా తన బావమరిదిని పెట్టాలని జ్ఞానేంద్ర రెడ్డి భావిస్తే, నారాయణస్వామి ఇంకొకరికి అవకాశం ఇచ్చారు. అప్పటినుండి ఈ ఇద్దరి మధ్య మొదలైన ఫైట్, తారాస్థాయికి చేరింది.
తాజాగా జిడినెల్లూరు వైసిపి వాట్స్ అప్ గ్రూపులో ఈనెల 11 తేదిన నియోజకవర్గంలోని కేడర్, నేతలు, ఎంపీటీసీ, జెడ్పీటిసి, సర్పంచ్ సహా అందరూ పెనుమూరులో జరిగే సమావేశానికి రావాలని, అక్కడ నియోజకవర్గంలో పరిస్థితిపై చర్చిద్దాం అంటూ మెసెజ్ లు చక్కర్లు కొట్టడం కలకలం రేపింది. మెసెజ్ లపై అలర్ట్ అయిన మంత్రి అనుచర వర్గం విషయాన్ని చేరవేయడంతో నారాయణ స్వామి ఒక్కసారిగా ఓపెన్ అయ్యారు. ఈ మెసేజ్ ల వెనుక, జ్ఞానేంద్రరెడ్డి హస్తం ఉందని మంత్రి రుసరుసలాడుతున్నారు.
నియోజకవర్గంలో జరిగే పరిణామాలపై తీవ్రంగా స్పందించిన డిప్యూటీ సీఎం, తనపై పార్టీలో కుట్ర జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. తన తప్పు ఉందని, అవినీతి చేశానని ఎవరైనా నిరుపిస్తే వాళ్ళు కాళ్ళు పట్టుకుంటానన్నారు..
పార్టీకి వ్యతిరేకంగా పనిచేసే వాళ్లు పార్టీని వదిలి వెళ్లిపోవాలని కుట్రంతా గంగాధర నెల్లూరు నియోజక వర్గంలోని ఒక మండలంలోనే జరుగుతోందని ఫైర్ అయ్యారు. డిప్యూటీ సీఎం. తనను అవమానించిన విషయం చెబితే ఎంతవరకు పోతుందో, ఏమవుతుందో ఆ మనిషికి తెలియడం లేదన్నారు. ఈ మాటలు జ్ఞానేంద్రరెడ్డి ఉద్దేశించి నారాయణ స్వామి అన్నారని టాక్ వినిపిస్తోంది. నిజానికి తనమీద గుర్రుగా ఉన్న నేతలను చల్లబరిచేందుకు నారాయణస్వామి ఎప్పటినుంచో ప్రయత్నాలు చేస్తున్నారు. వారికి కోట్లాది రూపాయల పనులు ఇచ్చారు. అయినా వాళ్లు అసమ్మతి కార్యకలాపాలు ఆపకపోగా, మరింత స్పీడ్ పెండచటంతో, లబలబలాడిపోతున్నారు డిప్యూటీ సీఎం.
తన వ్యతిరేకులకు తాను ఏ స్థాయిలో సహకరించినది, ఆయనే స్వయంగా చెప్పుకుని బాధపడుతున్నారట. అసమ్మతి గ్రూపులు కడుతున్న ఆ మండల నేతకు రూ.14 కోట్ల రోడ్డు పనులు ఇచ్చిన తర్వాత కూడా కావాలనే సభలు, సమావేశాలంటూ మెసేజ్ లు వాట్సాప్ గ్రూపుల్లో పెట్టి గంగరగోళం సృష్టించటం వల్లనే తాను స్పందించాల్సి వచ్చిందన్నారు. అయితే ఎప్పుడూ బహిరంగంగా నియోజకవర్గ నేతలపై డైరెక్ట్ ఎటాక్ చేయని నారాయణ స్వామి నుండి అలాంటి మాటలు రావడం పార్టీలోని అలజడి రేపింది. గ్రూపు రాజకీయాలు పతాకస్దాయికి చేరాయని చర్చ పెరగటంతో, జిడి నెల్లూరు లో వ్యతిరేక వర్గం సమావేశం ఉంటుందా…అదే జరిగితే పరిస్థితి ఏమిటనే టెన్షన్ వైసిపిలో నెలకొందట.