NTV Telugu Site icon

Contonment Seat: కుమ్ములాటలు.. సాయన్నకు తలనొప్పులు

అక్కడ అధికారపార్టీ ఎమ్మెల్యే ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయన పోటీ చేస్తారో లేదో తెలియదు. కానీ.. మూడు కార్పొరేషన్ల ఛైర్మన్లు మాత్రం ఏవేవో లెక్కలు వేసుకుని టికెట్‌ కోసం ట్రయిల్స్ మొదలుపెట్టేశారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో ఉన్న నియోజకవర్గం కావడంతో అధికారపార్టీ నేతల ఎత్తుగడలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.

కంటోన్మెంట్‌ టీఆర్ఎస్‌ రాజకీయాల్లో మలుపులు ఉంటాయా?
గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని సికింద్రాబాద్‌ కంటోన్మెంట్ నియోజకవర్గంలో టీఆర్ఎస్‌ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. కంటోన్మెంట్‌ ఎస్సీ రిజర్వ్డ్‌ సెగ్మెంట్‌. ఇక్కడ ఎమ్మెల్యే సాయన్న టీఆర్‌ఎస్సే. ప్రస్తుతం ఈ నియోజకవర్గం టీఆర్‌ఎస్‌లో హాట్‌ టాపిక్‌. వచ్చే ఎన్నికల్లో టికెట్‌ ఆశిస్తూ చాలామంది ఎస్సీ నేతలు కంటోన్మెంట్‌ వైపు ఆశగా చూస్తున్నారు. ఎమ్మెల్యేగా సాయన్న ఉన్నప్పటికీ అక్కడ పట్టు సాధించే దిశగా ఆ నాయకులు పావులు కదుపుతున్నారట. దీంతో కామ్‌గా ఉన్న కంటోన్మెంట్‌ రాజకీయం రానున్న రోజుల్లో ఎలాంటి మలుపు తీసుకుంటుందో అనే ఉత్కంఠ కేడర్‌లో నెలకొంది.

ఎవరికి తోచిన విధంగా వాళ్లు ఎత్తుగడలు
కంటోన్మెంట్‌పై టీఆర్ఎస్‌కు చెందిన ముగ్గురు నేతలు కన్నేశారట. ఆ ముగ్గురికీ ఇటీవలే రాష్ట్రస్థాయి కార్పొరేషన్‌ ఛైర్మన్‌ పదవులు దక్కాయి. వాళ్లే ఎర్రోళ్ల శ్రీనివాస్‌, మన్నే క్రిశాంక్‌, గజ్జెల నగేష్‌. వీరిలో గజ్జెల నగేష్‌ గతంలో టీఆర్‌ఎస్‌ నుంచి కంటోన్మెంట్‌ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఇక ఎర్రోళ్ల శ్రీనివాస్‌ లెక్కలు వేరే ఉన్నాయి. రాజధాని ప్రాంతంలోని నియోజకవర్గం.. బలమైన కేడర్‌ ఉండటంతో గట్టి లాబీయింగే చేస్తున్నారట. మన్నే క్రిశాంక్‌ సైతం బలం చాటే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇలా ఎవరికి తోచిన విధంగా వారు కంటోన్మెంట్‌లో కార్యక్రమాలు మొదలుపెట్టేశారు. ఆధిపత్యం కోసం భారీ స్కెచ్‌లే వేస్తున్నారట.

ఎమ్మెల్యే సాయన్నకు పక్కలో బల్లెంలా నేతలు?
తాజా పరిణామాలు కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే సాయన్నకు మింగుడు పడటం లేదట. ఆశావహులంతా ఆయనకు పక్కలో బల్లెంలా మారినట్టు కేడర్‌ చెవులు కొరుక్కుంటోంది. ఒకవేళ వచ్చే ఎన్నికల్లో సాయన్న పోటీ చేయకుండా.. తన వారసుల కోసం టికెట్‌ అడిగితే ఏం జరుగుతుందనే ప్రశ్నలు ఉన్నాయి. ప్రస్తుతమైతే నేతల ప్రయత్నాలపై ఎలాంటి కామెంట్స్‌ చేయకుండా.. అంతా కామ్‌గా గమనిస్తున్నారట. దీంతో అసెంబ్లీ ఎన్నికల నాటికి కంటోన్మెంట్‌ టీఆర్ఎస్‌ రాజకీయాలు రసవత్తరంగా మారతాయని అనుకుంటున్నారు. కుమ్ములాటలు మొదలైతే రచ్చ రచ్చ అవడం కాయం. మరి.. కంటోన్మెంట్‌ టీఆర్ఎస్‌లో సాయన్న పట్టు నిలుపుకొంటారో.. కొత్త వాళ్లు పాగా వేస్తారో చూడాలి.