హుజురాబాద్ ఉపఎన్నికలో ఓటమికి కారణాలు అన్వేషిస్తూ కాంగ్రెస్ వేసిన కమిటీ ఏమైంది..? ఆ నియోజకవర్గంలో కమిటీ పర్యటన లేనట్టేనా..? నాయకులతో మాట్లాడి తూతూ మంత్రంగానే ముగించేయాలని నిర్ణయించారా..?
హుజురాబాద్ ఓటమిపై కమిటీ వేసి 3 వారాలైంది..!
హుజురాబాద్ ఉపఎన్నికలో తమ అభ్యర్థికి 3 వేల ఓట్లే రావడంపై తెలంగాణ కాంగ్రెస్‌లో పెద్ద దుమారమే లేపింది. పార్టీలో సీనియర్ నాయకులు.. పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి లక్ష్యంగా ఆరోపణలు చేశారు. ఆ ఉపఎన్నికలో కాంగ్రెస్ ఓటు బ్యాంక్.. పూర్తిగా ఈటలకు ట్రాన్స్‌ఫర్ అయిందనే చర్చ ఉంది. ఈ అంశంపై పార్టీలోనే భిన్నాభిప్రాయలు ఉన్నాయి. ముఖ్య నాయకులే పార్టీ క్యాడర్‌ని డైవర్ట్ చేశారనే కామెంట్స్ వినిపించాయి. చివరకు హుజురాబాద్‌లో కాంగ్రెస్ ఓటమిపై పొరుగు రాష్ట్రానికి చెందిన నాయకులతో విచారణ చేయించాలని పొలిటికల్ అఫైర్స్ కమిటీ నిర్ణయించింది. ఆ కమిటీని వేసి 3 వారాలు దాటినా.. ఉలుకు పలుకు లేదు.
కనీసం 20 వేల ఓట్లు వచ్చినా పరువు దక్కేదా?
స్థానిక కాంగ్రెస్ నేతలను ప్రభావితం చేశారా?
ఉపఎన్నికపై పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఎక్కువ ఎఫర్ట్ పెట్టకపోవడం వల్లే ఫలితాలు దారుణంగా వచ్చాయని.. సారథిపై కాంగ్రెస్ హైకమాండ్‌కు ఫిర్యాదు చేశారు. వాస్తవానికి హుజురాబాద్‌లో ఎప్పుడు ఎన్నిక జరిగినా.. కాంగ్రెస్‌కు సగటున 25 వేల నుంచి 30 వేల ఓట్లు ఉన్నాయని అంచనా. ఇవి కాంగ్రెస్‌కు సంప్రదాయ బద్ధంగా ఉండే ఓటుబ్యాంక్. హుజురాబాద్ ఉపఎన్నికలో కాంగ్రెస్‌కు కనీసం 20 వేల ఓట్లు వచ్చినా.. పరువు దక్కేదన్నది గాంధీభవన్ వర్గాల్లో ఒక వాదన ఉంది. అయితే పార్టీ గెలిచే పరిస్థితి లేదని భావించి.. నియోజకవర్గంలోని స్థానిక నాయకత్వమే ఈటల రాజేందర్‌వైపు మొగ్గు చూపిందా? లేక.. టీఆర్ఎస్‌ను కట్టడి చేయడానికే ఈటలకు ఓటేశారా? అనే చర్చ కూడా ఉంది. ముఖ్యంగా ఈటల రాజేందర్ బీజేపీ అభ్యర్థిగా కాంగ్రెస్ కేడర్ చూడలేదని చెబుతున్నారు. అలాగే స్థానిక నాయకులను ఎవరైనా ప్రభావితం చేశారా అనే అనుమానాలు ఉన్నాయట. దీంతో అసలేం జరిగిందో తేల్చడానికి ఒక కమిటీని ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీ. ఆ కమిటీ ఇంతవరకు పని ప్రారంభించలేదు. ఎప్పుడు శ్రీకారం చుడుతుందో తెలియదు. ఫీల్డ్ ఎంట్రీ ఉంటుందో లేదో కూడా పార్టీ వర్గాలు చెప్పలేకపోతున్నాయట.
హుజురాబాద్‌లో ఏం జరిగిందో కాంగ్రెస్‌లో క్లారిటీ ఉందా?
కమిటీలో కర్నాటకకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఉన్నారు. ఆయనే కాంగ్రెస్ ఓటమిపై అధ్యయనం చేసి AICCకి నివేదిక అందజేయాల్సి ఉంది. విచారణలో భాగంగా కమిటీ హుజురాబాద్‌లో పర్యటిస్తుందని.. అభ్యర్థి వెంకట్‌తోపాటు.. పార్టీ ముఖ్యనాయకులతో మాట్లాడి వివరాలు తెలుసుకుంటుందని భావించారు. మరోవైపు హుజురాబాద్‌లో ఏం జరిగిందన్నది కాంగ్రెస్‌లో అందరికీ క్లారిటీ ఉందట. రెండుపార్టీల మధ్య కాకుండా.. ఇద్దరు నాయకుల మధ్య ఉపఎన్నిక జరిగిందనే అభిప్రాయంలో ఉన్నారు నాయకులు. అందుకే కమిటీలోలో ఎలాంటి కదలిక లేకపోవడంతో కథ కంచికేనా అనే అనుమానాలు కలుగుతున్నాయట.