వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ నల్లగొండ నుంచి పోటీచేసే అవకాశం ఉందని లోకల్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి చేసిన కామెంట్స్ స్థానికంగా వేడి రగిలించాయి. నియోజకవర్గస్థాయి కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే ఈ వ్యాఖ్యలు చేశారు. కొద్దిరోజులుగా నల్లగొండ నియోజకవర్గంలో జరుగుతున్న చర్చకు భూపాల్‌రెడ్డి చేసిన కామెంట్స్ బలం చేకూరుస్తున్నాయా అనే అనుమానాలు ఉన్నాయట.
సీఎం కేసీఆర్ నల్లగొండ నుంచి పోటీచేసే అవకాశం లేకపోలేదన్న భూపాల్‌రెడ్డి.. గులాబీ బాస్ నల్లగొండను ఎంపిక చేసుకుంటే చరిత్రలో నిలిచిపోయే మెజారిటీతో గెలిపిప్తామన్నారు. ఈ సందర్భంగా 2018 అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో సీఎం కేసీఆర్ చేసిన వాగ్దానాలను మరోసారి చర్చల్లో పెడుతున్నారు. నల్లగొండలో టీఆర్ఎస్‌ను గెలిపిస్తే నియోజకవర్గాన్ని దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తానని అప్పట్లో చెప్పారు కేసీఆర్. ఆ మేరకు నల్లగొండలో డెవలప్‌మెంట్ వర్క్స్ స్పీడ్ పెంచారన్నది టీఆర్‌ఎస్ శ్రేణుల వాదన. రెండుసార్లు వచ్చిన ముఖ్యమంత్రి.. అభివృద్ధి ఎలా ఉండాలో అధికారులకు దిశానిర్దేశం చేశారు కూడా. వీటికితోడు ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి చేసిన తాజా కామెంట్స్‌ను వాటితో లింక్ చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో నల్లగొండలో కేసీఆర్ పోటీ చేస్తారని ప్రచారం మొదలుపెట్టేశారు.
ఈ చర్చలు.. ప్రచారాల వెనక భారీ వ్యూహమే ఉన్నట్టు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. దక్షిణ తెలంగాణలో కాంగ్రెస్ బలంగా ఉంది. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి ఆ ఛాన్స్ ఇవ్వకూడదనే ఉద్దేశంతోనే సీఎం కేసీఆర్ దక్షిణ తెలంగాణపై ప్రత్యేక ఫోకస్ పెట్టబోతున్నట్టు టీఆర్ఎస్ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. వాస్తవానికి ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి సోదరులు, రాంరెడ్డి దామోదర్‌రెడ్డి తదితర కీలక నేతలు ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో సీఎం కేసీఆర్ నల్లగొండను ఎంచుకుంటే.. జిల్లాలోని కాంగ్రెస్ ముఖ్య నేతల గెలుపోటములను ప్రభావితం చేసే అవకాశం ఉందని టీఆర్ఎస్ శ్రేణులు లెక్కలేస్తున్నాయట. ఆ కోణంలో జరుగుతున్న చర్చను కొట్టిపారేయలేమన్నది కొందరి వాదన. ఒక్క ఉమ్మడి నల్లగొండ జిల్లానే కాకుండా.. నల్లగొండలో కేసీఆర్ పోటీ.. ఉమ్మడి మహబూబ్‌నగర్, ఖమ్మం, రంగారెడ్డి జిల్లాల్లోనూ ప్రభావం కనిపిస్తుందని అంచనా వేస్తున్నారు నేతలు. ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టు.. దక్షిణ తెలంగాణలో కాంగ్రెస్ బలహీన పర్చడంతోపాటు.. టీఆర్ఎస్‌ను మరింత బలోపేతం చేసుకోవచ్చని అనుకుంటున్నారట. మరి.. ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి టీఆర్‌ఎస్ అధిష్ఠానం దృష్టిలో పడేందుకు ఈ కామెంట్స్ చేశారో.. లేక టీఆర్‌ఎస్ హైకమాండే ఇక్కడ ఫోకస్ పెట్టిందో కాలమే చెప్పాలి.