టీఆర్ఎస్ ఎమ్మెల్యేల పనితీరుపై పార్టీ పెద్దలకు నివేదికలు అందాయా? ఆ రిపోర్ట్‌ల ఆధారంగా కొందరు శాసనసభ్యులను పిలిచి మాట్లాడారా? హితబోధ చేశారా.. లేక క్లాస్ తీసుకున్నారా? దిద్దుబాటు చేసుకోలేని ఎమ్మెల్యేలు సర్దుకోవాల్సిందేనా? గులాబీ శిబిరంలో ఉత్కంఠ రేపుతున్న నివేదికలేంటి?
ఎమ్మెల్యేల పనితీరుపై ఫీడ్ బ్యాక్ తెప్పించుకున్న టీఆర్‌ఎస్
తెలంగాణలో టీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చి మూడేళ్లయింది. క్రమంగా ఎన్నికల మూడ్‌లోకి వెళ్తోంది పార్టీ. దీంతో క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటి? వారి పనితీరు ఎలా ఉంది? ప్రజలు ఏమనుకుంటున్నారు? ఎమ్మెల్యేల గ్రాఫ్.. పార్టీ పరిస్థితికి మ్యాచ్ అవుతుందా లేదా అని అధికారపార్టీ రిపోర్టులు తెప్పించుకున్నట్టు సమాచారం. మొదటిసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇటు ప్రభుత్వ పాలన.. అటు ఎమ్మెల్యేల పనితీరుపై ప్రజల్లో ఉన్న మూడ్ వడపోస్తోంది. ఆ నివేదికల ఆధారంగా అవసరమైన దిద్దుబాటు చర్యలను గతంలోనూ తీసుకున్నారు. తాజాగా రాష్ట్రంలో మారుతున్న రాజకీయ పరిస్థితుల తర్వాత ఎమ్మెల్యేలపై ప్రజల్లో ఉన్న అభిప్రాయం, పనితీరుపై ఫీడ్ బ్యాక్ తెప్పించుకున్నారట టీఆర్ఎస్ పెద్దలు. ఆ నివేదికల ఆధారంగా యాక్షన్ మొదలైనట్టు సమాచారం.
పనితీరు దారుణంగా ఉన్నవారికి గట్టిగానే అక్షింతలు
నివేదికల్లో వెల్లడైన అంశాల ఆధారంగా.. ప్రజల్లో సానుకూల అభిప్రాయం లేని ఎమ్మెల్యేలను పార్టీ పెద్దలు పిలిపించినట్టు తెలుస్తోంది. ఆ ఎమ్మెల్యేలు రాగానే.. వారి ముందు సర్వే వివరాలు పెట్టి ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారట. ఇకనైనా పద్ధతి మార్చుకోండి. మీ గ్రాఫ్ ఎందుకు పడిపోతుందో గుర్తించాలని సూటిగా సుత్తిలేకుండా చెప్పేస్తున్నారట. పనితీరు దారుణంగా ఉన్నవారికి గట్టిగానే అక్షింతలు పడ్డట్టు చెబుతున్నారు.
జనాల్లో ఉండేందుకే మొగ్గు చూపుతున్న ఎమ్మెల్యేలు
అప్పటి వరకు నియోజకవర్గాల్లో తమదే రాజ్యం.. తగ్గేదే లేదన్నట్టుగా సాగిన కొందరు ఎమ్మెల్యేల యవ్వారం.. పార్టీ పెద్దలతో మీటింగ్ తర్వాత మారిపోయిందట. మీటింగ్ ముగిసిన వెంటనే నియోజకవర్గాల్లో వాలిపోయారట. కొందరైతే నియోజకవర్గాల నుంచి కాలు బయట పెట్టడానికి ఇష్ట పడటం లేదని సమాచారం. జనాల్లో ఉండేందుకే ఎక్కువ మొగ్గు చూపుతున్నారట. ఏ అంశంలో గ్రాఫ్ పడిపోయింది.. మైనస్ మార్కులు ఎక్కడ పడ్డాయి.. లోపాలు ఎక్కడున్నాయో గుర్తించే పనిలో పడ్డారట.
ఎమ్మెల్యేల తీరుపై కేడర్ ఆశ్చర్యం..!
ఎమ్మెల్యేలలో వచ్చిన ఈ మార్పు పార్టీ కేడర్‌ను ఆశ్చర్య పరుస్తోందట. అయితే అధిష్ఠానం అక్షింతలు వేసిందని తెలిస్తే.. పరువు పోతుందని లౌక్యంగా పని కానిచ్చేందుకు ఆపసోపాలు పడుతున్నట్టు సమాచారం. వచ్చే ఎన్నికల నాటికి పరిస్థితులను అనుకూలంగా మలుచుకునేందుకు చెమటోడుస్తున్నారట. దీంతో ఆ ఎమ్మెల్యేలు ఎవరనే ఆసక్తి పార్టీ వర్గాల్లో పెరిగిపోతోంది. మరి.. గులాబీ పెద్దల హితోక్తులతో ఎంతమంది పనితీరు మెరుగుపర్చుకుంటారో చూడాలి.