Off The Record: ప్రత్యర్థులు సైరన్ల మీద సైరన్లు మోగిస్తుంటే… అక్కడ అధికార టీడీపీ ఎమ్మెల్యేలు మాత్రం మాకేం పట్టదన్నట్టు గమ్ముగా ఉంటున్నారు. విపక్షం డైరెక్ట్‌గా పార్టీ పెద్దల్నే టార్గెట్ చేస్తున్నా… మెజార్టీ ఎమ్మెల్యే సీట్లు గెల్చుకున్న చోట ఎందుకు రియాక్షన్ ఉండటం లేదు? దెబ్బ కొట్టడం తర్వాత… కనీసం అసలు విషయం ఇదీ… అని ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఎక్కడి ఎమ్మెల్యేలు అంత డిమ్‌గా ఉన్నారు? బ్యాక్‌గ్రౌండ్ స్టోరీ ఏంటి?
ప్రత్యర్థుల్ని ఇరుకున పెట్టడానికి ఏ చిన్న ఛాన్స్ దొరికినా వదలరు రాజకీయ నాయకులు. కానీ…ఈ విషయంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సొంత జిల్లా చిత్తూరు టీడీపీ నేతలు మాత్రం కాస్త డిఫరెంట్‌గా కనిపిస్తున్నారని సొంత కేడరే మాట్లాడుకుంటోంది. ఉమ్మడి జిల్లాలోని మొత్తం 14 స్థానాలకుగాను 12 చోట్ల గెలిచినా… జిల్లాకు ఒక్క మంత్రి పదవి కూడా లేకపోవడం, గుర్తింపు ఉన్న ఏ ఇతర పదవులు రాకపోవడంతో…డీలా పడ్డారట జిల్లా టీడీపీ లీడర్స్. దానికి తోడు జిల్లాకు వచ్చిన ఒకరిద్దరు అధికారులతోనూ ఎమ్మెల్యేలకు సరిపడకపోవడంతో ఇన్నాళ్లు పోరాటం చేసి కేసులు పెట్టించుకున్నది ఇందుకేనా అంటూ అసహనంగా ఉన్నట్టు సమాచారం. ఈ పరిస్థితుల్లో జిల్లాలో వైసీపీ కార్యకలాపాలను, ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాళ్ళు చేస్తున్న ప్రచారాలను పట్టించుకోవడం మానేశారట. ఇప్పుడు అదే ప్రతిపక్షాని అడ్వాంటేజ్ అవుతోందంటున్నారు కార్యకర్తలు. గోశాలతో పాటు.. తిరుమల కేంద్రంగా నడిచిన వివాదాలు, తోతాపురి మామిడి రైతుల ఆందోళన, అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టిన వ్యవహారం, తాజాగా ములకలచెరువులో నకిలీ మద్యం తయారీ… ఇలాంటి వాటన్నిటికి సంబంధించి వైసీపీ పెద్ద ఎత్తున విమర్శలు ఆరోపణలతో పాటు ఆందోళనలు కూడా చేస్తున్నా… ఇప్పటివరకు ఏ అంశానికి సంబంధించి జిల్లా ఎమ్మెల్యేలు నోరు మెదపకపోవడంపై టీడీపీ వర్గాల్లోనే అసహనం పెరుగుతోందట.
Read Also: Broken Heart Syndrome: లవ్ బ్రేకప్ అయితే గుండెపోటు వస్తుందా?
ఇక, అధికారంలోకి వచ్చి ఏడాదిన్నారే కదా అయింది.. అప్పుడే అంతలా అసంతృప్తి వ్యక్తం చేస్తే ఎలాగన్న ప్రశ్నలు సైతం వస్తున్నాయట. ఒకప్పుడు చంద్రబాబుపై ఈగ వాలనీయకుండా రియాక్ట్ అయిన కిషోర్ కుమార్ రెడ్డి , అమర్ నాథ్ రెడ్డి, గాలి భాను ప్రకాష్, నాని లాంటి నేతలు ఇప్పుడసలు జిల్లా విషయాలను పట్టించుకోవడమే మానేశారన్నది బహిరంగ రహస్యం. ఇక మిగిలిన ఎమ్మెల్యేలదీ అదే దారి. వైసిపి తెరపైకి తెచ్చిన అంశాలన్నీ తమకు డ్యామేంజింగ్‌గా ఉంటున్నా… ఎమ్మెల్యేలు మౌనంగా వీడకపోవడం ప్రతిపక్షానికి బలంగా మారుతోందన్న మాటలు వినిపిస్తున్నాయి పొలిటికల్ సర్కిల్స్‌లో. తోతాపురి మామిడికి గిట్టుబాటు ధర కల్పించడంతోపాటు పక్క రాష్ట్రాల నుంచి పంట రానీకుండా చూడడంలో సక్సెస్ అయ్యింది ప్రభుత్వం. కానీ… గిట్టుబాటు ధర అంటూ వైసీపీ అంత రచ్చ చేస్తున్నా… జిల్లా ఎమ్మెల్యేలు చేసింది చెప్పుకోలేకపోయారన్న అసహనం పార్టీ పెద్దలకు కూడా ఉందట. ఇక జీడీ నెల్లూరులో అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టింది వైసిపి సర్పంచే అయినప్పటికీ… ఆ బురదను టిడిపికి అంటించాలని మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి సహా జిల్లా వైసీపీ నేతలు ప్రయత్నించారని, తప్పు చేసిన వాళ్ళే రివర్స్‌లో ధర్నాలు చేస్తూ ప్రెస్ మీట్స్ పెడుతుంటే టీడీపీ ఎమ్మెల్యేలు ఎందుకు రియాక్ట్ అవలేదన్నది కేడర్ క్వశ్చన్. దాంతో మొదట్లో వైసీపీ చేసిన ప్రచారాన్నే నమ్మే పరిస్థితి వచ్చిందన్న ఆందోళ వ్యక్తం అవుతోంది.
Read Also: CM Chandrababu: హార్డ్ వర్క్ కాదు, స్మార్ట్ వర్క్ చేయండి.. వైకుంఠ పాళి గేమ్స్ వద్దు..
అయితే, హోం మంత్రిని నేరుగా వెళ్లాక గానీ వాస్తవాలు తెలియలేదంటే.. జిల్లా నేతలు ఏ స్థితిలో ఉన్నారో అర్ధం చేసుకోవచ్చని అంటోందట కేడర్. ఇక ములకల చెరువులో నకిలీ మద్యం తయారీ విషయంలోనూ ఎమ్మెల్యేలు నోరు మెదపకపోవడం మరింత ఆగ్రహం కలిగిస్తోందట. ములకలచెరువులో పట్టుకున్నది ఒక చిన్న ఇంటిలో తయారు చేస్తున్న మద్యాన్ని. కానీ… అక్కడ నుండి రాష్ట్రం మొత్తానికి నకిలీ మద్యాన్ని సరఫరా చేస్తున్నారంటూ వైసీపీ చేస్తున్న తెగ ప్రచారం చేస్తున్నా ఖండించలేకపోవడం ఏంటి? జయచంద్రారెడ్డి ఇప్పుడు టీడీపీలో ఉన్నా… అతని మూలాలు ఎక్కడున్నాయో ఎందుకు చెప్పలేకపోతున్నారంటూ నిలదీస్తున్నారట. ఇక ఎంపీ మిధున్ రెడ్డి లిక్కర్ కేసులో బెయిల్ పై విడుదలయ్యాక తిరుపతిలో ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబును, లోకేష్‌ను తీవ్రస్థాయిలో విర్శించినా వీరి నుండి నో రెస్పాన్స్. ఇలా..ఒకటా రెండా… చెప్పుకుంటూ పోతే.. అధినేత మీద అలిగిన టీడీపీ ఎమ్మెల్యేలు అసలుకే మోసం తెస్తున్నారన్నది పార్టీ కేడర్ చర్చ.
Read Also: Ayodhya: అయోధ్యలో 26 లక్షల దీపాలు.. రెండు గిన్నీస్ రికార్డులు
కాగా, అందుకు వాళ్ళ సమాధానం వేరేలా ఉందట. ఐదేళ్లు రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా కేసులతో జైలు పాలైన మమ్మల్ని గుర్తించనప్పుడు.. మీకు సమస్యలు వచ్చాయని మేమెందుకు మాట్లాడాలన్నది వాళ్ళ వెర్షన్. ఈ విషయాన్ని నేరుగా చెప్పకున్నా.. ఉద్దేశ్యం మాత్రం అదేనని అంటున్నారు. జిల్లాకు ఒక్క మంత్రి పదవి లేకపోవడం, కనీస గౌరవ ఉండే పదవి దక్కకపోవడం, గెలిచి ఏడాదిన్నర అవుతున్నా జిల్లా ఎమ్మెల్యేలతో చంద్రబాబు ఒక్కసారి కూడా సమావేశం అవకపోవడం లాంటివన్నీ కలగలిసి.. బాబు వదిలేశాడు కాబట్టి మేమూ వదిలేస్తున్నాం అన్నట్టుగా ఉన్నారట చిత్తూరు ఎమ్మెల్యేలు. జిల్లాలో పెద్దిరెడ్డి కుటుంబం, కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి ,రోజా లాంటి నేతలుంటే వాళ్ళని ఎదుర్కోవడానికి మాకు కాస్తంత భరోసా కూడా పార్టీ పెద్దలు ఇవ్వడం లేదని అలాంటప్పుడు మేమెందుకు చొరవ తీసుకోవాలన్నది టీడీపీ ఎమ్మెల్యేల ప్రశ్న. 2014 -19 మధ్య కూడా చంద్రబాబు ఇలానే వ్యవహరించారని, ఇప్పుడు అదే తప్పును మళ్ళీ చేస్తున్నారన్నది సీనియర్స్ మాట.
